COVID-19 Vaccine: 45 ఏళ్లు దాటితే టీకా.. | COVID vaccination for above 45 years from April 2021 | Sakshi
Sakshi News home page

COVID-19 Vaccine: 45 ఏళ్లు దాటితే టీకా..

Published Thu, Apr 1 2021 4:46 AM | Last Updated on Thu, Apr 1 2021 2:08 PM

COVID vaccination for above 45 years from April 2021 - Sakshi

ఢిల్లీలో పౌరునికి కరోనా పరీక్ష చేస్తున్న దృశ్యం

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి మళ్లీ ఉధృతరూపం దాలుస్తుండడంతో నియంత్రణ చర్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా 45 ఏళ్ల వయసు దాటిన వారికి కూడా కరోనా టీకా ఇవ్వాలని నిర్ణయించింది. ఏప్రిల్‌ 1 (గురువారం) నుంచే దేశవ్యాప్తంగా ఇది అమల్లోకి రానుంది. ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. కరోనా కేసులు అధికంగా నమోదవుతూ వ్యాక్సినేషనల్‌ ప్రక్రియ నెమ్మదిగా సాగుతున్న ప్రాంతాలను వెంటనే గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. అలాంటి ప్రాంతాల్లో కరోనా టీకా పంపిణీని వేగవంతం చేయాలని సూచించింది.

కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్, నేషనల్‌ హెల్త్‌ అథారిటీ(ఎన్‌హెచ్‌ఏ) సీఈవో డాక్టర్‌ ఆర్‌.ఎస్‌.శర్మ బుధవారం రాష్ట్రాలు, యూటీల ఆరోగ్య శాఖ కార్యదర్శులు, ఎన్‌హెచ్‌ఎం మిషన్‌ డైరెక్టర్లు, ఇమ్యూనైజేషన్‌ ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. 45 ఏళ్లు దాటిన వారికి కరోనా వ్యాక్సినేషన్‌పై చర్చించారు. హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్‌ వర్కర్ల కేటగిరీలో అర్హులైన వారికే టీకా అందేలా చూడాలని పేర్కొన్నారు. కో–విన్‌ పోర్టల్‌లో తప్పుడు, డూప్లికేట్‌ ఎంట్రీలను నివారించాలన్నారు. ప్రైవేట్‌ వ్యాక్సినేషన్‌ సెంటర్ల సేవలను సమర్థంగా ఉపయోగించుకోవాలని కోరారు. వ్యాక్సిన్‌ స్టాక్‌ పాయింట్లలో టీకా డోసులు చెడిపోకుండా చర్యలు తీసుకోవాలన్నారు.  

వ్యాక్సిన్‌ వృథాను తగ్గించండి
పెద్ద సంఖ్యలో కరోనా వ్యాక్సిన్‌ డోసులు వృథా అవుతుండడం పట్ల రాజేష్‌ భూషణ్, డాక్టర్‌ ఆర్‌.ఎస్‌.శర్మ విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో 6 శాతం డోసులు వృథా అవుతున్నట్లు అంచనా. దీన్ని ఒకటి కంటే తక్కువ శాతానికి తీసుకురావాలని రాష్ట్రాలు, యూటీలను వారు ఆదేశించారు. అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌ స్టాక్‌ను సమయానుగుణంగా ఉపయోగిస్తే వేస్టేజీ తగ్గుతుందన్నారు. తద్వారా కాలం చెల్లే వ్యాక్సిన్ల సంఖ్యను కనిష్ట స్థాయికి తగ్గించవచ్చని తెలిపారు. వ్యాక్సిన్‌ వినియోగ డేటాను ఎప్పటికప్పుడు కో–విన్, ఈవిన్‌ పోర్టళ్లలో అప్‌లోడ్‌ చేయాలన్నారు. రెండో డోసు ఇచ్చే వరకూ టీకాలను దాడి పెట్టాలన్న ఆలోచన సరైంది కాదని చెప్పారు.

కోవిషీల్డ్‌ షెల్ఫ్‌లైఫ్‌ ఇక 9 నెలలు
ఆక్స్‌ఫర్డ్‌–ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేసిన కోవిడ్‌ టీకా ‘కోవిషీల్డ్‌’ ప్రస్తుతం ఉన్న షెల్ఫ్‌లైఫ్‌ను డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ) 6 నెలల నుంచి తాజాగా 9 నెలలకు పెంచింది. ఈ టీకాను భారత్‌లోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఐఐ) ఉత్పత్తి చేస్తున్న సంగతి తెలిసిందే. ఉత్పత్తి తేదీ నుంచి కాలంచెల్లే తేదీ వరకు ఉన్న గడువును షెల్ఫ్‌లైఫ్‌ అంటారు. ఆక్స్‌ఫర్డ్‌–అస్ట్రాజెనెకా వారి కోవిషీల్డ్‌ కోవిడ్‌ వ్యాక్సిన్‌ ప్రస్తుత షెల్ఫ్‌లైఫ్‌ 6 నెలలు. తాజాగా డీసీజీఐ దీన్ని 9 నెలలకు పెంచింది. అంటే కోవిషీల్డ్‌ టీకాను తయారు చేసిన తర్వాత 9 నెలల్లోగా ఉపయోగించవచ్చు.  

9% యాక్టివ్‌ కేసులు 5 రాష్ట్రాల్లోనే
కేవలం మహారాష్ట్రలోనే 61 శాతం యాక్టివ్‌ కేసులు

దేశంలో ఐదు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, పంజాబ్, ఛత్తీస్‌గఢ్‌లో వైరస్‌ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. భారత్‌లోని మొత్తం యాక్టివ్‌ కరోనా కేసుల్లో 79.30 శాతం కేసులు ఈ ఐదు రాష్ట్రాల్లోనే నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ఒక ప్రకటనలో వెల్ల డించింది. ఇందులో 61 శాతం కేసులు కేవలం మహారాష్ట్రలోనే నమోదు కావడం గమనార్హం. ఇక కొత్త కరోనా కేసుల్లో 84.73 శాతం కేసులు ఎనిమిది రాష్ట్రాలు.. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, గుజరాత్, పంజాబ్, మధ్యప్రదేశ్‌లో నమోదయ్యాయి. దేశంలో ప్రస్తుతం యాక్టివ్‌ కరోనా కేసులు 5,52,566. దేశంలో కొత్తగా 53,480 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,21,49,335కు చేరుకుంది. గత 24 గంటల్లో 354 మంది కరోనా బాధితులు కన్నుమూశారు. దేశంలో మొత్తం కరోనా సంబంధిత మరణాల సంఖ్య 1,62,468కి చేరింది.  

6.30 కోట్ల మందికి కరోనా టీకా
భారత్‌లో కరోనా వ్యాక్సినేషన్‌ వేగం పంజుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. బుధవారం ఉదయం 7 గంటల వరకు దేశవ్యాప్తంగా అర్హులకు 10,46,757 సెషన్లలో 6,30,54,353 కరోనా వ్యాక్సిన్‌ డోసులను ఇచ్చినట్లు పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement