స్టాక్స్ వ్యూ | Stocks Overview | Sakshi
Sakshi News home page

స్టాక్స్ వ్యూ

Published Sun, Sep 6 2015 11:54 PM | Last Updated on Sun, Sep 3 2017 8:52 AM

Stocks Overview

క్యాడిలా హెల్త్‌కేర్
కొనొచ్చు

బ్రోకరేజ్ సంస్థ: ఫస్ట్‌కాల్ రీసెర్చ్  ప్రస్తుత ధర: రూ.1,813
టార్గెట్ ధర: రూ.2,200  
ఎందుకంటే: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలంలో కంపెనీ నికర అమ్మకాలు 22% వృద్ధితో రూ.2,500 కోట్లకు, నికర లాభం 47% వృద్ధితో రూ.353 కోట్లకు పెరిగాయి. స్థూల లాభం 78 శాతం వృద్ధితో రూ.533 కోట్లకు ఎగసింది. నికర లాభం మార్జిన్ 242 బేసిస్ పాయింట్లు, ఇబిటా మార్జిన్ 604 బేసిస్ పాయింట్లు చొప్పున వృద్ధి చెందాయి. ఇతర ఆదాయం వంద శాతం ఎగసి రూ.21 కోట్లకు పెరిగింది.  భారత ఫార్ములేషన్స్ మార్కెట్లో 12 కొత్త ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చింది. అమెరికా ఫార్ములేషన్స్ వ్యాపారం 37 శాతం వృ ద్ధి సాధించింది. ఈ క్యూ1లో ఒక కొత్త ఔషధాన్ని అమెరికా మార్కెట్లోకి తెచ్చింది. ఆరు  ఏఎన్‌డీఏ(అబ్రివియేటెడ్ న్యూ డ్రగ్ అప్లికేషన్)లను అమెరికా ఎఫ్‌డీఏకు సమర్పించింది.


కీళ్లనొప్పులు, క్యాన్సర్, ఇన్‌ఫెర్టిలిటీ, గుండెపోటుకు సంబంధించి 25 బయోలాజిక్స్ ఔషధాలు  పరిశోధన, అభివృద్ధి దశలో ఉన్నాయి. మరిన్ని బయోలాజిక్స్‌పై రీసెర్చ్ కార్యకలాపాలు జోరుగా ఉన్నాయి. తొలి దశ బయోసిమిలర్స్‌పై అంతర్జాతీయంగా క్లినికల్ ట్రయల్స్‌ను ప్రారంభించింది. ఆసియా పసిఫిక్, ఆఫ్రికా, పశ్చిమాసియా వంటి కీలక మార్కెట్లలో తన బ్రాండెడ్ జనరిక్ వ్యాపారాన్ని ఏకీకృతం చేసింది.  రెండేళ్లలో నికర అమ్మకాలు 15 శాతం, నికర లాభం 27 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా.  షేర్ వారీ ఆర్జన(ఈపీఎస్) ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.70గానూ, వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.81గానూ ఉండొచ్చని భావిస్తున్నాం. మధ్య నుంచి దీర్ఘకాలానికి రూ.2,200 టార్గెట్ ధరకు ఈ షేర్‌ను ప్రస్తుత ధరలో కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేస్తున్నాం.
 
యస్ బ్యాంక్
కొనొచ్చు

బ్రోకరేజ్ సంస్థ: రెలిగేర్  ప్రస్తుత ధర: రూ.646  టార్గెట్ ధర: రూ.1,075
ఎందుకంటే: ప్రైవేట్ రంగంలో ఐదో అతి పెద్ద బ్యాంక్. 2004 నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 29 రాష్ట్రాల్లో, 7 కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తరించి ఉంది.  375 నగరాల్లో  630 బ్రాంచీలు, 1,150కు పైగా ఏటీఎంతో బ్యాంకింగ్ సేవలందిస్తోంది.  ఈ ఏడాది మార్చిలో ఉన్న అధిక ధర నుంచి యస్ బ్యాంక్ షేర్ 35% పతనమైంది. ప్రస్తుత ధర వద్ద కొనుగోళ్లకు ఆకర్షణీయమేనని చెప్పవచ్చు. బ్యాంక్ రుణ నాణ్యత, విదేశీ రుణాలపై చెలరేగిన ఆందోళన సద్దుమణిగింది. మొండి బకాయిలు, రుణ రేట్లకు సంబంధించి ప్రతికూల అంచనాలేమీ లేవు.


విదేశీ రుణాలపై వచ్చిన మార్క్ టు మార్కెట్ నష్టాలను భర్తీ చేసుకునేలా తగినంత స్వాప్ స్ట్రక్చర్ బ్యాంక్‌కు ఉంది. మార్జిన్లు ఆరోగ్యకరంగానే ఉంటాయని, రుణ వృద్ధి పోటీ బ్యాంకులతో పోల్చితే మెరుగ్గానే ఉంటుందని అంచనా వేస్తున్నాం. కాసా, రిటైల్ టర్మ్ డిపాజిట్లు ప్రతీ ఏడాది పెరుగుతూనే ఉన్నాయి. మార్జిన్లు ప్రస్తుతమున్న స్థాయిల్లోనే (3.2%) ఉండొచ్చని భావిస్తున్నాం. ఎంఎస్‌ఎంఈ, ఎస్‌ఎంఈ రుణాల విషయంలో యెస్ బ్యాంక్ వంటి ప్రైవేట్ బ్యాంకుల వాటా మరింతగాపెరిగే అవకాశాలున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూలధన నిధుల కొరత ఉండడమే దీనికి కారణం. ఈ ఆర్థిక సంవత్సరం చివరినాటికి వంద కోట్ల డాలర్లు ఏడీఆర్ రూపంలో సమీకరించాలని యోచిస్తోంది. ఫలితంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ పుస్తక విలువ రూ.70 పెరుగుతుంది.
 
కెన్‌ఫిన్ హోమ్స్
కొనొచ్చు

బ్రోకరేజ్ సంస్థ: సీడీ ఈక్విసెర్చ్  ప్రస్తుత ధర: రూ. 740  టార్గెట్ ధర: రూ. 865
ఎందుకంటే: ఒక బ్యాంక్ స్పాన్సర్ చేసిన తొలి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ఇది. కెనరా బ్యాంక్ భాగస్వామ్యంతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలంలో నికర వడ్డీ ఆదాయం 75% వృద్ధితో రూ.64 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ మార్జిన్ 3 శాతానికి పెరిగింది. మొత్తం నిర్వహణ ఆదాయం 65% వృద్ధితో రూ.70 కోట్లకు,  నికర లాభం 69% పెరిగి రూ.32 కోట్లకు చేరాయి. రెండేళ్లలో ఏటా 33% చొప్పున వృద్ధి సాధిస్తుందని అంచనా. గృహ, గృహేతర రుణాలకు సంబంధించి మొత్తం 16 రకాల రుణాలను అందిస్తోంది.  


గత ఆర్థిక సంవత్సరంలో రూ.276 కోట్ల నిధులు సమీకరించింది. ఈ నిధులతో వచ్చే ఆర్థిక సంవత్సరం వరకూ మూలధన అవసరాలు తీరతాయి. అందుబాటు ధరల్లో అందరికీ గృహాలందించాలన్న ప్రభుత్వ లక్ష్యం, అందుకనుగుణంగా వస్తున్న నియమ నిబంధనలు, ఈ రంగానికి ప్రభుత్వం ప్రోత్సాహకాలిస్తుండడం, ఉద్యోగావకాశాలు పెరుగుతుండడం, వేతనాలు,  పట్టణీకరణ, చిన్న కుటుంబాలు పెరుగుతుండడం, తక్కువ వడ్డీరేట్లకే రుణాలు లభిస్తుండటం, ద్రవ్యోల్బణం తగ్గుతుండటం... ఈ నేపధ్యంలో హౌసింగ్ ఫైనాన్స్ రంగం భవిష్యత్ బాగా ఉంటుందని భావిస్తున్నాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement