లండన్: కరోనా మహమ్మారి ప్రకంపలు కొనసాగుతున్న తరుణంలో వ్యాక్సిన్ ప్రభావవంత ఫలితాలు ప్రపంచవ్యాప్తంగా భారీ ఊరటనిస్తున్నాయి. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేసిన కరోనా టీకా సామార్థ్యానికి సంబంధించి ఆస్ట్రాజెనెకా సోమవారం కీలక ప్రకటన చేసింది. ఈ టీకా సగటు సామర్థ్యం 70 శాతమని ప్రకటించింది. ప్రయోగ ఫలితం 90 శాతం ప్రభావవంతంగా ఉందని, 70 శాతం మందిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉందని తెలిపింది. దీంతో ఇది "అద్భుతమైన వార్త" అంటూ బ్రిటిష్ ఆరోగ్య కార్యదర్శి మాట్ హాంకాక్ వ్యాఖ్యానించారు.
ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంతో కలిసి అభివృద్ధి చేసిన కోవిడ్-19 వ్యాక్సిన్ 90 శాతం వరకు ప్రభావవంతంగా ఉంటుందన్న సంస్థ గణాంకాలపై ఆయన ఉత్సాహంగా స్పందించారు. ఈ ఫలితాలు ధృవీకరణ అయితే ఇది చాలా శుభవార్త అవుతుంది. ఎందుకంటే ప్రజలు వ్యాధి బారిన పడకుండా నివారించడమే కాకుండా దాని విస్తృతిని కూడా నిలువరించాల్సి ఉందని ఆయన అన్నారు. 100 మిలియన్ మోతాదులను ఆర్డర్ చేశామనీ, అన్నీ సవ్యంగా జరిగితే, కొత్త సంవత్సరంలో వ్యాక్సిన్‌ను ఎక్కువమంది అందించనున్నామని పేర్కొన్నారు. వ్యాక్సిన్ సురక్షితంగా ఉందని తేలితే దాన్ని ఎలా ఉత్తమంగా నిర్వహించాలో తెలిపేందుకు కూడా ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్ అధ్యయనం చేయాలని సూచించారు. ఈ ఫలితాలను రెగ్యులేటరీ సంస్థలు అధ్యయనం చేయాల్సి ఉంటుందని హాంకాక్ చెప్పారు. అంతేకాదు వ్యాక్సిన్ వ్యాధి వ్యాప్తిని తగ్గించగలదనేందుకు నివేదికలో ఆధారాలు ఉన్నాయని ఆయన చెప్పారు.
మరోవైపు క్లీనికల్ ట్రయల్స్ సమాచారంపై జరిపిన తొలి విశ్లేషణలో వలంటీర్లలో సగటున 70 శాతం మందిని రక్షించినట్టు వెల్లడైందని ఆస్ట్రాజెనెకా తాజాగా తెలిపింది. క్లీనికల్ ట్రయల్స్‌లో భాగంగా ఆక్స్‌ఫర్డ్ టీకా విషయంలో అధికారులు రెండు రకాల డోసుల వలంటీర్లకు ఇచ్చారు. మొదటి విధానంలో వలంటీర్లకు తొలుత సగం డోసు ఇచ్చి, ఆ తరువాత పూర్తి డోసు ఇచ్చారు. టీకా 90 శాతం సామర్థ్యంతో పనిచేసినట్టు వెల్లడైంది. కరోనా టీకా డోసులకు సంబంధించి రెండో విధానంలో ఈ టీకా 62 శాతం సామర్థ్యం చూపినట్టు తేలింది. సగం డోసు వినియోగించగా టీకా సామర్థ్యం 90 శాతంగా వెల్లడవడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని ఆస్ట్రాజెనెకా ప్రతినిధి తెలిపారు. ఈ విధానం అత్యంత ప్రభావశీలమైనదని, టీకా విషయంలో ఇదే అవలంబించాలని వివిధ దేశాల ఔషధ నియంత్రణ సంస్థలకు సూచిస్తామని పేర్కొన్నారు. సుమారు 24 వేల మంది వాలంటీర్ల నుంచి ఈ డేటాను సేకరించారు. బ్రిటన్, బ్రెజిల్, దక్షిణ ఆఫ్రికాల్లో భారీ స్థాయిలో ట్రయల్స్ నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment