
ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తున్న కోవిడ్-19 మహమ్మారిని అంతమొందించేందుకు రూపొందిస్తున్న వ్యాక్సిన్‌పై క్లినికల్ పరీక్షలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా తాజాగా వెల్లడించింది. తుది దశ క్లినికల్ పరీక్షలలో భాగంగా బ్రిటన్‌లో ఒక వ్యక్తిపై ప్రయోగించిన వ్యాక్సిన్ అనారోగ్యానికి దారితీసినట్లు తెలుస్తోంది. దీంతో వీటిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆస్ట్రాజెనెకా తెలియజేసింది. ప్రస్తుతం ఈ అంశంపై దృష్టిసారించామని, డేటాను విశ్లేషించాక తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు వివరించింది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ సహకారంతో ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేస్తున్న ఈ వ్యాక్సిన్‌పై ప్రపంచవ్యాప్తంగా ఇటీవల ఆశలు రేకెత్తిన విషయం విదితమే. భారీ స్థాయిలో నిర్వహించే క్లినికల్ పరీక్షలలో ఒక్కోసారి ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తవచ్చని.. ఇవి సహజమేనని ఈ సందర్భంగా ఆస్ట్రాజెనెకా పేర్కొంది. అయితే ఏ చిన్న పొరపాటుకూ తావివ్వకుండా పరిశోధనలు నిర్వహించేందుకే పరీక్షలను స్వతంత్రంగా నిలిపివేసినట్లు వివరించింది.
అమ్మకాలతో డీలా..
ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌పై పరీక్షలు నిలిచిపోయిన వార్తల నేపథ్యంలో దేశీ అనుబంధ సంస్థ అయిన ఆస్ట్రాజెనెకా ఫార్మా ఇండియా కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 6.3 శాతం పతనమై రూ. 3,968 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 12 శాతంపైగా పడిపోయి రూ. 3,710ను తాకింది. కాగా.. ఈ ఏప్రిల్- జూన్ కాలంలో కంపెనీ నికర లాభం 13 శాతంపైగా క్షీణించి రూ. 19 కోట్లకు పరిమితంకాగా.. నికర అమ్మకాలు 5 శాతం తగ్గి రూ. 194 కోట్లకు చేరాయి. కన్సాలిడేటెడ్ ఫలితాలివి.
Comments
Please login to add a commentAdd a comment