న్యూఢిల్లీ: ఆక్స్‌ఫర్డ్ కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులకు మధ్య మూడు నెలల వ్యవధి తీసుకోవడం మంచి ఫలితాలనిస్తుందని తాజా అధ్యయనం వెల్లడించింది. వ్యాక్సిన్ డోసులకి మధ్య ఆరు వారాల వ్యవధి తీసుకున్నప్పటికన్నా, మూడు నెలల గ్యాప్‌తో వ్యాక్సిన్ తీసుకుంటే సత్ఫలితాలిస్తున్నట్టు అధ్యయనం తెలిపింది. ఈ రెండు డోసుల్లో తొలి డోసు వ్యాక్సిన్ 76 శాతం రక్షణనిస్తుందని వెల్లడించింది. లాన్‌సెట్ జర్నల్‌లో ప్రచురించిన ఈ అధ్యయనం వ్యాక్సిన్ డోసులకి మధ్య మూడు నెలల సమయం తీసుకోవడం వల్ల ఎటువంటి నష్టం వాటిల్లదని, తొలి డోసు అందుకు రక్షణ కల్పిస్తుందని వెల్లడించింది. కొందరికే రెండో డోసుని తొందరగా ఇచ్చే బదులు 3 నెలల కాలవ్యవధిలో ఎక్కువ మందికి వ్యాక్సిన్ అందించే వీలుంటుదని అ«ధ్యయనం వెల్లడించింది.
‘వ్యాక్సిన్ సరఫరా తక్కువగా ఉండడం, అత్యధిక మంది జనాభాకి వ్యాక్సిన్ అందించేందుకు తక్కువ సమయం ఉండడంతో ప్రభుత్వాలు ప్రజారోగ్య పరిరక్షణకు ఎటువంటి విధానం అవసరమో నిర్ణయించుకోవాలి’’అని ఆక్స్‌ఫర్డ్ వర్సిటీకి చెందిన ప్రొఫెసర్ ఆండ్రూ పోల్లార్డ్ అన్నారు. యుకె, బ్రెజిల్, దక్షిణాఫ్రికాలకు చెందిన 17,178 మంది ఆరోగ్య కార్యకర్తలపై జరిపిన ఈ అధ్యయనంలో. సుదీర్ఘకాలం వ్యవధితో వ్యాక్సిన్ తీసుకున్నవారిలో రోగనిరోధక శక్తి అధికంగా ఉన్నట్టు గుర్తించారు. ఆరు వారాల్లోపు వ్యాక్సిన్ తీసుకున్నవారిలో కంటే 12 వారాల తర్వాత వ్యాక్సిన్ తీసుకున్న వారికి మెరుగైన ఫలితాలు వచ్చినట్టు ఈ అధ్యయనం వెల్లడించింది. ఒక డోసు తరువాత కరోనా యాంటీ బాడీలు మూడు నెలల పాటు శరీరంలో ఉంటున్నట్టు గుర్తించారు. వారిలో రోగనిరోధక శక్తి రెట్టింపు స్థాయిలో పెరిగినట్టు అధ్యయనవేత్తలు గుర్తించారు. తొలి డోసు ఇచ్చిన తరువాత 22 ల నుంచి మూడు నెలల వరకు వ్యాక్సిన్ సమర్థత 76 శాతం ఉన్నట్టు ఈ అధ్యయనం గుర్తించింది.
Comments
Please login to add a commentAdd a comment