ప్రయాగ్‌రాజ్‌లో కోవిడ్ ఆంక్షలు పాటించకుండా జిల్లాపంచాయత్ నామినేషన్లతో వచ్చిన జనం
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ రోజు రోజుకీ పెరిగిపోతోంది. 80 వేల మార్క్ చూసిన మర్నాడే ఒక్క రోజులో 90 వేలకి దగ్గరలో కేసులు నమోదవడం ఆందోళన పుట్టిస్తోంది. కరోనా మొదటి వేవ్ కంటే రెండో వేవ్‌లో మూడు రెట్ల వేగంతో కేసులు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 89,129 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,23,92,260కి చేరుకుంది. కరోనా మరణాలు ఒక్క రోజులోనే రెట్టింపయ్యాయి. మొత్తంగా 714 మంది కరోనాతో మరణించినట్టుగా కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఇక యాక్టివ్ కేసుల సంఖ్య 6,58,909కి చేరుకున్నాయి. మొత్తం కేసుల్లో ఇవి 5.32శాతంగా ఉన్నాయి.
► ఎనిమిది రాష్ట్రాల నుంచి కరోనా కేసులు అత్యధికంగా వెలుగులోకి వస్తున్నాయి. మొత్తం కేసుల్లో 81.42% కేసులు మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పంజాబ్,మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో నమోదవుతున్నాయి.
► దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో 10 జిల్లాల నుంచే సగం కేసులు వెలుగులోకి వస్తున్నాయి. పుణె, ముంబై, నాగపూర్, థానే, నాసిక్, బెంగుళూరు అర్బన్, ఔరంగాబాద్, ఢిల్లీ, అహ్మద్‌నగర్, నాందేడ్ జిల్లాల నుంచి కేసులు ఎక్కువగా వస్తున్నాయి.
► గత రెండు నెలల కాలంలో యాక్టివ్ కేసుల్ని పరిశీలిస్తే మహారాష్ట్రలో తొమ్మిది రెట్లు అధికంగా కేసులు నమోదవుతూ ఉంటే, పంజాబ్‌లో ఏకంగా పన్నెండు రెట్లు అధికంగా కరోనా కేసులు వస్తున్నాయి.
► కరోనా మరణాల్లో 85శాతం ఆరు రాష్ట్రాల నుంచి వస్తున్నాయి. మహారాష్ట్ర, పంజాబ్‌లు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా మరణాలు నమోదు కాకపోవడం ఊరట కలిగించే అంశం.
ఒడిశాలో 10 జిల్లాల్లో రాత్రి కర్ఫ్యూ
ఒడిశాలో ముందుజాగ్రత్తగా 10 జిల్లాల్లో రాత్రి పూట కర్ఫ్యూ విధించారు. సోమవారం నుంచి రాత్రి 10 గంటల నుంచి మర్నాడు ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని స్పెషల్ రిలీఫ్ కమిషనర్ వెల్లడించారు. రాష్ట్రంలో రోజుకి 500 వరకు కేసులు నమోదవుతున్నాయి.
కనిమొళికి కరోనా పాజిటివ్
డీఎంకే లోక్‌సభ ఎంపీ కనిమొళికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఏప్రిల్ 6న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమె విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కరోనా సోకడంతో కనిమొళి ఎన్నికల సభలన్నీ రద్దు చేసుకొని ఆస్పత్రిలో చేరారని డీఎంకే వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment