సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ అంతానికి వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్న వేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక విషయాన్ని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ కోసం ప్రయత్నాలు శరవేగంగా జరుగుతున్నప్పటికీ ఆరోగ్యంగా ఉన్న యువత కరోనా టీకా కోసం 2022 వరకు వేచి చూడాల్సి ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఎందుకంటే కరోనా ప్రమాదం ఎక్కువ పొంచి ఉన్న ఆరోగ్య సంరక్షణ కార్మికులు, ఫ్రంట్ లైన్ కార్మికులకే మొదటి ప్రాధాన్యత ఉంటుందని, వారితోనే టీకా ప్రక్రియ మొదలవుతుందని డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ సైంటిస్ట్ సౌమ్యా స్వామినాథన్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యకరమైన యువత 2022 వరకు వేచి ఉండాల్సి ఉంటుందన్నారు. (రెండో వాక్సిన్ : పుతిన్ కీలక ప్రకటన)
వైరస్ వల్ల రిస్క్‌లో ఉన్న హెల్త్ వర్కర్లకు ముందుగా టీకా అందుతుందని స్వామినాథన్ చెప్పారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి అనేక మార్గదర్శకాలు రానున్నాయని, దీంతో ఆరోగ్యంగా ఉన్న యువత వాక్సిన్ కోసం 2022 వరకు ఎదురు చూడాల్సి ఉంటుందని ఆమె తెలిపారు. 2021 వరకు కనీసం ఒక్క వ్యాక్సిన్ అయినా వస్తుందని ఆమె అన్నారు.
ప్రస్తుతానికి ప్రపంచ వ్యాప్తంగా పలు రకాల కరోనా టీకా ట్రయల్స్ శరవేగంగా జరుగుతున్నాయని, ముందుగా ఎవరికి టీకా ఇవ్వాలన్న అంశంపై చర్చలు జరుగుతున్నట్లు స్వామినాథన్ తెలిపారు. హెల్త్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు ముందు కరోనా టీకా ఇవ్వాలని చాలా మంది అంగీకరిస్తున్నారని, అయినా ఆ వర్కర్లలో ఎవరికి ముందుగా ఇవ్వాలన్న అంశం కూడా చర్చిస్తున్నామన్నారు. ఆ తర్వాత వృద్ధులకు టీకా ఇవ్వనున్నట్లు స్వామినాథన్ తెలిపారు. టీకా చాలా తక్కువ మోతాదులో అందుబాటులో ఉంటుందన్నారు. అలాగే మరణాల శాతం తగ్గుతోందన్న సంతృప్తితో నిర్లక్ష్యంగా ఉండకూడదని సూచించారు. పెరుగుతున్న కేసుల సంఖ్య వల్ల మరణాల రేటు కూడా పెరిగే అవకాశం ఉందని సౌమ్య హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment