cadila Healthcare
-
త్వరలో జైడస్ క్యాడిలా టీకా..!
అహ్మదాబాద్: భారత్‌లో తమ కోవిడ్ 19 వ్యాక్సిన్ ‘జైకోవ్–డీ’అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ ప్రముఖ ఫార్మా కంపెనీ జైడస్ క్యాడిలా ఈ నెలలో ప్రభుత్వానికి దరఖాస్తు చేయనుంది. ఈ నెలలోనే తమకు అనుమతి లభిస్తుందని ఆ కంపెనీ భావిస్తోంది. నెలకు కోటి డోసుల టీకాలను ఉత్పత్తి చేయగలమని, త్వరలో ఉత్పత్తి సామర్థ్యాన్ని నెలకు 4 కోట్లకు పెంచగలమని సంస్థ విశ్వాసం వ్యక్తం చేసింది. 2 – 8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ఆ టీకాను నిల్వ చేయాలని పేర్కొంది. ప్రస్తుతం భారత్‌లో కోవాగ్జిన్, కోవిషీల్డ్, స్పుత్నిక్ టీకాల వినియోగానికి అనుమతి ఉంది. ఇది భారత్‌లో తయారైన తొలి డీఎన్ఏ వ్యాక్సిన్ క్యాండిడేట్ అని జైడస్ క్యాడిలా ఎండీ డాక్టర్ శార్విల్ పటేల్ తెలిపారు. క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా 28 వేల మందికి ఈ టీకా వేశామన్నారు. వారిలో పెద్దలు, ఇతర ప్రాణాంతక వ్యాధులున్నవారితో పాటు 12 నుంచి 17 ఏళ్ల వయస్సున్న పిల్లలు ఉన్నారన్నారు. టీకా సామరŠాధ్యనికి సంబంధించిన పూర్తి సమాచారం రాగానే అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేస్తామని, అనుమతి రాగానే ఉత్పత్తి ప్రారంభిస్తామని తెలిపారు. -
మార్చికల్లా జైడస్ క్యాడిలా వ్యాక్సిన్!
ముంబై, సాక్షి: అన్నీ అనుకున్నట్లు జరిగితే.. వచ్చే మార్చికల్లా కోవిడ్-19 కట్టడికి వ్యాక్సిన్‌ను విడుదల చేసే వీలున్నట్లు దేశీ ఫార్మా కంపెనీ జైడస్ క్యాడిలా ప్రతినిధులు తాజాగా పేర్కొన్నారు.సుమారు 1,000 మందిపై నిర్వహించిన రెండో దశ క్లినికల్ పరీక్షల డేటాను ఔషధ నియంత్రణ సంస్థలకు వచ్చే వారం దాఖలు చేయనున్నట్లు వెల్లడించారు. కరోనా వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ మూడో దశ పరీక్షలను డిసెంబర్లో చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలియజేశారు. మూడో దశలో భాగంగా 39,000 మందిపై వ్యాక్సిన్‌ను పరీక్షించే యోచనలో ఉన్నట్లు తెలియజేశారు. రెండో దశ పరీక్షలలో ప్రాథమిక డేటా ప్రకారం ఎలాంటి ఇబ్బందులూ తలెత్తలేదని తెలియజేశారు. వ్యాక్సిన్ భద్రతకు సంబంధించి పరిస్థితులు నియంత్రణలోనే ఉన్నట్లు వివరించారు. అన్ని పరీక్షలు విజయవంతమైతే 10 కోట్ల డోసేజీల తయారీని చేపట్టే ప్రణాళికల్లో ఉన్నట్లు ఇటీవల జైడస్ క్యాడిలా చైర్మన్ పంకజ్ ఆర్ పటేల్ పేర్కొన్న విషయం విదితమే. ఒప్పందాలు.. వ్యాక్సిన్ టెక్నాలజీ కేంద్రంలో తయారీకి అనుగుణంగా జైడస్ క్యాడిలా తగిన సౌకర్యాలను సమకూర్చుకుంటున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. వ్యాక్సిన్లను భారీ స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు అవసరమైతే ఇతర కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ఉన్న అవకాశాలను సైతం కంపెనీ పరిశీలిస్తున్నట్లు వెల్లడించాయి. కంపెనీ జులైలో తొలి రెండు దశల క్లినికల్ పరీక్షలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. జైకోవ్-డీ పేరుతో ప్లాస్మిడ్ డీఎన్ఏ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసేందుకు నేషనల్ బయోఫార్మా మిషన్, బీఐఆర్ఏసీతో జైడస్ క్యాడిలా భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకుంది. తద్వారా దేశీయంగా వ్యాక్సిన్ తయారీకిఆ డీఎన్ఏ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించుకున్నట్లు ఈ సందర్భంగా ఫార్మా వర్గాలు పేర్కొన్నాయి. ప్రధాని మోడీ పర్యటన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శనివారం దేశీయంగా కోవిడ్-19 కట్టడికి వ్యాక్సిన్లను రూపొందిస్తున్న కేంద్రాలను సందర్శించే వీలున్నట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే అధికారికంగా పర్యటన ఖరారుకాలేదని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. కాగా.. పర్యటనలో భాగంగా తొలుత అహ్మదాబాద్‌లోగల జైడస్ క్యాడిలా వ్యాక్సిన్ తయారీ కేంద్రాన్ని ప్రధాని పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. జైకోవ్-డీ పేరుతో కోవిడ్-19 కట్టికి జైడస్ క్యాడిలా వ్యాక్సిన్‌ను రూపొందిస్తోంది. ఇక బ్రిటిష్ దిగ్గజం ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ తయారీకి ఒప్పందం కుదుర్చుకున్న పుణేలోని సీరమ్ ఇన్స్టిట్యూట్ను సైతం ప్రధాని సందర్శించనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ బాటలో కోవాగ్జిన్ పేరుతో వ్యాక్సిన్‌ను రూపొందిస్తున్న హైదరాబాద్ కంపెనీ భారత్ బయోటెక్ యూనిట్‌నూ ప్రధాని మోడీ పరిశీలించనున్నట్లు సంబంధితవర్గాలు అభిప్రాయపడ్డాయి. -
జైడస్ క్యాడిలా వ్యాక్సిన్ ఫేజ్-2 పూర్తి
ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ కట్టడికి అభివృద్ధి చేస్తున్న జైకోవి-డి వ్యాక్సిన్‌పై రెండో దశ పరీక్షలు పూర్తయినట్లు జైడస్ క్యాడిలా తాజాగా వెల్లడించింది. డిసెబర్‌లో మూడో దశ క్లినికల్ పరీక్షలను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు కంపెనీ ఎండీ షార్విల్ పటేల్ తెలియజేశారు. ఫేజ్-3లో 15,000-20,000 మందిపై పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. రెండో దశ పరీక్షల డేటాను ఈ నెలలో దేశీ ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ)కు అందించనున్నట్లు తెలియజేశారు. రెండో దశ పరీక్షలలో భాగంగా 1,000 మంది వొలంటీర్లపై వ్యాక్సిన్‌ను ప్రయోగించినట్లు పేర్కొన్నారు. ఈ డేటా విడుదల తదుపరి మూడో దశ పరీక్షలకు వెంటనే అనుమతి లభించగలదని భావిస్తున్నట్లు చెప్పారు. 2021 మార్చి-ఏప్రిల్‌కల్లా వ్యాక్సిన్ పరీక్షల తుది డేటాను సిద్ధం చేయగలమని భావిస్తున్నట్లు తెలియజేశారు. వెరసి 20201 తొలి అర్ధభాగంలో వ్యాక్సిన్‌ను విడుదల చేసే ప్రణాళికల్లో ఉన్నట్లు వివరించారు. -
క్యాడిలా హెల్త్‌కేర్- హెచ్డీఎఫ్సీ.. జోరు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో మార్టిగేజ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ కౌంటర్‌కు డిమాండ్ కొనసాగుతోంది. కాగా.. మరోపక్క ఈ ఆర్థిక సంవత్సరంక్యూ2(జులై- సెప్టెంబర్)లో ఆకర్షణీయ పనితీరు చూపడంతో ఫార్మా రంగ కంపెనీ క్యాడిలా హెల్త్‌కేర్ కౌంటర్ తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ ఈ ఏడాది క్యూ2లో రూ. 2,870 కోట్ల నికర లాభంఆర్జించింది. గతేడాది(2019-20) క్యూ2తో పోలిస్తే ఇది 28 శాతం క్షీణతకాగా.. గతంలో పెట్టుబడుల విక్రయం ద్వారా డివిడెండ్ ఆదాయం భారీగా లభించడంతో లాభాలు పెరిగినట్లు విశ్లేషకులు తెలియజేశారు. కాగా.. నికర వడ్డీ ఆదాయం 21 శాతం ఎగసి రూ. 3,647 కోట్లను తాకింది. నిర్వహణలోని ఆస్తుల విలువ(ఏయూఎం) 10 శాతంపైగా పెరిగి రూ. 5.4 ట్రిలియన్లను తాకింది. వీటిలో వ్యక్తిగత రుణాల వాటా 75 శాతం. స్థూల మొండిబకాయిలు(జీఎన్‌పీఏలు) 6 బేసిస్ పాయింట్లు తగ్గి 1.81 శాతానికి చేరాయి. ఈ నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ షేరు ఎన్ఎస్ఈలో తొలుత 4 శాతం జంప్‌చేసి రూ. 2,119ను తాకింది. ఇది మార్చి 13 తదుపరి గరిష్టంకాగా.. ప్రస్తుతం 3 శాతం లాభంతో రూ. 2,104 వద్ద ట్రేడవుతోంది. గత రెండు రోజుల్లో ఈ షేరు 10 శాతం ర్యాలీ చేయడం గమనార్హం. క్యాడిలా హెల్త్‌కేర్ ఈ ఏడాది క్యూ2లో క్యాడిలా హెల్త్‌కేర్ నికర లాభం సర్దుబాట్ల తదుపరి 73 శాతం ఎగసింది. రూ. 562 కోట్లను తాకింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం 13 శాతంపైగా వృద్ధితో రూ. 3,820 కోట్లకు చేరింది. యూఎస్ మార్కెట్లలో అమ్మకాలు 18 శాతం పుంజుకుని రూ. 1,709 కోట్లుగా నమోదయ్యాయి. దేశీయంగా ఫార్ములేషన్ల అమ్మకాలు సైతం 11 శాతం అధికంగా రూ. 1,087 కోట్లకు చేరాయి. ఈ నేపథ్యంలో క్యాడిలా షేరు ఎన్ఎస్ఈలో తొలుత 13 శాతం దూసుకెళ్లింది. రూ. 464 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. ప్రస్తుతం 7 శాతం లాభపడి రూ. 438 వద్ద ట్రేడవుతోంది. -
బంధన్ బ్యాంక్- క్యాడిలా హెల్త్ జోరు
వరుసగా ఐదో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల దౌడు తీస్తున్నాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ లాభాల ట్రిపుల్ చేయడం ద్వారా 40,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. కాగా.. ఊపరితిత్తులకు ఎదురయ్యే సమస్యల నుంచి ఉపశమనాన్ని కల్పించే ఔషధాన్ని దేశీ మార్కెట్లో విడుదల చేసినట్లు వెల్లడించడంతో క్యాడిలా హల్త్‌కేర్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. మరోపక్క ఈ ఏడాది(2020-21) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర బిజినెస్‌ను సాధించిన వార్తలతో బంధన్ బ్యాంక్ కౌంటర్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. క్యాడిలా హెల్త్‌కేర్ ప్రెజరైజ్డ్ మీటర్డ్ డోస్ ఇన్హేలర్(పీఎండీఐ)ను దేశీయంగా తొలిసారి విడుదల చేసినట్లు ఫార్మా రంగ కంపెనీ క్యాడిలా హెల్త్‌కేర్ తాజాగా పేర్కొంది. ఊపిరి తీయడంలో ఎదురయ్యే సమస్యల నుంచి ఈ ఔషధం ఉపశమనాన్ని కల్పిస్తుందని కంపెనీ తెలియజేసింది. ఎల్ఏఎంఏ, ఎల్ఏబీఏలతో కూడిన ఈ ఇన్హేలర్ సీవోపీడీ రోగుల చికిత్సలో వినియోగించవచ్చని వివరించింది. ఫార్గ్లిన్ పీఎండీఐగా పిలిచే ఈ ప్యాక్ విలువ రూ. 495గా తెలియజేసింది. ఈ నేపథ్యంలో క్యాడిలా హెల్త్‌కేర్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 4.4 శాతం జంప్‌చేసి రూ. 431 వద్ద ట్రేడవుతోంది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. గత నెల రోజుల్లో ఈ షేరు 17 శాతం పుంజుకుంది! బంధన్ బ్యాంక్ ఇటీవల ర్యాలీ బాటలో సాగుతున్న ప్రయివేట్ రంగ సంస్థ బంధన్ బ్యాంక్ కౌంటర్ మరోసారి వెలుగులో నిలుస్తోంది. క్యూ2(జులై-సెప్టెంబర్)లో బ్యాంక్ రుణ వృద్ధి 20 శాతం పుంజుకోవడం దీనికి కారణంకాగా.. వసూళ్లు నిష్పత్తి 92 శాతంగా నమోదైనట్లు బ్యాంక్ తెలియజేసింది. డిపాజిట్లలోనూ 34 శాతం వృద్ధిని సాధించినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో బంధన్ బ్యాంక్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 2.3 శాతం ఎగసి రూ. 322 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 327ను అధిగమించింది. గత వారం రోజుల్లో ఈ షేరు 14 శాతం లాభపడటం గమనార్హం! -
జైడస్ క్యాడిలా క్లినికల్ పరీక్షలు షురూ
కరోనా వైరస్ కట్టడికి అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌పై క్లినికల్ పరీక్షలను ప్రారంభించినట్లు దేశీ హెల్త్‌కేర్ కంపెనీ జైడస్ క్యాడిలా తాజాగా వెల్లడించింది. వ్యాక్సిన్‌కు సంబంధించి క్లినికల్ జీఎంపీ బ్యాచ్‌లను ఇప్పటికే తయారు చేసినట్లు పేర్కొంది. తద్వారా దేశీయంగా వివిధ ప్రాంతాలలో ఈ నెలలోనే క్లినికల్ పరీక్షలను ప్రారంభించినట్లు తెలియజేసింది. జులై 4న నమోదైన దేశీ క్లినికల్ ట్రయల్ రిజస్ట్రీ(సీటీఆర్ఐ) గణాంకాల ప్రకారం తొలి దశ పరీక్షలు 84 రోజుల్లోగా పూర్తికానున్నట్లు తెలుస్తోంది. తదుపరి మరో 84 రోజులపాటు రెండో దశ పరీక్షలను నిర్వహించనున్నట్లు డేటా వెల్లడిస్తోంది. తద్వారా వ్యాక్సిన్ ప్రభావం, భద్రత తదితర అంశాలను పరిగణించనున్నట్లు డేటా తెలియజేసింది. తొలి దశ క్లినికల్ పరీక్షలను అహ్మదాబాద్‌లోని జైడస్ రీసెర్చ్ సెంటర్‌లోసైతం నిర్వహిస్తున్నట్లు సీటీఆర్ఐ డేటా పేర్కొంది. ప్రీక్లినికల్ ఓకే కోవిడ్-19 కట్టడికి వీలుగా ప్లాస్మిడ్ డీఎన్ఏ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినట్లు ఈ నెల మొదట్లో జైడస్ క్యాడిలా పేర్కొన్న విషయం విదితమే. అహ్మదాబాద్‌లోని వ్యాక్సిన్ టెక్నాలజీ కేంద్రంలో రూపొందించిన ఈ ఔషధ ప్రీక్లినికల్ పరీక్షలను విజయవంతంగా ముగించినట్లు తెలియజేసింది. ఎలుకలు, కుందేళ్లు తదితర పలు జంతువులలో వ్యాధి నిరోధక శక్తి బలపడినట్లు జైడస్ క్యాడిలా ఇప్పటికే వెల్లడించింది. ఈ వ్యాక్సిన్ వినియోగంతో తయారయ్యే యాంటీబాడీస్ కరోనా వైరస్‌ను నియంత్రిస్తున్నట్లు వివరించింది. తద్వారా మానవ క్లినికల్ పరీక్షలకు దేశీ ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) అనుమతిని పొందినట్లు పేర్కొంది. దీనిలో భాగంగా తొలి రెండు దశల క్లినికల్ పరీక్షలను ప్రారంభించినట్లు తెలుస్తోంది. -
క్యాడిలా లాభం మూడు రెట్లు
న్యూఢిల్లీ: క్యాడిలా హెల్త్‌కేర్ కంపెనీ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో మూడు రెట్లు పెరిగింది. గత క్యూ1లో రూ.138 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.461 కోట్లకు పెరిగిందని క్యాడిలా హెల్త్‌కేర్ తెలియజేసింది. అమ్మకాలు జోరుగా ఉండటంతో ఈ స్థాయిలో నికర లాభం సాధించామని పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.2,235 కోట్ల నుంచి రూ.2,894 కోట్లకు పెరిగింది. ఎబిటా 133 శాతం పెరిగి రూ.645 కోట్లకు చేరిందని, రూ.101 కోట్ల ఇతర ఆదాయం సాధించామని క్యాడిలా తెలియజేసింది. అమెరికా వ్యాపారం 27 శాతం వృద్ధితో రూ.1,230 కోట్లకు, భారత ఫార్ములేషన్స్ వ్యాపారం 40 శాతం వృద్ధితో రూ.893 కోట్లకు పెరిగాయి. ఈ క్యూ1లో కొత్తగా మూడు ఉత్పత్తులను అమెరికా మార్కెట్లోకి విడుదల చేశామని, మూడు కొత్త ఔషధాల కోసం దరఖాస్తు చేశామని, 13 కొత్త ఔషధాలకు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ నుంచి ఆమోదాలు పొందామని వివరించింది. విండ్లాస్ హెల్త్‌కేర్ కంపెనీలో 51 శాతం వాటాను రూ.156 కోట్లకు కొనుగోలు చేశామని క్యాడిలా హెల్త్‌కేర్ ఎక్సే్ఛంజీలకు తెలియజేసింది. ఫార్మా తయారీ విభాగాన్ని మరింత పటిష్టం చేసుకునే చర్యలో భాగంగా ఈ వాటాను కొనుగోలు చేశామని వివరించింది. వచ్చే నెల చివరికల్లా ఈ డీల్ పూర్తవ్వగలదని పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో క్యాడిలా హెల్త్‌కేర్ షేర్ ధర 6 శాతం పతనమై రూ.355 వద్ద ముగిసింది. -
స్టాక్స్ వ్యూ
క్యాడిలా హెల్త్‌కేర్ కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఫస్ట్‌కాల్ రీసెర్చ్ ప్రస్తుత ధర: రూ.1,813 టార్గెట్ ధర: రూ.2,200 ఎందుకంటే: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలంలో కంపెనీ నికర అమ్మకాలు 22% వృద్ధితో రూ.2,500 కోట్లకు, నికర లాభం 47% వృద్ధితో రూ.353 కోట్లకు పెరిగాయి. స్థూల లాభం 78 శాతం వృద్ధితో రూ.533 కోట్లకు ఎగసింది. నికర లాభం మార్జిన్ 242 బేసిస్ పాయింట్లు, ఇబిటా మార్జిన్ 604 బేసిస్ పాయింట్లు చొప్పున వృద్ధి చెందాయి. ఇతర ఆదాయం వంద శాతం ఎగసి రూ.21 కోట్లకు పెరిగింది. భారత ఫార్ములేషన్స్ మార్కెట్లో 12 కొత్త ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చింది. అమెరికా ఫార్ములేషన్స్ వ్యాపారం 37 శాతం వృ ద్ధి సాధించింది. ఈ క్యూ1లో ఒక కొత్త ఔషధాన్ని అమెరికా మార్కెట్లోకి తెచ్చింది. ఆరు ఏఎన్‌డీఏ(అబ్రివియేటెడ్ న్యూ డ్రగ్ అప్లికేషన్)లను అమెరికా ఎఫ్‌డీఏకు సమర్పించింది. కీళ్లనొప్పులు, క్యాన్సర్, ఇన్ఫెర్టిలిటీ, గుండెపోటుకు సంబంధించి 25 బయోలాజిక్స్ ఔషధాలు పరిశోధన, అభివృద్ధి దశలో ఉన్నాయి. మరిన్ని బయోలాజిక్స్పై రీసెర్చ్ కార్యకలాపాలు జోరుగా ఉన్నాయి. తొలి దశ బయోసిమిలర్స్‌పై అంతర్జాతీయంగా క్లినికల్ ట్రయల్స్‌ను ప్రారంభించింది. ఆసియా పసిఫిక్, ఆఫ్రికా, పశ్చిమాసియా వంటి కీలక మార్కెట్లలో తన బ్రాండెడ్ జనరిక్ వ్యాపారాన్ని ఏకీకృతం చేసింది. రెండేళ్లలో నికర అమ్మకాలు 15 శాతం, నికర లాభం 27 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా. షేర్ వారీ ఆర్జన(ఈపీఎస్) ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.70గానూ, వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.81గానూ ఉండొచ్చని భావిస్తున్నాం. మధ్య నుంచి దీర్ఘకాలానికి రూ.2,200 టార్గెట్ ధరకు ఈ షేర్‌ను ప్రస్తుత ధరలో కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేస్తున్నాం. యస్ బ్యాంక్ కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: రెలిగేర్ ప్రస్తుత ధర: రూ.646 టార్గెట్ ధర: రూ.1,075 ఎందుకంటే: ప్రైవేట్ రంగంలో ఐదో అతి పెద్ద బ్యాంక్. 2004 నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 29 రాష్ట్రాల్లో, 7 కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తరించి ఉంది. 375 నగరాల్లో 630 బ్రాంచీలు, 1,150కు పైగా ఏటీఎంతో బ్యాంకింగ్ సేవలందిస్తోంది. ఈ ఏడాది మార్చిలో ఉన్న అధిక ధర నుంచి యస్ బ్యాంక్ షేర్ 35% పతనమైంది. ప్రస్తుత ధర వద్ద కొనుగోళ్లకు ఆకర్షణీయమేనని చెప్పవచ్చు. బ్యాంక్ రుణ నాణ్యత, విదేశీ రుణాలపై చెలరేగిన ఆందోళన సద్దుమణిగింది. మొండి బకాయిలు, రుణ రేట్లకు సంబంధించి ప్రతికూల అంచనాలేమీ లేవు. విదేశీ రుణాలపై వచ్చిన మార్క్ టు మార్కెట్ నష్టాలను భర్తీ చేసుకునేలా తగినంత స్వాప్ స్ట్రక్చర్ బ్యాంక్‌కు ఉంది. మార్జిన్లు ఆరోగ్యకరంగానే ఉంటాయని, రుణ వృద్ధి పోటీ బ్యాంకులతో పోల్చితే మెరుగ్గానే ఉంటుందని అంచనా వేస్తున్నాం. కాసా, రిటైల్ టర్మ్ డిపాజిట్లు ప్రతీ ఏడాది పెరుగుతూనే ఉన్నాయి. మార్జిన్లు ప్రస్తుతమున్న స్థాయిల్లోనే (3.2%) ఉండొచ్చని భావిస్తున్నాం. ఎంఎస్ఎంఈ, ఎస్ఎంఈ రుణాల విషయంలో యెస్ బ్యాంక్ వంటి ప్రైవేట్ బ్యాంకుల వాటా మరింతగాపెరిగే అవకాశాలున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూలధన నిధుల కొరత ఉండడమే దీనికి కారణం. ఈ ఆర్థిక సంవత్సరం చివరినాటికి వంద కోట్ల డాలర్లు ఏడీఆర్ రూపంలో సమీకరించాలని యోచిస్తోంది. ఫలితంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ పుస్తక విలువ రూ.70 పెరుగుతుంది. కెన్‌ఫిన్ హోమ్స్ కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: సీడీ ఈక్విసెర్చ్ ప్రస్తుత ధర: రూ. 740 టార్గెట్ ధర: రూ. 865 ఎందుకంటే: ఒక బ్యాంక్ స్పాన్సర్ చేసిన తొలి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ఇది. కెనరా బ్యాంక్ భాగస్వామ్యంతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలంలో నికర వడ్డీ ఆదాయం 75% వృద్ధితో రూ.64 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ మార్జిన్ 3 శాతానికి పెరిగింది. మొత్తం నిర్వహణ ఆదాయం 65% వృద్ధితో రూ.70 కోట్లకు, నికర లాభం 69% పెరిగి రూ.32 కోట్లకు చేరాయి. రెండేళ్లలో ఏటా 33% చొప్పున వృద్ధి సాధిస్తుందని అంచనా. గృహ, గృహేతర రుణాలకు సంబంధించి మొత్తం 16 రకాల రుణాలను అందిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.276 కోట్ల నిధులు సమీకరించింది. ఈ నిధులతో వచ్చే ఆర్థిక సంవత్సరం వరకూ మూలధన అవసరాలు తీరతాయి. అందుబాటు ధరల్లో అందరికీ గృహాలందించాలన్న ప్రభుత్వ లక్ష్యం, అందుకనుగుణంగా వస్తున్న నియమ నిబంధనలు, ఈ రంగానికి ప్రభుత్వం ప్రోత్సాహకాలిస్తుండడం, ఉద్యోగావకాశాలు పెరుగుతుండడం, వేతనాలు, పట్టణీకరణ, చిన్న కుటుంబాలు పెరుగుతుండడం, తక్కువ వడ్డీరేట్లకే రుణాలు లభిస్తుండటం, ద్రవ్యోల్బణం తగ్గుతుండటం... ఈ నేపధ్యంలో హౌసింగ్ ఫైనాన్స్ రంగం భవిష్యత్ బాగా ఉంటుందని భావిస్తున్నాం.