సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కరోనా స్వైర విహారం కొనసాగుతోంది. యూరోపియన్ దేశాల్లో కోవిడ్–19 సెకండ్ వేవ్ నడుస్తుండగా, ఢిల్లీలో మాత్రం థర్డ్ వేవ్ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా కోవిడ్–19 పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా ఢిల్లీలోనే రికార్డు స్థాయిలో నమోదవుతుండడంతో మరణాలు కూడా ఎక్కువ పెరిగాయి. చలిగాలులతో పాటు కాలుష్యం కారణంగా కరోనా వైరస్ విజృంభిస్తోందని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. ఢిల్లీ పొరుగు రాష్ట్రాలైన హరియాణా, పంజాబ్ రాజస్తాన్‌ల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడం కారణంగా కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది.
కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో కరోనా మహమ్మారి కేసులు వస్తున్న సమయంలోనైనా పంట వ్యర్థాల కాలుష్యాన్ని అడ్డుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కేజ్రీవాల్ సర్కార్ విజ్ఞప్తి చేసింది. దేశ రాజధానిలో ఈ స్థాయిలో కరోనా విజృంభించడానికి కారణం గాలి కాలుష్యమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కోవిడ్–19 పాజిటివ్ వ్యక్తులు ఈ కలుషిత గాలిని పీల్చడంతో ఆరోగ్యం విషమించి, మరణాల రేటు పెరుగుతోంది. మార్చి నుంచి మే వరకు కరోనా కేసులు పెరిగినప్పటికీ, జూన్ నుంచి కాస్త తగ్గుముఖం పట్టాయి. అయితే, ఉత్తరాదిన చలి, కాలుష్య తీవ్రత కారణంగా ఢిల్లీలో విపరీతంగా కేసులు పెరుగుతున్నాయి. రోగ నిరోధక శక్తిని తగ్గించి, అనారోగ్యాన్ని పెంచే వాయు కాలుష్యం ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.
చేతులు దాటాక ఆస్పత్రికి..
హస్తినలో కోవిడ్ –19 కేసుల సంఖ్య పెరగడంతో, ఆసుపత్రుల్లో రోగులు గడిపే సమయం కూడా పెరిగింది. దీని కారణంగా దేశ రాజధానిలో కోవిడ్ పడకల కొరత పెరిగింది. అంతేగాక పాజిటివ్ నిర్ధారణ అయి, ఆక్సిజన్ స్థాయి తీవ్రంగా పడిపోయినప్పుడు మాత్రమే రోగులు ఆసుపత్రికి వస్తున్నారని ఢిల్లీ ప్రభుత్వం నిర్వహిస్తున్న గురు తేజ్ బహదూర్ వైద్యులు తెలిపారు. అంతేగాక ఆసుపత్రిలో, కోవిడ్ రోగి బస చేసే సగటు వ్యవధి 10 రోజుల నుంచి మూడు వారాలకు పెరిగింది.
జూన్–జూలై నెలల్లో మహమ్మారి సంక్రమణ సమయంలో ఒక్క రోజులో అత్యధిక మరణాలు (101) నమోదయ్యాయి. కానీ థర్డ్ వేవ్ ప్రారంభమైన తర్వాత, నవంబర్ 18న అత్యధికంగా ఒక్క రోజులో 131 మరణాలు నమోదయ్యాయి. నవంబర్ 11న ఒకే రోజులో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో 8,593 గా నమోదైంది. పాజిటివ్ నిర్ధారణ అయిన తర్వాత హోం క్వారంటైన్ అయిన రోగుల ఆరోగ్యం ఆక్సిజన్ స్థాయి నిర్ధారణలో ఆలస్యం కారణంగా విషమంగా మారుతోందని వైద్యులు తెలిపారు. ఇటువంటి కేసుల్లో 48–72 గంటల్లోనే మరణాలు సంభవిస్తున్నాయి.
57 లక్షల కరోనా సర్వేలో 13,516 మంది గుర్తింపు
దేశ రాజధానిలో థర్డ్ వేవ్ కారణంగా ఎక్కువగా ప్రభావితమైన ప్రాంతాల్లో ఢిల్లీ ప్రభుత్వం ఐదు రోజుల పాటు ఇంటింటికి తిరిగి భారీ సంఖ్యలో కరోనా పరీక్షలను నిర్వహించింది. ఢిల్లీలోని 11 జిల్లాల్లో ముగ్గురు సభ్యుల 9వేల బందాలు కోవిడ్ హాట్‌స్పాట్ సెంటర్లలో 57 లక్షల మందికి పరీక్షలు నిర్వహించారు. అందులో రోగ లక్షణాలు ఉన్న 13,516 మందిని, వీరితో పరిచయం ఉన్న 8,413 మందిని గుర్తించారు. రోగ లక్షణాలు గుర్తించిన వారిలో అత్యధికంగా 3,796 మంది నైరుతి ఢిల్లీ జిల్లాలో ఉన్నారు.
కట్టడికి కఠిన నిబంధనలు
కరోనా కట్టడికి ఢిల్లీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. మాస్కు ధరించని వారికి వేసే జరిమానాను రూ.500 నుంచి ఏకంగా రూ.2,000 కు పెంచింది. వివాహ వేడుకలకు హాజరయ్యే అతిథుల సంఖ్యను 200 నుంచి 50కి కుదించింది. జన సంచారం అధికంగా ఉండే మార్కెట్లలో కోవిడ్–19 నిబంధనలను పాటించకపోతే మూసివేసేందుకు ప్రతిపాదనలను కూడా సిద్ధం చేసింది. రెండు మార్కెట్లను తాత్కాలికంగా మూసివేయాలని తీసుకున్న నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ఢిల్లీ ప్రభుత్వం వెనక్కి తగ్గిన విషయం విదితమే.
భారత్‌లో రష్యా టీకా తయారీ
రష్యాకు చెందిన సుత్నిక్ వీ కరోనా వ్యాక్సిన్‌ను ఇక భారత్‌లో పెద్ద ఎత్తున తయారు చేయనున్నారు. ఏడాదికి 10 కోట్లకు డోసులకు పైగా డోసుల్ని ఉత్పత్తి చేయడానికి రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఆర్‌డీఐఎఫ్) భారత్ ఫార్మా దిగ్గజం హెటిరోతో ఒప్పందం కుదుర్చుకుంది. వచ్చే ఏడాది మొదట్లో ఉత్పత్తిని భారత్‌లో ప్రారంభిస్తామని ఆర్‌డీఐఎఫ్ పేర్కొంది. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ మూడో దశ ప్రయోగాలు వెనెజులా, భారత్ తదితర దేశాల్లో జరుగుతున్నాయి. 50కి పైగా దేశాల నుంచి 1,200 కోట్లకు పైగా టీకా డోసులు కావాలంటూ రష్యాకు విజ్ఞప్తులు అందాయి.
ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్‌ను అంచనా వేయండి
లండన్: ఆక్స్‌ఫర్డ్–అస్ట్రాజెనెకా కోవిడ్–19 వ్యాక్సిన్ ఎంత వరకు పని చేస్తుందో అంచనా వేయాలంటూ యూకే ప్రభుత్వం వైద్య నియంత్రణ మండళ్లను కోరింది. ఈ మేరకు యూకే ఆరోగ్య మంత్రి మట్ హన్‌కాక్ లేఖ రాశారు. త్వరలోనే ఈ టీకా ప్రయోగాలు పూర్తి కావస్తూ ఉండడంతో ఈలోగా సామర్థ్యాన్ని అంచనా వేస్తే పంపిణీ సులభతరం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అస్ట్రాజెనెకా ఈ ఏడాది చివరి నాటికి 40 లక్షల డోసుల్ని ఉత్పత్తి చేయనుంది. 2021 మార్చి నాటికి 4 కోట్ల డోసుల ఉత్పత్తి లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది.
ఢిల్లీలో డేంజర్ బెల్స్
Published Sat, Nov 28 2020 4:35 AM | Last Updated on Sat, Nov 28 2020 8:26 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment