ట్రయల్ రన్‌లో భాగంగా డ్రోన్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్ నిఖిల, ఎస్పీ నారాయణ తదితరులు
వికారాబాద్: దేశంలోనే తొలిసారి డ్రోన్ల ద్వారా మందులు, టీకాలు సరఫరా చేసే కార్యక్రమానికి వికారాబాద్ వేదిక కానుంది. దేశంలోనే తొలిసారి చేపడుతున్న ‘మెడిసిన్ ఫ్రమ్ ద స్కై’కార్యక్రమాన్ని శనివారం కేంద్ర మంత్రి జోతిరాదిత్య, రాష్ట్ర మంత్రి కె.తారకరామారావు ప్రారంభించనున్నారు. గురువారం ఎస్పీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన ట్రయల్ రన్‌ను డ్రోన్ల తయారీ కంపెనీ ప్రతినిధులతో కలసి కలెక్టర్ నిఖిల పరిశీలించారు.
నూతన కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన హెలీపాడ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..రవాణా వ్యవస్థ సరిగ్గాలేని ప్రాంతాలకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారనుందన్నారు. భవిష్యత్తులో టీకాలు, యాంటీవీనమ్ వంటి మందులు సకాలంలో ఆస్పత్రులకు చేరవేసేలా డ్రోన్లు ఎంతగానో సహాయపడతాయని స్పష్టం చేశారు. డ్రోన్ల ద్వారా అవయవాలను కూడా చేరవేసే అవకాశం ఉందని తెలిపారు.
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనుమతులు తదితర విషయాలు పర్యవేక్షిస్తున్నామన్నారు. ట్రయల్ రన్‌లో టీకాలు ఆకాశ మార్గాన వెళ్లే సమయంలో ఉష్ణోగ్రత ఎంత ఉండాలో అంతే ఉంటుందా? ఏమైనా మార్పులు జరుగుతున్నాయా? అనే విషయాలను గమనిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రయ్య, మోతీలాల్, అదనపు ఎస్పీ రషీద్, ఆర్డీఓ వెంకట ఉపేందర్‌రెడ్డి, డీఎంహెచ్‌ఓ తుకారామ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment