ఢిల్లీలో కోవిడ్ టీకా తొలి డోస్ తీసుకుంటున్న కేంద్ర మంత్రి పియూష్ గోయల్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఒక్కసారిగా కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరిగిపోయాయి. గత 24 గంటల్లో 72,330 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య కోటి 22 లక్షల 21వేల 665కి చేరుకుంది. గత ఏడాది అక్టోబర్ తర్వాత ఈ స్థాయిలో ఒక్క రోజు కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఇక కరోనా మరణాలు 459 నమోదయ్యాయి. మొత్తం మరణాల సంఖ్య 1,62,927కి చేరుకుంది.
ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 5,84,055గా ఉన్నట్టు గురువారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మొత్తం కరోనా కేసుల్లో 4.78శాతంగా ఉంది. 45 ఏళ్ల వయసు పై బడిన వారికి వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలైన రోజే రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. వ్యాక్సినేషన్‌ను ముమ్మరం చేస్తే కరోనా కేసుల్ని కట్టడి చేయవచ్చునని శాస్త్రవేత్తలు సూచించారు. దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో మహారాష్ట్ర నుంచి 61శాతం కేసులు వెలుగులోకి వస్తున్నాయి.
యువతే క్యారియర్లా ?
దేశంలో కరోనా కేసులు పెరిగిపోవడానికి యువతరం క్యారియర్లగా మారుతోందన్న ఆందోళనలు నెలకొన్నాయి. రోడ్లపైకొచ్చి స్వేచ్ఛగా, నిర్భీతిగా తిరుగుతున్న యువతే కారణమన్న అంచనాలున్నాయి. కరోనా సోకినా తమకేం కాదులే అన్న ధీమాతో ఉన్న యువతరం కనీస జాగ్రత్తలు కూడా పాటించకుండా తిరుగుతున్నారని, దీంతో వైరస్ వారినేం చేయకపోయినా యువత నుంచే పెద్దవారికి, వ్యాధులున్నవారికి సోకుతోందని న్యూఢ్లిలీలోని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా అన్నారు.
బ్రిటన్‌లో క్రిస్మస్ సమయంలో నెలకొన్న పరిస్థితి ప్రస్తుతం భారత్‌లో హోలీ పండుగ సమయంలో వచ్చిందని అన్నారు. వైరస్ మ్యుటేషన్ చెందినప్పుడు కేసులు అత్యధికంగా వెలగులోకి వస్తాయని కేంద్రం ఏర్పాటు చేసిన కోవిడ్ టాస్క్ ఫోర్స్ సభ్యుడు కూడా అయిన డాక్టర్ రణదీప్ చెప్పారు. నగర ప్రాంతాల్లో ఎక్కువగా కరోనా కేసులు నమోదు కావడానికి సెంట్రలైజ్డ్ ఏసీలున్న చోట్ల ప్రజలు ఎక్కువ సేపు గడపడమే కారణమని న్యూరో ఎక్విలిబ్రియమ్ సంస్థ వ్యవస్థాపకుడు రాజ్‌నీష్ భండారీ అన్నారు. వేసవికాలం వచ్చినప్పటికీ అత్యంత చల్లగా ఉండే ఏసీ గదుల్లో గడపడం వల్ల కేసులు పెరిగిపోతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
సెలవు రోజుల్లోనూ వ్యాక్సినేషన్
కరోనా ఉధృతిని కట్టడి చేయాలంటే ప్రజలందరికీ వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్ జరగాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆరోగ్య నిపుణుల సూచనల మేరకు ఏప్రిల్ నెలంతా నిరంతరాయంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఏప్రిల్ నెల 30 వరకు సెలవు దినాల్లో కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసింది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఆ లేఖలో సూచించింది.
మార్చి 31న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులతో కేంద్ర ఆరోగ్య శాఖ చర్చించిన అనంతరం గెజిటెడ్ హాలీడేస్‌ల్లో కూడా వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయానికొచ్చింది. కరోనా వ్యాక్సినేషన్ మరింత ముమ్మరంగా జరగాలంటే ప్రైవేటు సెక్టార్ ముందుకు రావాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ మూడో విడత మొదలైంది. 45 ఏళ్ల వయసుపైబడిన వారందరికీ వ్యాక్సిన్లు ఇవ్వడం మొదలు పెట్టారు. 6.5కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసుల్ని ఫ్రంట్‌లైన్ వర్కర్లు, ఆరోగ్య సిబ్బందితో పాటుగా 60 ఏళ్ల వయసు పైబడిన వారు, వ్యాధులతో బాధపడుతున్న 45 ఏళ్ల వయసు పైబడిన వారికి ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment