సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతున్న తరుణంలో ప్రముఖ ఔషధ కంపెనీలన్నీ వైరస్ విరుగుడును కనిపెట్టే ప్రకియలో నిమగ్నమయ్యాయి. కరోనా నివారణకు వ్యాక్సిన్‌ను కనిపెట్టామని ఇప్పటికే పలు కంపెనీలు ప్రకటించినా అవేవీ ఇంకా అందుబాటులోకి రాలేదు. ఈ క్రమంలోనే ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) శుక్రవారం కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది ఆగస్ట్ 15 కల్లా వ్యాక్సిన్‌ను విడుదల చేస్తామని చల్లని కబురు చెప్పింది. వ్యాక్సిన్ ప్రస్తుతం మానవ ప్రయోగ దశలో ఉందని, ఇప్పటికే నిర్వహించిన జంతువులపై ప్రయోగం మెరుగైన ఫలితాలు ఇచ్చాయని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ను ఐసీఎంఆర్ క్లినికల్ టెస్టులు వేగవంతం చేయనుంది. (మలి దశకు వ్యాక్సిన్ ప్రయోగాలు)
పుణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సహకారంతో కరోనా నివారణ కోవాక్సిన్‌ను భారత్ బయోటిక్‌తో కలిసి ఐసీఎంఆర్ రూపొందిస్తోంది. మానవులపై కోవాక్సిన్ ప్రయోగాలు విజయవంతమైతే వైరస్‌పై సమర్థవంతమైన వ్యాక్సిన్‌గా ఈ ఔషధం నిలువనుంది. మరోవైపు ప్రపంచం నలుమూలల్లో కనీసం మూడు నాలుగు కొత్త వ్యాక్సిన్లు ఆశాజనక ఫలితాలు చూపుతున్నాయి. కోవిడ్–19ను జయించగలమన్న భరోసాను ప్రజల్లో కల్పిస్తున్నాయి. అంతర్జాతీయ ఫార్మా కంపెనీ ఫైజర్, చైనాలోని కాన్‌సైనో, ఆస్ట్రేలియాలోని వ్యాక్సైన్‌లు కీలకమైన దశలు దాటుకుని వేగంగా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చే దిశగా సాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment