ఒమిక్రాన్
గుంటూరు మెడికల్: దేశవ్యాప్తంగా కొద్దిరోజులుగా ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్న దృష్ట్యా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. విదేశాల నుంచి వస్తున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టింది. గతంలో అనుసరించిన ట్రేస్, టెస్ట్, ట్రీట్ విధానాన్నే అవలంబిస్తోంది.
విదేశాల నుంచి జిల్లాకు 864 మంది
విదేశాల నుంచి వచ్చిన వారి గురించి అధికారులు ప్రాంతాల వారీగా జల్లెడపడుతున్నారు. ఆరోగ్య కేంద్రాల వైద్య సిబ్బంది ద్వారా ట్రేస్ చేస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారితోపాటు వారిని ఇటీవల కలిసిన వారికీ వైరస్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. వైరస్ సోకినట్టు నిర్ధారణైతే తక్షణం వైద్యం అందించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు మొదలైనప్పటి నుంచి జిల్లాకు పలు దేశాల నుంచి 864 మంది వచ్చారు. వీరంతా ఎక్కడెక్కడ ఉంటున్నారో వారి పాస్‌పోర్టు ఆధారంగా వైద్యసిబ్బంది గుర్తించారు. వారిని కలిసిన వారితోపాటు ఇప్పటివరకూ 1,109 మందికిపైగా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేశారు. అదృష్టవశాత్తూ ఎవరికీ పాజిటివ్ రిపోర్టు రాలేదు.
నిత్యం సర్వే
విదేశాల నుంచి వస్తున్న వారి సమాచారాన్ని జిల్లా రెవెన్యూ అధికారుల వద్ద నుంచి సేకరించిన వైద్య అధికారులు ప్రతిరోజూ ఆయా ఆరోగ్య కేంద్రాల వైద్య సిబ్బందికి చేరవేసి సర్వే చేయిస్తున్నారు. దీనికోసం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో ప్రత్యేకంగా వైద్యులు, సిబ్బందిని అందుబాటులో ఉంచారు.
ముందస్తు కట్టడే వ్యూహం
ఒమిక్రాన్‌ను ముందుగానే కట్టడి చేయాలనే వ్యూహంతో ముందుకెళ్తున్నట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జొన్నలగడ్డ యాస్మిన్ తెలిపారు.
యాంటీబాడీస్‌పై శ్రద్ధ
యాంటీ బాడీస్ పరీక్షపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ప్రస్తుతం ఈ పరీక్ష చేయించుకునేందుకు ఎక్కువ మంది ల్యాబ్‌లను ఆశ్రయిస్తున్నారు. శరీరంలోని యాంటీబాడీస్ కరోనా వైరస్ సోకకుండా రక్షణ కల్పిస్తాయి కాబట్టి.. అవి ఉన్నాయా లేదా అనే సందేహాన్ని నివృత్తి చేసుకునేందుకు యత్నిస్తున్నారు. ఫలితంగా ప్రైవేటు ల్యాబ్‌లు కిటకిటలాడుతున్నాయి. ఒమిక్రాన్ భయంతో రెండు డోసులు టీకా వేసుకున్న వారూ యాంటీబాడీస్ టెస్టు చేయించుకుంటున్నారు. అవసరమైతే మూడో డోస్ వేయించుకునేందుకు యత్నిస్తున్నారు.
అనుమతులు రాలేదు
ఎలాంటి వైరస్ సోకినా శరీరంలో కొంత వరకు యాంటీబాడీస్ వృద్ధి చెందుతాయి. బూస్టర్ డోస్‌పై ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రాలేదు. చాలామంది యాంటీబాడీస్ టెస్టుల కోసం, మూడో డోస్ వేయించుకోవాలా లేదా అనే సందేహాలతో వైద్యసిబ్బందిని, అధికారులను సంప్రదిస్తున్నట్టు సమాచారం ఉంది. రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయిన వారు కోవిడ్–19 నిబంధనలు పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి భయం లేకుండా ఉండొచ్చు.
– డీఎంహెచ్‌ఓ డాక్టర్ జొన్నలగడ్డ యాస్మిన్
Comments
Please login to add a commentAdd a comment