వాయువేగంతో ఒమిక్రాన్‌.. ఒకే రోజు 65శాతం జంప్‌ | India reports 58,097 new Covid cases and 534 deaths, Omicron tally at 2,153 | Sakshi
Sakshi News home page

వాయువేగంతో ఒమిక్రాన్‌.. ఒకే రోజు 65శాతం జంప్‌

Published Thu, Jan 6 2022 3:39 AM | Last Updated on Thu, Jan 6 2022 5:14 AM

India reports 58,097 new Covid cases and 534 deaths, Omicron tally at 2,153 - Sakshi

న్యూఢిల్లీ: కరోనా ఒమిక్రాన్‌ వేరియెంట్‌ వాయువేగంగా విస్తరిస్తోంది. కేవలం ఒక్క రోజులోనే  కరోనా కేసులు దాదాపు 65 శాతం పెరిగిపోయాయి. సోమవారం 37,379 కేసులు నమోదైతే, ఆ తర్వాత 24 గంటల్లో ఏకంగా 58,097 కేసులు నమోదయ్యాయి. గత ఎనిమిది రోజుల్లో కరోనా కేసులు 6.3 రెట్లు పెరగడం ఆందోళనను పెంచుతోంది. డిసెంబరు 30న 1.10 శాతంగా ఉన్న దేశ సగటు పాజిటివిటీ రేటు వారం తిరిగేసరికి 4.18 (జనవరి 5) శాతానికి చేరుకోవడం గమనార్హం. ఆరు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కోవిడ్‌ యాక్టివ్‌ కేసుల సంఖ్య 10 వేలకు మించిపోయాయి. ఇక ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 2,135కి చేరుకున్నట్టు బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. క్రియాశీల కేసుల సంఖ్య 2 లక్షలు దాటిపోయింది.

దేశంలో తొలి ఒమిక్రాన్‌ మరణం
దేశంలో తొలి ఒమిక్రాన్‌ మరణం సంభవించింది.  రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఒమిక్రాన్‌ వేరియెంట్‌ సోకిన 73 ఏళ్ల వృద్ధుడు డిసెంబర్‌ 31న ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించింది. డిసెంబర్‌ 15న ఆయనకు కరోనా సోకగా జన్యుక్రమ విశ్లేషణ నివేదికలో ఒమిక్రాన్‌ సోకిందని డిసెంబర్‌ 25న వచ్చిన నివేదికలో తేలింది. అప్పటికే ఆయనకు జరిపిన పరీక్షల్లో రెండుసార్లు కరోనా నెగిటివ్‌ వచ్చింది. కరోనా తగ్గాక ఆ వృద్ధుడికి న్యుమోనియా సోకడంతో ప్రాణాలు కోల్పోయాడని ఉదయ్‌పూర్‌ చీఫ్‌ మెడికల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ దినేష్‌ ఖరాడి చెప్పారు.

ప్రికాషన్‌ డోసుగా అదే కంపెనీ వ్యాక్సిన్‌
నగరాలపై కరోనా పడగ విప్పడంతో బూస్టర్‌ డోసుపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, 60 ఏళ్లకు పైబడి వయసు ఉండి ఇతరత్రా అనారోగ్యాలతో బాధపడేవారు ప్రికాషనరీ డోసు తీసుకోవాలని పేర్కొంది. అంతకు ముందు రెండు డోసులు ఏ కంపెనీ వ్యాక్సిన్‌ తీసుకున్నారో అదే వ్యాక్సిన్‌ తీసుకోవాలని, వేరే కంపెనీది తీసుకోవద్దని స్పష్టం చేసింది. ప్రికాషనరీ డోసుని జనవరి 10 నుంచి ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా నీతి అయోగ్‌ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్‌ వి.కె.పాల్‌ స్పష్టం చేశారు.

తమిళనాడు, హిమాచల్‌లో నైట్‌ కర్ఫ్యూ
కరోనా కేసులు పెరిగిపోతూ ఉండడంతో తమిళనాడు ప్రభుత్వం ఆంక్షల్ని కఠినతరం చేసింది. గురువారం రాత్రి 10 నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్టుగా వెల్లడించింది. జనవరి 9 ఆదివారం రోజంతా సంపూర్ణ లాక్‌డౌన్‌ను ప్రకటించింది. అటు హిమాచల్‌ప్రదేశ్‌లో కూడా రాత్రి పూట కర్ఫ్యూ విధించారు. ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ర్యాలీలను, మహిళల నాలుగు మారథాన్‌లను రద్దుచేసుకుంది. ఎన్నికలు జరిగే ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి సమీక్షించాలని పీసీసీలకు సూచించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement