అహ్మదాబాద్/పుణె/సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను భయపెడుతున్న వేళ అందరూ వ్యాక్సిన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వివిధ కంపెనీలు అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు తుది దశకు చేరుకోవడంతో తాజా పరిస్థితుల్ని సమీక్షించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒకే రోజు పుణె, అహ్మదాబాద్, హైదరాబాద్‌లలో వ్యాక్సిన్ తయారీ కేంద్రాలను సందర్శించనున్నారు. ప్రధాని స్వయంగా శనివారం ఈ మూడు నగరాలకు వెళ్లి కరోనా వ్యాక్సిన్ పురోగతిని సమీక్షిస్తారని పీఎంఓ కార్యాలయం వెల్లడించింది.
‘‘ప్రధానమంత్రి నరేంద్రమోదీ కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి, తయారీ ప్రక్రియను సమీక్షిస్తారు. శనివారం ఆయన అహ్మదాబాద్‌లో జైడస్ బయోటెక్ పార్క్‌ని, హైదరాబాద్‌లో భారత్ బయోటెక్, పుణెలో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాను సందర్శిస్తారు’’ అని ప్రధాని కార్యాలయం ఒక ట్వీట్‌లో పేర్కొంది. కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు దాదాపుగా పూర్తి కావస్తూ ఉండడంతో శాస్త్రవేత్తలతో స్వయంగా ప్రధాని మోదీ మాట్లాడి అన్ని వివరాలు తెలుసుకోనున్నారు. దీని వల్ల భారత్‌లో వంద కోట్లకు పైగా జనాభాకి వ్యాక్సిన్ ఇవ్వడంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి అవసరమయ్యే మార్గదర్శకాల రూపకల్పన చేసుకోవచ్చునని పీఎంఓ తెలిపింది.
మొదట అహ్మదాబాద్‌కు..
శనివారం ఉదయం తొలుత గుజరాత్‌లోని జైడస్ క్యాడిలా ప్లాంట్‌ను మోదీ సందర్శించనున్నారు. అహ్మదాబాద్‌కి 20 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ ప్లాంట్‌కి మోదీ 9.30కి చేరుకుంటారని గుజరాత్ ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. జైడస్ తయారు చేస్తున్న జికోవ్–డి వ్యాక్సిన్ ప్రస్తుతం రెండో దశ ప్రయోగాలు జరుగుతున్నాయి. ముందు అనుకున్న షెడ్యూల్ ప్రకారం కాకుండా ప్రధాని పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రధాని మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రత్యేక విమానంలో హకింపేటలోని సైనిక విమానాశ్రయానికి చేరుకుంటారు.
అక్కడి నుంచి రోడ్డు మార్గంలో భారత్ బయో టెక్ కు వెళ్లి అక్కడ వ్యాక్సిన్ తయారీని పరిశీలిస్తారు. భారత్ స్వదేశీయంగా రూపొందిస్తున్న ఈ వ్యాక్సిన్ ప్రస్తుతం మూడో దశ ప్రయోగాల్లో ఉంది. దీని గురించి శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకోనున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు రెండు రోజుల ముందు ప్రధాని అధికారిక పర్యటనలో భాగంగా హైదరాబాద్ నగరానికి వస్తుండడంతో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్ పర్యటన అనంతరం సాయంత్రం 4.30 గంటలకు పుణెలోని సీరమ్ ఇనిస్టిట్యూట్‌కి వెళతారు. ఆస్ట్రాజెనికా–ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ కరోనా వ్యాక్సిన్ ఇక్కడ తయారవుతోంది. సాయంత్రం ప్రధాని ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు.
కలిసి పనిచేద్దాం.. సవాళ్లను ఎదుర్కొందాం
కరోనా మహమ్మారిపై పోరాటంతోపాటు వాణిజ్యం, పెట్టుబడులు, వాతావరణ మార్పులు, రక్షణ వంటి కీలక అంశాల్లో పరస్పరం సహకరించుకుందామని భారత్, బ్రిటన్ ప్రధానులు నరేంద్ర మోదీ, బోరిస్ జాన్సన్ నిర్ణయించుకున్నారు. కలిసి పని చేస్తూ ఉమ్మడి సవాళ్లను ఎదుర్కొందామని తీర్మానించుకున్నారు. మోదీ శుక్రవారం జాన్సన్‌తో మాట్లాడారు. ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించుకున్నారు. రెండు దేశాల మధ్య సహకారం పెరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. వైరస్ విసురుతున్న సవాళ్లతోపాటు వ్యాక్సిన్ అభివృద్ధి, తయారీలో సహకారంపై సమీక్షించారు. భాగస్వామ్యంపై రోడ్‌మ్యాప్ రూపకల్పన వేగవంతం చేయాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment