మంత్రి అనిల్‌కు టీకా డోసు వేస్తున్న దృశ్యం
న్యూఢిల్లీ : ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ ఆస్ట్రాజెనికా వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి అందుబాటులోకి వస్తుందని వ్యాక్సిన్ తయారీ సంస్థ సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదార్ పూనావాలా తెలిపారు. ఆరోగ్య రంగ సిబ్బందికి, వృద్ధులకి ఫిబ్రవరి నాటికే వ్యాక్సిన్‌ని ఇచ్చే అవకాశాలున్నాయని చెప్పారు. రెండు వ్యాక్సిన్ డోసుల ఖరీదు వెయ్యి రూపాయల వరకు ఉంటుందన్నారు. హిందూస్తాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్–2020లో పాల్గొన్న పూనావాలా ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ప్రయోగాలు ముగింపు దశకు వచ్చాయని చెప్పారు.
2024కల్లా అందరికీ వ్యాక్సినేషన్
ప్రజలందరికీ వ్యాక్సినేషన్ పూర్తి కావడానికి 2024 అవుతుందని వెల్లడించారు. ‘‘130 కోట్ల జనాభాకి వ్యాక్సిన్ అందుబాటులోకి రావాలంటే మూడు, నాలుగేళ్లు పడుతుంది. కేవలం వ్యాక్సిన్ డోసుల సరఫరాలో సమస్యలే కాకుండా డోసుల ఉత్పత్తికి సరిపడా బడ్జెట్ ఉండాలి. వాటి పంపిణీకి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాలి. వీటన్నింటినీ అధిగమించినా 80–90శాతం జనాభాకే వ్యాక్సిన్ ఇవ్వడం కుదురుతుంది’’అని ఆయన వివరించారు. ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ వృద్ధుల్లో కూడా సత్ఫలితాలు ఇవ్వడంతో ఈ వ్యాక్సిన్‌పై అంచనాలు పెరిగిపోయాయని చెప్పారు. భారత్‌లో జరిగే ప్రయోగాల ఫలితాలు మరో నెలన్నరలో వెలువడతాయని పూనావాలా చెప్పారు. 2 నుంచి 8 డిగ్రీల వాతావరణంలో ఈ వ్యాక్సిన్‌ను నిల్వ చేయవచ్చునన్నారు. 2021 ఏప్రిల్ నాటికి 30 నుంచి 40 కోట్ల డోసులు ఉత్పత్తి చేస్తామని చెప్పారు. భారత్‌కి వ్యాక్సిన్ ఇవ్వడమే తొలిప్రాధాన్యమన్నారు.
మూడో దశ ప్రయోగాల్లోకి చైనా టీకా
చైనాకు చెందిన అన్హుయ్ ఝిఫై లాంగ్‌కామ్ బయోఫార్మాస్యూటికల్ కంపెనీ తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్ మూడో దశ మానవ ప్రయోగాల్లోకి అడుగుపెట్టింది. అన్హుయ్ కంపెనీ ఈ వ్యాక్సిన్‌ను చైనీస్ అకాడెమీ సైన్సెస్‌కు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మైక్రో బయాలజీతో కలసి అభివృద్ధి చేస్తోంది. మూడో దశ ప్రయోగాల కోసం ప్రపంచవ్యాప్తంగా 29 వేల మందిని వాలంటీర్లుగా ఎంచుకోనుంది.
రెమిడెసివిర్ ఇవ్వొద్దు డబ్ల్యూహెచ్‌వో సిఫారసు
కరోనా చికిత్సలో సత్ఫలితాలు ఇస్తోందని ఇన్నాళ్లూ భావిస్తూ వచ్చిన యాంటీ వైరల్ డ్రగ్ రెమిడెసివిర్‌తో కలిగే ప్రయోజనం ఏమీ లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. గిలియాడ్ సంస్థకు చెందిన ఈ ఔషధంతో కరోనా రోగులు కోలుకుంటారని, వారి ప్రాణాలు కాపాడగలమనడానికి ఎలాంటి ఆధారాలు లేవని డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది. రెమిడెసివిర్ ఇచ్చిన 7 వేలకు పైగా కోవిడ్ రోగుల్ని అధ్యయనం చేసిన తర్వాత దాంతో వచ్చే ఉపయోగం లేదని అంతర్జాతీయ ఆరోగ్య నిపుణులతో కూడిన డబ్ల్యూహెచ్‌వో గైడ్‌లైన్ డెవలప్‌మెంట్ గ్రూప్ అభిప్రాయపడింది. ఈ వివరాలను బ్రిటన్‌కు చెందిన మెడికల్ ట్రేడ్ జర్నల్ ప్రచురించింది. కాగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసుపై గిలియాడ్ సంస్థ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
కొవాగ్జిన్ వాలంటీర్‌గా హరియాణా మంత్రి
భారత్ బయోటెక్ రూపొందిస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ కొవాగ్జిన్ చివరి దశ ప్రయోగాలు హరియాణాలో ప్రారంభమయ్యాయి. ఈ ప్రయోగాల్లో భాగంగా హరియాణా ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ వాలంటీర్‌గా టీకా డోసు తీసుకున్నారు. అంబాలాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మంత్రికి కొవాగ్జిన్ డోసు ప్రయోగాత్మకంగా ఇచ్చి చూశారు. వ్యాక్సిన్ ఇవ్వడానికి ముందు ఆయనకు కొన్ని పరీక్షలు చేశారు. ఒక ప్రజాప్రతినిధి వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రావడం భారత్‌లో ఇదే తొలిసారి. టీకా ఇవ్వడంతో ఆయనలో వచ్చే ఆరోగ్యపరమైన మార్పుల్ని నిరంతరం వైద్యులు పరీక్షిస్తారు. నాలుగు వారాల తర్వాత మంత్రికి రెండో డోసు ఇస్తారు.
Comments
Please login to add a commentAdd a comment