ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న మహమ్మారి కోవిడ్-19కు చెక్ పెట్టేందుకు దేశీయంగా తొలి వ్యాక్సిన్ 2020 డిసెంబర్‌కల్లా అందుబాటులోకి రావచ్చని ఫార్మా వర్గాలు ఊహిస్తున్నాయి. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ సహకారంతో బ్రిటిష్ దిగ్గజం ఆస్ట్రాజెనెకా రూపొందిస్తున్న వ్యాక్సిన్ ఇప్పటికే రెండు, మూడు దశల క్లినికల్ పరీక్షలలో ఉంది. ఈ వ్యాక్సిన్ తయారీకి దేశీయంగా సీరమ్ ఇన్‌స్టిట్యూట్ లైసెన్సింగ్‌ను పొందిన సంగతి తెలిసిందే. మరోవైపు దేశీ కంపెనీలలో భారత్ బయోటెక్, జైడస్ క్యాడిలా సైతం సొంత వ్యాక్సిన్ తయారీ సన్నాహాల్లో ఉన్నాయి. ఐసీఎంఆర్‌తో చేతులు కలపడం ద్వారా భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న కోవాగ్జిన్ ప్రస్తుతం తొలి దశ క్లినికల్ పరీక్షలను పూర్తిచేసుకోనుంది. ఇదే విధంగా జైడస్ క్యాడిలా రూపొందిస్తున్న జైకోవ్-డి సైతం తొలి దశ పరీక్షలలో ఉన్నట్లు సంబంధివర్గాలు పేర్కొన్నాయి. (నిమ్స్‌లో క్లినికల్ ట్రయల్స్ 2వ ఫేజ్‌కు..)
1600 మందిపై
దేశీయంగా ఆక్స్‌ఫర్డ్- ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌పై క్లినికల్ పరీక్షలకు అనుమతి పొందిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్.. 1600 మందిపై వీటిని నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఎంపిక చేసిన 17 ప్రాంతాలలో 18ఏళ్లకుపైబడిన వారిపై 2-3 దశల ప్రయోగాలు చేపట్టినట్లు పరిశ్రమవర్గాలు తెలియజేశాయి. ఈ వ్యాక్సిన్ తయారీకి భాగస్వామిగా ఒప్పందాన్ని కుదుర్చుకున్న సీరమ్.. నెలకు 10 కోట్ల డోసేజీలను అందించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక దేశీయంగా రూపొందిస్తున్న కంపెనీలు సైతం వ్యాక్సిన్లను ఐదు ప్రాంతాలలో 1,000-1100 మందిపై ప్రయోగిస్తున్నట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. కాగా.. ఆక్స్‌ఫర్డ్- ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ అభివృద్ధి, పంపిణీలకు వీలుగా ఇటీవలే బిల్, మిలిందా గేట్స్ ఫౌండేషన్ 15 కోట్ల డాలర్లు(రూ. 1125 కోట్లు) అందించడం గమనార్హం!
Comments
Please login to add a commentAdd a comment