![AstraZeneca vaccine immune response higher with longer gap - Sakshi](/styles/webp/s3/article_images/2021/06/29/ASTRA-JAB.jpg.webp?itok=Bc8vjZQs)
లండన్: ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ది చేసిన కోవిడ్ 19 టీకా (భారత్‌లో కొవిషీల్డ్) రెండో డోసు వేసుకోవడానికి ఎక్కువ వ్యవధి తీసుకోవడం మంచిదని తాజా అధ్యయనంలో తేలింది. ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ చేసిన ఈ అధ్యయనంలో రెండో డోసు తీసుకోవడాన్ని వాయిదా వేయడం వల్ల, అలాగే, ఆ తరువాత మూడో డోసును కూడా ఆలస్యంగా తీసుకోవడం వల్ల కరోనా నిరోధక శక్తి బాగా పెరుగుతోందని తేలింది. మొదటి, రెండో డోసుల మధ్య 45 వారాల వ్యవధి ఉంటే ఇమ్యూనిటీ పెరుగుతుందని ఆ అధ్యయనంలో పేర్కొన్నారు. 45 వారాల వ్యవధి వల్ల కరోనా ఇమ్యూనిటీ తగ్గుతుందన్న వాదనను ఇది తోసిపుచ్చింది.
రెండో డోసు తీసుకున్న ఆరు నెలల తరువాత మూడో డోసు తీసుకుంటే శరీరంలో యాంటీబాడీల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని పేర్కొంది. అయితే, ఈ అధ్యయనాన్ని మరింత లోతుగా పరీక్షించాల్సి ఉంది. ‘తగినన్ని టీకాలు అందుబాటులో లేని దేశాలకు ఇది శుభవార్త. రెండో డోసు ఆలస్యం కావడం వల్ల నష్టం కన్నా లాభమే ఎక్కువ’అని ఆ స్టడీలో పాల్గొన్న ఆండ్య్రూ పోలర్డ్ వ్యాఖ్యానించారు.
మొదటి డోసు వేసుకున్న 10 నెలల తరువాత రెండో డోసు వేసుకున్న వారికి అద్భుతంగా ఇమ్యూనిటీ పెరిగిందన్నారు. మూడో డోసును ఆలస్యంగా వేయడం వల్ల కూడా సానుకూల ఫలితాలు వెలువడ్డాయన్నారు. కాగా, ఈ వ్యాక్సిన్‌తో అతికొద్ది మందిలో రక్తం గడ్డకట్టే సమస్య ఏర్పడుతున్నట్లు గుర్తించారు. దీంతో కొన్ని దేశాలు ఈ టీకాను నిషేధించగా, కొన్ని దేశాలు యువతకు ఈ టీకా ఇవ్వరాదని నిర్ణయించాయి.
Comments
Please login to add a commentAdd a comment