షరతులతో సీరంకు గ్రీన్ సిగ్నల్  | Serum gets DCGI nod to resume Oxford vaccine trials with conditions | Sakshi
Sakshi News home page

కరోనా : షరతులతో సీరంకు గ్రీన్ సిగ్నల్ 

Published Wed, Sep 16 2020 10:19 AM | Last Updated on Wed, Sep 16 2020 11:06 AM

Serum gets DCGI nod to resume Oxford vaccine trials with conditions - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీతో కలిసి ఆస్ట్రాజెనెకా రూపొందిస్తున్న కరోనా వ్యాక్సిన్‌ క్లినికల్ ట్రయల్‌ను తిరిగి ప్రారంభించడానికి  సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు  అనుమతి లభించింది. ఈ మేరకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) ఆక్స్‌ఫర్డ్ కోవిడ్-19 వ్యాక్సిన్ పరీక్షలకు అనుమతినిచ్చింది. అయితే ఈ సమయంలో ప్రోటోకాల్ ప్రకారం అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎప్పటికపుడు సంబంధిత  సమాచారాన్ని కచ్చితంగా అందించాలని స్పష్టం చేసింది.  రోజుకు 90 వేలకు పైగా కేసులతో కరోనా ఉధృతి కొనసాగుతున్న తరుణంలో ఆక్స్‌ఫర్డ్ ఆస్ట్రాజెనెకా వాక్సిన్ ప్రయోగాలు తిరిగి మొదలు కావడం కాస్త ఊరటనిచ్చే అంశం.  (కరోనా భారత్: 50 లక్షలు దాటిన కేసులు)

ఇటీవల ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా క్లినికల్ ట్రయల్స్‌ను బిట్రన్‌లో  నిలిపివేసిన నేపథ్యంలో తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు వ్యాక్సిన్ రెండు, మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ నిలిపి వేయాలని డీసీజీఐ ఈ నెల 11న సీరంను ఆదేశించింది. విదేశాల్లో అనుమతి లభించిన నేపథ్యంలో తాజా అనుమతిని డా.వి.జి.సొమానీ మంగళవారం మంజూరు చేశారు. అయితే అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని సీరం ఇన్‌స్టిట్యూట్‌కు సూచించారు. ప్రతికూల పరిస్థితులు ఎదురైతే వినియోగించాల్సిన మందుల జాబితాతో పాటు ఇతర చికిత్సా వివరాలను తమకు సమర్పించాలని ఆదేశించారు. (ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ పరీక్షలు మళ్లీ షురూ!)

కాగా బ్రిటిష్-స్వీడిష్ కంపెనీ ఆస్ట్రాజెనికా, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ సంయుక్తంగా కోవిడ్ వాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. దేశీయంగా ఆ వాక్సిన్‌ ఉత్పత్తికి పుణేకు చెందిన సీరం ఒప్పందం చేసుకుంది. మూడవ దశ ఫలితాల్లో సమస్యల కారణంగా ఇండియా సహా, బిట్రన్‌లో వ్యాక్సిన్ ట్రయల్స్ నిలిపివేసింది. ఇటీవల బ్రిటన్ మెడిసిన్ హెల్త్ రెగ్యులేటరీ అధారిటీ అనుమతి లభించడంతో ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్‌ను మళ్లీ ప్రారంభించిన సంగతి  తెలిసింది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్‌లోనూ రెండు, మూడో దశ ప్రయోగాలకు డీసీజీఐ అనుమతినిచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement