న్యూఢిల్లీ: భారత్‌లో ఈ ఏడాది డిసెంబర్ ఆఖరు నాటికి దాదాపు 30 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు సిద్ధమవుతాయని పుణేలోని ప్రముఖ ఫార్మా సంస్థ సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సురేశ్ జాదవ్ చెప్పారు. డీసీజీఐ నుంచి లైసెన్స్ రాగానే ఈ వ్యాక్సిన్ డోసులు ప్రజలకు అందుతాయని పేర్కొన్నారు. చివరి పరీక్ష జరుపుకున్న వ్యాక్సిన్ 2021 మార్చిలో అందుబాటులోకి వస్తుందన్నారు. కరోనా వైరస్ నివారణకు సీరమ్ సంస్థ ఐదు రకాల వ్యాక్సిన్లతో ప్రయోగాలు చేస్తున్నట్లు తెలిపారు. సీరమ్ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ వచ్చే ఏడాది తొలి త్రైమాసికం తర్వాత అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. అన్ని అనుమతులు పొందాకే వ్యాక్సిన్‌ను విక్రయిస్తామన్నారు. తాము నెలకు దాదాపు 7 కోట్ల వ్యాక్సిన్ డోసులను ఉత్పత్తి చేస్తామన్నారు.
భారత్‌లో స్పుత్నిక్–వీ పరీక్షలు
కరోనా నివారణకు రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్–వీ వ్యాక్సిన్ రెండు/మూడో దశ హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్‌ను భారత్‌లో నిర్వహించేందుకు తమకు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) నుంచి అనుమతి లభించిందని డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్(ఆర్‌డీఐఎఫ్)తో కలిసి తాము ఈ ట్రయల్స్ నిర్వహిస్తామంది.
సమర్థవంతమైన వ్యాక్సిన్‌ను తేవడమే తమ సంకల్పమని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ కో–చైర్మన్ జీవీ ప్రసాద్ తెలిపారు. రష్యాలో స్పుత్నిక్–వీ టీకా మానవ ప్రయోగాలు జరుగుతున్నాయని ఆర్‌డీఐఎఫ్ సీఈఓ కిరిల్ చెప్పారు. భారత్‌లోనూ ఈ ప్రయోగాలు నిర్వహించేందుకు రంగం సిద్ధమైందన్నారు. భారత్‌లో హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ చేపట్టేందుకు, వ్యాక్సిన్‌ను పంపిణీ చేసేందుకు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, రష్యాకు చెందిన ఆర్‌డీఐఎఫ్ గత నెలలో చేతులు కలిపిన సంగతి తెలిసిందే. ఒప్పందంలో భాగంగా ఆర్‌డీఐఎఫ్ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌కు 10 కోట్ల్ల కరోనా వ్యాక్సిన్ డోసులను అందజేయనుంది.
కేసులు @ 74 లక్షలు
దేశంలో గత 24 గంటల్లో 62,212 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 74,32,680కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో 837 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,12,998 కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా, దేశంలో మొత్తం రికవరీల సంఖ్య 65,24,595కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 7,95,087గా ఉంది. దాదాపు నెలన్నర తర్వాత తర్వాత యాక్టివ్ కేసుల సంఖ్య 8 లక్షల దిగువకు వచ్చింది. మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్ కేసులు 10.70 శాతం ఉన్నాయి. దేశంలో కరోనా రికవరీ రేటు క్రమంగా పెరుగుతోందని, ప్రస్తుతం ఇది 87.78 శాతానికి పెరిగినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు 1.52గా నమోదైంది. మరణిస్తున్న వారిలో 70 శాతం మంది ఇతర దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారేనని చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment