
న్యూఢిల్లీ: దేశంలో కరోనాతో తీవ్రంగా ప్రభావితమయ్యేవారికి 60కోట్ల డోసుల వాక్సిన్‌ను అందించేందుకు ఎన్నికల యంత్రాంగాన్ని వినియోగించనున్నట్లు నీతిఆయోగ్ సభ్యుడు వీకే పాల్ చెప్పారు. అతి త్వరలో టీకాలకు అనుమతి వచ్చే అవకాశాలున్నాయని తెలిపారు. వచ్చే 6–8 నెలల్లో సాంప్రదాయ కోల్డ్ చైన్ వ్యవస్థ ద్వారా వ్యాక్సిన్ సరఫరా జరుగుతుందని, ఇందుకోసం ఎన్నికల యంత్రాంగ సాయం తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వం కోల్డ్ స్టోరేజీలను 2–8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద మెయిన్‌టెయిన్ చేస్తూ తయారుగా ఉందని చెప్పారు. భారత్‌లో వినియోగానికి త్వరలో రానున్న నాలుగు కంపెనీల వ్యాక్సిన్ల(సీరమ్, భారత్, జైడస్, స్పుత్నిక్)కు ఈ ఏర్పాట్లు సరిపోవచ్చన్నారు.
త్వరలో ఏదో ఒక వ్యాక్సిన్‌కు నియంత్రణా సంస్థ నుంచి అత్యవసర వాడుకకు అనుమతి వస్తుందని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. అయితే టీకా ధరపై ఇంకా ప్రభుత్వం చర్చించాల్సిఉందని, అలాగే కొనుగోలు ఆర్డర్లు ఇవ్వాల్సిఉందని చెప్పారు. టీకాలను తొందరగా ఆమోదించాలని నియంత్రణా సంస్థలపై ఎలాంటి ఒత్తిడి తీసుకురావట్లేదని స్పష్టం చేశారు. ఫస్ట్ ఫేజ్‌లో 30 కోట్ల మందికి దాదాపు 60 కోట్ల వ్యాక్సిన్ డోసులు అవసరపడతాయి. ఈ 30 కోట్ల మంది ప్రజల్లో 50 ఏళ్లు దాటిన వారు దాదాపు 26 కోట్ల మంది ఉండొచ్చని, 3 కోట్ల మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లుంటారని, కోటి మంది సీరియస్ కండీషన్ ఉన్నవాళ్లుంటారని పాల్ చెప్పారు.