సాక్షి, న్యూఢిల్లీ : కరోనా కట్టడికి హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన వ్యాక్సిన్ ‘కోవాక్సిన్’ను మానవులపై ప్రయోగించేందుకు భారత డ్రగ్ కంట్రోలర్ అనుమతి లభించిన విషయం తెల్సిందే. ఈ మానవ ట్రయల్స్‌లో పాల్గొనే వారు జూలై 7లోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని, ఆగస్టు 15వ తేదీలోగా కోవాక్సిన్‌ను ఆవిష్కరించాలంటూ భారత వైద్య పరిశోధనా మండలి డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ గురువారం లేఖ రాయడం పట్ల వైద్య నిపుణులు, పరిశోధనా వర్గాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. (గుడ్న్యూస్: ఆగస్ట్ 15కి వ్యాక్సిన్)
మానవులపై ట్రయల్స్ జరగకముందే ఎలా వ్యాక్సిన్ విడుదలకు తేదీని ఖరారు చేస్తారని ‘ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ ఎథిక్స్’ సంపాదకులు అమర్ జెసాని ప్రశ్నించారు. మానవులపై వ్యాక్సిన్ ట్రయల్స్ విజయం అవుతాయన్న నమ్మకం ఏమిటని ఆయన అన్నారు. మానవ ట్రయల్స్‌లో పాల్గొంటున్న 12 సంస్థల్లో మెజారిటీ సంస్థలు కూడా భార్గవ లేఖ పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశాయి. ఎథిక్స్ కమిటీ అనుమతి ఇవ్వకుండా తాము మానవ ట్రయల్స్ పాల్గొనలేమని, ఆగస్టు 15వ తేదీ కాదుగదా, డిసెంబర్ 15వ తేదీ నాటికి కూడా ఇది సాధ్యమయ్యే పని కాదని ఒడిశాలోని ‘ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ సమ్ హాస్పిటల్’ ట్రయల్స్ ఇంచార్జి వెంకట్రావు తెలిపారు. (టీకా కోసం ఐసీఎంఆర్, భారత్ బయోటెక్ జట్టు)
ఇది జంతువులపై ట్రయల్స్ అని, మానవులపై ట్రయల్స్ అని, సాక్షాత్తు ప్రధాన మంత్రి జోక్యం చేసుకున్నా రెండు, మూడు నెలల్లో ట్రయల్స్ పూర్తి కావని మరో ప్రభుత్వాస్పత్రికి చెందిన ఎథిక్స్ కమిటీ పేర్కొంది. భార్గవ లేఖ గురించి తనకు తెలియదని, నిర్దేశించిన కాల వ్యవధిలో వ్యాక్సిన్‌ను ఆవిష్కరించడం అసాధ్యమని, ఎంత సత్వర నిర్ణయాలు తీసుకున్నా ఆవిష్కరణకు కనీసం ఏడాది కాలం పడుతుందని ఐసీఎంఆర్ ఎథిక్స్ అడ్వైజరీ కమిటీ చైర్‌పర్సన్ వసంత ముత్తుస్వామి చెప్పారు. ఇలా అనవసరంగా తొందరపెడితే తాము మానవ ట్రయల్స్‌లో పాల్గొనమని 12 సంస్థల్లో కొన్ని సంస్థలు హెచ్చరిస్తున్నాయి. (మనుషులపై ప్రయోగానికి 'భారత్' వ్యాక్సిన్)
Comments
Please login to add a commentAdd a comment