సావోపౌలో: అస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఈ వ్యాక్సిన్ ట్రయల్స్‌లో వాలంటీర్ మృతి చెందినట్లు బ్రెజిల్ హెల్త్ అథారిటీ అన్విసా బుధవారం ప్రకటించింది. ట్రయల్స్ కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ట్రయల్స్‌ను కొనసాగిస్తామంది. ఈ ఘటనపై అస్ట్రాజెనెకా స్పందించలేదు. చనిపోయిన వలంటీర్‌కు వ్యాక్సిన్ ఇచ్చినట్లు నిర్ధారణైతే ట్రయల్స్‌ను 3 నెలలు ఆపివేయ వచ్చని సంబంధితవర్గాలు తెలిపినట్లు రాయిటర్స్ పేర్కొంది.
ఇప్పటికున్న సమాచారం ప్రకారం మృతి చెందిన వలంటీర్‌కు మెనింజిటిస్ వ్యాక్సిన్ ఇచ్చారని సదరు వర్గాలు తెలిపాయి. ప్రస్తుతానికి ట్రయల్స్ కొనసాగించవచ్చని ఈ ఘటనపై విచారణ జరిపిన స్వతంత్ర విచారణ కమిటీ సూచించిందని ట్రయల్స్‌ను పర్యవేక్షిస్తున్న సావోపౌలో ఫెడరల్ యూనివర్సిటీ తెలిపింది. మృతి చెందిన వలంటీర్ రియోడిజినిరోకు చెందిన 28 సంవత్సరాల వైద్యుడి గా చెబుతున్నారు. కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి వలంటీర్లలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని యూనివర్సిటీ తెలిపింది. ఇప్పటివరకు 8 వేల మంది వలంటీర్లను ట్రయల్స్ కోసం తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment