సాక్షి, న్యూఢిల్లీ: ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా కరోనావైరస్ వ్యాక్సిన్ ట్రయల్స్ నిలిపివేతపై బయోకాన్ చైర్‌పర్సన్, ఎండీ కిరణ్ మజుందార్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సిన్ తయారీలో తొందర పనికి రాదని, త్వరితంగా అభివృద్ధి చేయడం సాధ్యం కాదని ఆస్ట్రాజెనెకా ప్రయోగాల ఆటంకం ద్వారా తేలిందని పేర్కొన్నారు. సురక్షితమైన వ్యాక్సిన్‌ను వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌లో మాత్రమే ఆమోదం లభించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. క్లినికల్ పరీక్షల్లో సమస్యల కారణంగా బ్రిటన్, భారతదేశంతో పాటు ఇతర దేశాలలో అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. (ఆస్ట్రాజెనెకా ట్రయల్స్‌కు డీసీజీఐ బ్రేక్)
టీకా పరీక్షలను జాగ్రత్తగా నిర్వహించాల్సిన అవసరం ఉందని వైద్య, శాస్త్రీయ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్న అంశం ఇదేనని మజుందార్ షా పేర్కొన్నారు. పరీక్షల సందర్భంగా ప్రతి తీవ్రమైన ప్రతికూలతను పరిశోధించాల్సి ఉంటుందనీ, చాలా అప్రమత్తంగా పరీక్షలు నిర్వహించాల్సి ఉందని తెలిపారు. ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలన్నారు. కాగా ఆస్ట్రాజెనెకా కరోనావైరస్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌ను కొన్ని సమస్యల కారణంగా తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ఆస్ట్రాజెనెకా బుధవారం ప్రకటించింది. దీంతో దేశంలో పరీక్షలకు అనుమతి పొందిన సీరం సంస్థ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) తాజా ఆదేశాల మేరకు పరీక్షలను నిలిపివేసింది. ఇది ఇలా ఉంటే కరోనా వైరస్ రోగుల్లో మోడరేట్ నుండి తీవ్రంగా ఏర్పడే సైటోకిన్ రిలీజ్ సిండ్రోమ్, అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ చికిత్సకు బయోకాన్ ఐటోలిజుమాబ్ ఇంజెక్షన్‌ను మార్కెట్ చేసుకునేందుకు జులైలో డీసీజీఐ అనుమతిని సాధించిన సంగతి తెలిసిందే. (ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ట్రయల్స్ నిలిపివేతపై సీరం స్పందన)
Comments
Please login to add a commentAdd a comment