కోవిషీల్డ్‌ @ రూ.200-400 | Covishield vaccine to be sold to govt at Rs 200 To 400 dose | Sakshi
Sakshi News home page

కోవిషీల్డ్‌ @ రూ.200-400

Published Tue, Jan 5 2021 5:37 AM | Last Updated on Tue, Jan 5 2021 5:55 AM

Covishield vaccine to be sold to govt at Rs 200 To 400 dose - Sakshi

న్యూఢిల్లీ: ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధిచేసిన కోవిడ్‌ టీకా ’కోవిషీల్డ్‌’ను భారత ప్రభుత్వానికి ఒక్కో డోసు 3–4 డాలర్ల చొప్పున, ప్రైవేట్‌ మార్కెట్లో 6–8 డాలర్ల చొప్పున విక్రయిస్తామని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ సీఈఓ అదర్‌ పూనావాలా చెప్పారు. దేశీయంగా ఆక్స్‌ఫర్డ్‌ టీకా ఉత్పత్తి, పంపిణీ సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ చేపట్టనుంది. ఇప్పటికే దాదాపు 5 కోట్ల డోసుల కోవిషీల్డ్‌ను ఉత్పత్తి చేశామని అదర్‌ చెప్పారు. తొలిదశలో భారత ప్రభుత్వానికి, జీఏవీఐ (గ్లోబల్‌ అలయన్స్‌ ఫర్‌ వాక్సిన్స్‌ అండ్‌ ఇమ్యూనైజేషన్స్‌) దేశాలకు అందిస్తామని, తర్వాతే ప్రైవేటు మార్కెట్లోకి విడుదల చేస్తామని తెలిపారు. తమ వ్యాక్సిన్‌ అందరికీ అందుబాటు ధరలో ఉండాలన్నదే తమ ప్రయత్నమని, అందుకే ప్రభుత్వానికి ఒక్కో డోసు 3–4 డాలర్ల ధరకు (సుమారు 200– 280 రూపాయలు) అందిస్తామని చెప్పారు.

ప్రైవేట్‌ మార్కెట్లో ధర రెట్టింపు ఉండొచ్చని అంటే సుమారు 6–8 డాలర్లు (సుమారు 400–600 రూపాయలు) ఉంటుందని చెప్పారు. ఈప్రకారం చూస్తే రెండు డోసులకు కలిపి ప్రభుత్వానికి సుమారు 400–600 రూపాయలు, ప్రైవేట్‌ మార్కెట్లో రూ. 800–1,200 వరకు ఉంటుంది. వ్యాక్సిన్‌ అందజేయడంపై ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. డీసీజీఐ అనుమతి అనంతరం 7–10 రోజుల్లో టీకా పంపిణీకి రెడీగా ఉంటుందన్నారు. దేశీయ అవసరాలు తీరే వరకు టీకాను ఎగుమతి చేయవద్దని సీరమ్‌ను డీసీజీఐ ఆదేశించడంపై స్పందిస్తూ, ప్రభుత్వంతో అనుమతి పొందిన అనంతరమే ఎగుమతులు ఆరంభిస్తామన్నారు. తమ వ్యాక్సిన్‌ 100 శాతం సమర్ధవంతంగా పనిచేస్తోందని భరోసా ఇచ్చారు.   
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement