ముంబై, సాక్షి: అన్నీ అనుకున్నట్లు జరిగితే.. వచ్చే మార్చికల్లా కోవిడ్-19 కట్టడికి వ్యాక్సిన్‌ను విడుదల చేసే వీలున్నట్లు దేశీ ఫార్మా కంపెనీ జైడస్ క్యాడిలా ప్రతినిధులు తాజాగా పేర్కొన్నారు.సుమారు 1,000 మందిపై నిర్వహించిన రెండో దశ క్లినికల్ పరీక్షల డేటాను ఔషధ నియంత్రణ సంస్థలకు వచ్చే వారం దాఖలు చేయనున్నట్లు వెల్లడించారు. కరోనా వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ మూడో దశ పరీక్షలను డిసెంబర్‌లో చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలియజేశారు. మూడో దశలో భాగంగా 39,000 మందిపై వ్యాక్సిన్‌ను పరీక్షించే యోచనలో ఉన్నట్లు తెలియజేశారు. రెండో దశ పరీక్షలలో ప్రాథమిక డేటా ప్రకారం ఎలాంటి ఇబ్బందులూ తలెత్తలేదని తెలియజేశారు. వ్యాక్సిన్ భద్రతకు సంబంధించి పరిస్థితులు నియంత్రణలోనే ఉన్నట్లు వివరించారు. అన్ని పరీక్షలు విజయవంతమైతే 10 కోట్ల డోసేజీల తయారీని చేపట్టే ప్రణాళికల్లో ఉన్నట్లు ఇటీవల జైడస్ క్యాడిలా చైర్మన్ పంకజ్ ఆర్ పటేల్ పేర్కొన్న విషయం విదితమే.
ఒప్పందాలు..
వ్యాక్సిన్ టెక్నాలజీ కేంద్రంలో తయారీకి అనుగుణంగా జైడస్ క్యాడిలా తగిన సౌకర్యాలను సమకూర్చుకుంటున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. వ్యాక్సిన్లను భారీ స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు అవసరమైతే ఇతర కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ఉన్న అవకాశాలను సైతం కంపెనీ పరిశీలిస్తున్నట్లు వెల్లడించాయి. కంపెనీ జులైలో తొలి రెండు దశల క్లినికల్ పరీక్షలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. జైకోవ్-డీ పేరుతో ప్లాస్మిడ్ డీఎన్‌ఏ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసేందుకు నేషనల్ బయోఫార్మా మిషన్, బీఐఆర్‌ఏసీతో జైడస్ క్యాడిలా భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకుంది. తద్వారా దేశీయంగా వ్యాక్సిన్ తయారీకిఆ డీఎన్‌ఏ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించుకున్నట్లు ఈ సందర్భంగా ఫార్మా వర్గాలు పేర్కొన్నాయి.
ప్రధాని మోడీ పర్యటన
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శనివారం దేశీయంగా కోవిడ్-19 కట్టడికి వ్యాక్సిన్లను రూపొందిస్తున్న కేంద్రాలను సందర్శించే వీలున్నట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే అధికారికంగా పర్యటన ఖరారుకాలేదని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. కాగా.. పర్యటనలో భాగంగా తొలుత అహ్మదాబాద్‌లోగల జైడస్ క్యాడిలా వ్యాక్సిన్ తయారీ కేంద్రాన్ని ప్రధాని పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. జైకోవ్-డీ పేరుతో కోవిడ్-19 కట్టికి జైడస్ క్యాడిలా వ్యాక్సిన్‌ను రూపొందిస్తోంది. ఇక బ్రిటిష్ దిగ్గజం ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ తయారీకి ఒప్పందం కుదుర్చుకున్న పుణేలోని సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌ను సైతం ప్రధాని సందర్శించనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ బాటలో కోవాగ్జిన్ పేరుతో వ్యాక్సిన్‌ను రూపొందిస్తున్న హైదరాబాద్ కంపెనీ భారత్ బయోటెక్ యూనిట్‌నూ ప్రధాని మోడీ పరిశీలించనున్నట్లు సంబంధితవర్గాలు అభిప్రాయపడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment