సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్న సమయంలో వ్యాక్సిన్ విషయంలో ఊరటనిచ్చే వార్త. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ సహకారంతో బ్రిటిష్ దిగ్గజం ఆస్ట్రాజెనెకా రూపొందిస్తున్న వ్యాక్సిన్ కు సంబంధించి దేశంలో 3వ దశ ట్రయల్స్ ఈ వారంలోనే ప్రారంభం కానున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ ట్రయల్స్‌లో 1600 మందికి ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ఇస్తామని హోం వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి సమాచారం అందించింది.
ఈ వ్యాక్సిన్ తయారీకి అనుమతి పొందిన పూణేకు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా క్లినికల్ ట్రయల్స్ ఆగస్టు 22న ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం పలు ప్రాంతాలను ఎంపిక చేసింది. 20 కేంద్రాలలో ప్రారంభం కానున్న ఈ ట్రయల్స్ మొదటి రోజున వంద మందికి టీకాలు వేస్తారు. ముఖ్యంగా పూణే, మహారాష్ట్ర , అహ్మదాబాద్ ఢిల్లీ. ఎయిమ్స్ సహా, ముంబైలోని సేథ్ జి.ఎస్. మెడికల్ కాలేజ్, కేఇఎం హాస్పిటల్, టీఎన్ మెడికల్ కాలేజ్, చండీగఢ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కేంద్రాల్లో 3వ దశ పరీక్షలను నిర్వహించనున్నారు.
కోవిడ్-19 హాట్‌స్పాట్‌లుగా ఉన్న ఐదు వేర్వేరు ప్రాంతాలను కలుపుతూ దేశవ్యాప్తంగా 20 వేర్వేరు ప్రాంతాలు, ఆసుపత్రులనుఎంపిక చేశామని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రతినిధి ఒకరు తెలిపారు. ఐసీఎంఆర్ భాగస్వామ్యంతో11-12 ఆసుపత్రులలో ట్రయల్స్ నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ఇందులో పాల్గొనేవారు వ్రాతపూర్వక సమ్మతి ఇవాల్సి ఉంటుందని, అలాగే స్టడీ ప్రోటోకాల్ అవసరాలకు అనుగుణంగా వారు అధ్యయన ప్రాంతంలోనే నివసించాలని తెలిపింది. దీంతో కరోనా నివారణకు సంబంధించి భారతదేశంలో అందుబాటులోకి రానున్న తొలి వ్యాక్సిన్ కోవిషీల్డ్ కానుందనే అంచనా నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment