భారత్‌ మాకు కీలక భాగస్వామి | PM Narendra Modi USA Vice President Kamala Harris meet in DC | Sakshi
Sakshi News home page

Narendra Modi US Visit భారత్‌ మాకు కీలక భాగస్వామి

Published Fri, Sep 24 2021 4:06 AM | Last Updated on Fri, Sep 24 2021 9:39 AM

PM Narendra Modi USA Vice President Kamala Harris meet in DC - Sakshi

సంయుక్త మీడియా సమావేశానికి ముందు వైట్‌హౌస్‌ పక్కనున్న ఐసన్‌హోవర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీస్‌ బిల్డింగ్‌ బాల్కనీలో మాట్లాడుతున్న ప్రధాని మోదీ, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌

వాషింగ్టన్‌: భారత్‌ తమకు అత్యంత కీలక భాగస్వామ్య దేశమని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ అన్నారు. వ్యాక్సిన్‌ ఎగుమతులను తిరిగి ప్రారంభించాలనే భారత్‌ నిర్ణయాన్ని స్వాగతించారు. ప్రపంచాన్ని సురక్షితంగా, భద్రంగా ఉంచడానికి ఇరుదేశాలు ఏళ్లుగా కలిపి పనిచేస్తున్నాయన్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం అర్ధరాత్రి (భారత కాలమానం ప్రకారం) అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌తో వైట్‌హౌస్‌ ప్రాంగణంలో భేటీ అయ్యారు.
చదవండి: అంత్యక్రియలు అడ్డగింత.. చితి పైకెక్కి ఆందోళన

భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్‌ అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యాక... ప్రధాని మోదీతో ప్రత్యక్షంగా సమావేశం కావడం ఇదే తొలిసారి. ప్రపంచం ప్రస్తుత పలు సవాళ్లను ఎదుర్కొంటోందని, ఈ తరుణంలో అమెరికా– భారత్‌ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం కావాలని కమల ఆకాంక్షించారు. కోవిడ్‌ మహమ్మారిపై సమష్టిగా పోరాడుదామన్నారు. సమస్యలపై పోరులో భారత్‌ ధృడ సంకల్పాన్ని అభినందించారు.
చదవండి: సీఎం జగన్‌ను కలిసిన తెలంగాణ పర్వతారోహకుడు తుకారాం

రోజుకు కోటి డోసులు ఇస్తున్నారని భారత్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మెచ్చుకున్నారు. ఇరుదేశాలు సహజ మిత్రులని భారత ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారత్, అమెరికాలు ప్రపంచంలోని రెండు అతిపెద్ద, పురాతన ప్రజాస్వామ్య దేశాలని అన్నారు. విలువలు, ప్రాదేశిక రాజకీయ ఆసక్తులు ఒకటేన్నారు. ఇరుదేశాల సంబంధాలు నానాటికీ బలోపేతమవుతున్నాయన్నారు. సప్లయ్‌ చైన్స్, నూతన సాంకేతికతలు, అంతరిక్ష రంగాలపై మీకు ఆసక్తి ఎక్కువని తెలుసు... నాకూ కూడా వీటిపై ఎంతో ఆసక్తి ఉందని మోదీ అమెరికా ఉపాధ్యక్షురాలిని ఉద్దేశించి అన్నారు.

కరోనా సెకండ్‌వేవ్‌ సంక్షోభ సమయంలో భారత్‌కు అమెరికా చేసిన సహాయాన్ని మరువలేమన్నారు. మీరు నిజమైన మిత్రుడిలా వ్యవహరించి అండగా నిలిచారని కొనియాడారు. మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నానని పేర్కొన్నారు. మీరు భారత్‌కు రావాలని దేశ ప్రజలు ఎంతో కోరుకుంటున్నారని... తమ దేశానికి రావాలని కమాలా హ్యారిస్‌ను ఆహా్వనించారు. 40 లక్షల మంది ప్రవాస భారతీయులు ఇరుదేశాల మధ్య వారిధిలా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. బైడెన్, హ్యారిస్‌ల నేతృత్వంలో అమెరికా పురోభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుందని ఆకాంక్షించారు.

బంధాలను బలోపేతం చేసుకుందాం
ప్రధాని మోదీ గురువారం వాషింగ్టన్‌లో ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్‌ మోరిసన్‌తో సమావేశమయ్యారు. భారత్‌–ఆస్ట్రేలియా మధ్య ఆర్థిక సంబంధాలతోపాటు ఇరు దేశాల ప్రజల నడుమ బంధాలను బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలు సైతం ప్రస్తావనకు వచ్చాయి. ఆస్ట్రేలియాతో మన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం విషయంలో ఇది మరొక అధ్యాయమని విదేశాంగ శాఖ ప్రతినిధి బాగ్చీ అన్నారు. కోవిడ్‌–19, వ్యాపారం, వాణిజ్యం, రక్షణ, క్లీన్‌ ఎనర్జీ అంశాలపై ఇరువురూ మాట్లాడుకున్నారని వెల్లడించారు. ఆకస్‌(ఆస్ట్రేలియా, యూకే, యూఎస్‌) భద్రతా భాగస్వామ్యం ఏర్పాటైన తర్వాత మోదీ, మోరిసన్‌ భేటీ కావడం ఇదే తొలిసారి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement