భోపాల్‌లో వ్యాక్సిన్ బాక్సులకు పూజలు చేస్తున్న వైద్య సిబ్బంది
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్‌కు కేంద్ర ప్రభుత్వం చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. టీకా సరఫరా కోసం ఉద్దేశించిన కో–విన్ యాప్‌లో ఇప్పటికే కోటి మందికిపైగా తమ పేర్లు నమోదు చేసుకున్నారు. మరో మూడు రోజుల్లోనే వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. ఆక్స్‌ఫర్డ్–ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్, హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌కు ప్రభుత్వం అత్యవసర వినియోగ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.
తొలిదశలో ఈ నెల 16వ తేదీ నుంచి ఈ వ్యాక్సిన్లను దాదాపు 3 కోట్ల మంది హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు ఉచితంగా అందజేయనున్నారు. కోవిషీల్డ్, కోవాగ్జిన్‌లో నిర్దిష్టంగా ఏదైనా ఒకటి ఎంచుకునే అవకాశం లబ్ధిదారులకు లేదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. రెండు టీకాల్లో ఎవరికి ఏ టీకా వేయాలన్నది ప్రభుత్వమే నిర్ధారిస్తుందని వెల్లడించింది. అంటే ఇష్టమైన టీకా తీసుకునే వెసులుబాటు లేనట్లే. వచ్చే ఎనిమిది నెలల్లో దేశంలో 30 కోట్ల మందికి కరోనా టీకా ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
16.5 లక్షల కోవాగ్జిన్ డోసులు ఉచితం
కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను భారత్‌లో పుణేలోని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్‌ఐఐ) ఉత్పత్తి చేస్తోంది. తొలిదశలో ఈ సంస్థ నుంచి 1.1 కోట్ల టీకా డోసులు, భారత్ బయోటెక్ నుంచి 55 లక్షల డోసుల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. మొదటి 10 కోట్ల డోసుల్లో ఒక్కో డోసును రూ.200 చొప్పున ధరకు ప్రభుత్వానికి విక్రయించనున్నట్లు సీరం సంస్థ సీఈవో అదార్ పూనావాలా చెప్పారు. పన్నులతో కలుపుకుంటే ఒక్కో డోసు ధర రూ.220కు చేరుతుందన్నారు. ఇక కోవాగ్జిన్ ధర పన్నులు లేకుండా ఒక్కో డోసు రూ.295. పన్నులు కూడా కలిపితే రూ.309.5 అవుతుంది.
55 లక్షల డోసుల కొనుగోలుకు ప్రభుత్వం ఒప్పందం చేసుకోగా, ఇందులో 16.5 లక్షల డోసులను ఉచితంగా సరఫరా చేస్తామని భారత్ బయోటెక్ హామీ ఇచ్చింది. ఈ లెక్కన చూస్తే కోవాగ్జిన్ ఒక్కో డోసు రూ.206కే ప్రభుత్వం కొన్నట్లు అవుతుందని అధికారులు చెప్పారు. వ్యాక్సినేషన్ నేపథ్యంలో కరోనా టీకాల చేరవేత ఊపందుకుంది. విమానాల్లో తొలుత ప్రధాన నగరాలకు, అక్కడి నుంచి ద్వితీయశ్రేణి నగరాలు, పట్టణాలకు జాగ్రత్తగా, వేగంగా చేరవేస్తున్నారు. కరోనా టీకా రెండో డోసు తీసుకున్న 14 రోజుల తర్వాత దాని ప్రభావం కనిపించడం మొదలవుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ బుధవారం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment