కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ వచ్చేసింది | Oxford COVID-19 Vaccine Cleared By Expert Panel For India | Sakshi
Sakshi News home page

కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ వచ్చేసింది

Published Sat, Jan 2 2021 4:03 AM | Last Updated on Sat, Jan 2 2021 11:27 AM

Oxford COVID-19 Vaccine Cleared By Expert Panel For India - Sakshi

న్యూఢిల్లీ : కొత్త ఏడాది వస్తూ వస్తూ శుభవార్తని మోసుకొచ్చింది. కరోనాని కట్టడి చేయడానికి మనకూ ఓ వ్యాక్సిన్‌ వచ్చేసింది. కోవిడ్‌–19పై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ (సీడీఎస్‌సీఓ) ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ–ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ కోవిషీల్డ్‌ అత్యవసర వినియోగానికి అనుమతులు మంజూరు చేయడానికి శుక్రవారం సిఫారసు చేసింది. డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) దీనికి ఇంకా తుది ఆమోదం ఇవ్వాల్సి ఉంది. నేడు దేశవ్యాప్తంగా టీకా డ్రై రన్‌కి ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (సీడీఎస్‌సీవో)కి చెందిన సబ్జెక్ట్‌ ఎక్స్‌పర్ట్‌ కమిటీ (సీఎస్‌వో) వ్యాక్సిన్‌ వినియోగానికి అనుమతులివ్వడానికి సిఫారసు చేసినట్టుగా అధికార వర్గాలు వెల్లడించాయి. 18 ఏళ్లు దాటిన వారికి 4– 6 వారాల మధ్యలో రెండు డోసుల్లో వ్యాక్సిన్‌ ఇచ్చేలా సూచించినట్లు అధికారులు చెబుతున్నారు.

ఆరో తేదీ నుంచి వ్యాక్సినేషన్‌ ..?  
ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా కంపెనీ అభివృద్ధి చేసిన కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను పుణేకి చెందిన సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా తయారు చేస్తోంది. శుక్రవారం జరిగిన నిపుణుల కమిటీ సమావేశంలో సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ప్రతినిధులు, కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్న భారత్‌ బయోటెక్‌ ప్రతినిధులూ పాల్గొన్నారు. తమ వ్యాక్సిన్‌ల సంపూర్ణ సమాచారాన్ని అందించారు. అన్నింటినీ సమీక్షించిన అనంతరం నిపుణుల కమిటీ మాత్రం తొలుత ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ వినియోగానికే సిఫారసు చేసింది.

దీంతో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన రెండో దేశమైన భారత్‌లో అతి పెద్ద వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి మార్గం సుగమం అయింది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన కేంద్ర ప్రభుత్వం జనవరి 6 నుంచి వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఆక్స్‌ఫర్డ్‌ టీకాకు బ్రిటన్, అర్జెంటీనా తర్వాత అనుమతులు ఇచ్చిన మూడో దేశంగా భారత్‌ నిలుస్తోంది. రష్యా, బ్రిటన్, అమెరికా, కెనడా, చైనా, యూరోపియన్‌ యూనియన్, మధ్యప్రాచ్య దేశాల్లో ఇప్పటికే వ్యాక్సినేషన్‌ మొదలైంది.   

ఫైజర్‌ వ్యాక్సిన్‌కి డబ్ల్యూహెచ్‌వో గ్రీన్‌ సిగ్నల్‌
జెనీవా: కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను వణికిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మొదటి సారిగా ఫైజర్‌–బయోఎన్‌టెక్‌ వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి అనుమతినిచ్చింది. ఇప్పటికే అమెరికా, బ్రిటన్, యూరోపియన్‌ యూనియన్‌తో పాటు డజనుకు పైగా దేశాలు ఈ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని చేపట్టాయి. అయితే డబ్ల్యూహెచ్‌ఒ అనుమతులు ఇవ్వడంతో నిరుపేద దేశాలకు కూడా ఫైజర్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానుంది. సాధారణంగా ఏ దేశానికి ఆ దేశమే వ్యాక్సిన్‌ వినియోగంపై నిర్ణయం తీసుకుంటాయి. కానీ వ్యవస్థలు బలహీనంగా ఉన్న దేశాలు మాత్రం డబ్ల్యూహెచ్‌వో అనుమతించాక మాత్రమే టీకా పంపిణీ చేపడతాయి.

డబ్ల్యూహెచ్‌వో గురువారం ఫైజర్‌ అత్యవసర వినియోగానికి అనుమతినిస్తూ అన్ని దేశాలు వారి పరిధిలో వ్యాక్సిన్‌ వినియోగానికి అనుమతులివ్వడం, టీకా డోసుల దిగుమతి ప్రక్రియ వేగవంతం చేయాలని చెప్పింది. ఫైజర్‌ టీకా నాణ్యత, భద్రత అంశంలో ప్రమాణాలకు లోబడి ఉందని డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది. ఫైజర్‌ వ్యాక్సిన్‌ను మైనస్‌ 70 డిగ్రీల ఉష్ణోగ్రతలో నిల్వ చేయాల్సి ఉండడంతో అభివృద్ధి చెందుతున్న, వెనుకబడిన దేశాలు ఈ వ్యాక్సిన్‌ను ఎంతవరకు వినియోగిస్తారన్నది సందేహమే. ఈ విషయాన్ని అంగీకరించిన డబ్ల్యూహెచ్‌ఒ ఫైజర్‌ వ్యాక్సిన్‌ వినియోగంలో ఎదురయ్యే సవాళ్లను ఇతర దేశాలు ఎంతవరకు ఎదుర్కోగలవో చెప్పాలని పేర్కొంది.    

నేడు అన్ని రాష్ట్రాల్లో డ్రైరన్‌..
కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ 2న అన్ని రాష్ట్రాల్లో డ్రైరన్‌ చేపడుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ శుక్రవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. చెక్‌లిస్టులు, ఎస్‌ఓపీలను పూర్తిగా పరిశీలించిన అనంతరమే వ్యాక్సినేషన్‌ చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన సూచించారు.

20 వేల కొత్త కరోనా కేసులు..
దేశంలో గత 24 గంటల్లో 20,035 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,02,86,709కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో కరోనా కారణంగా 256 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,48,994 కు చేరుకుందని తెలిపింది. యూకేకు చెందిన కొత్త కరోనా స్ట్రెయిన్‌ మరో నలుగురికి సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో కొత్త స్ట్రెయిన్‌ కలిగిన మొత్తం వ్యక్తుల సంఖ్య 29కి చేరుకుంది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 98,83,461కు చేరుకుంది. దీంతో మొత్తం రికవరీ రేటు 96.08 శాతానికి చేరింది. యాక్టివ్‌ కేసుల సంఖ్య 2,54,254గా ఉంది.

► ఆరు నుంచి ఎనిమిది నెలల కాలంలో 30 కోట్ల మందికి టీకా వేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది.

► మొదటి టీకా డోసు ఇచ్చిన నాలుగు నుంచి పన్నెండు వారాల్లోగా రెండో డోసు ఇవ్వాల్సి ఉంటుంది.

► ధర విషయంలోనూ ఈ వ్యాక్సిన్‌ అందరికీ అందుబాటులో ఉంది. ఒక్కో డోసు ధర 3 అమెరికా డాలర్లుగా నిర్ణయిం చారు. రెండు డోసులకి 6 డాలర్లు అంటే రూ. 440 అవుతుంది. అయితే ప్రైవేటు మార్కెట్‌లో రెండు డోసులకి రూ.700–800 వరకు వెచ్చించాల్సి ఉంటుందని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ సీఈఓ అదార్‌ పూనావాలా చెప్పారు. సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఇప్పటికే 5 కోట్ల టీకా డోసుల్ని సిద్ధంగా ఉంచింది. వాటినన్నింటినీ భారత్‌లోనే వినియోగించనున్నారు. మార్చి నాటికల్లా 10 కోట్ల డోసుల్ని ఉత్పత్తి చేయనుంది.

► ఈ నెల 6 నుంచి వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహించాలని కేంద్రం భావిస్తున్న నేపథ్యంలో సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ శనివారం నుంచే టీకా డోసుల పంపిణీకి సన్నాహాలు చేస్తోంది.

► టీకా సామర్థ్యం అంశంలో ఫైజర్‌ మోడెర్నా కంటే కోవిషీల్డ్‌ వెనుకబడి ఉంది. ఫైజర్‌ టీకా 95% సామర్థ్యంతో పని చేస్తే ఈ వ్యాక్సిన్‌ 70.4% సామర్థ్యంతో పని చేస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement