5 నిమిషాల వ్యవధిలో కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలు తీసుకున్న సునీలా దేవి (ఫోటో కర్టెసీ: ఇండియాటుడే)
పట్నా: బిహార్‌లో ఓ మహిళకు నిమిషాల వ్వవధిలో రెండు వేర్వేరు కోవిడ్ టీకాలు వేశారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగానే ఉందని.. అబ్జర్వేషన్‌లో ఉంచి పరిశీలిస్తున్నామన్నారు వైద్యులు. ఈ సంఘటన మూడు రోజుల క్రితం పట్నా పున్‌పున్ బ్లాక్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. బెల్దారిచెక్ గ్రామంలోని ఓ ప్రాథమిక పాఠశాలలో జూన్ 16న వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలో సునీలా దేవి టీకా వేయించుకోవడానికి వెళ్లింది. ఆరోగ్య సిబ్బంది ఆమెకు కోవిషీల్డ్ డోస్ ఇచ్చారు. ఆ తర్వాత అబ్జర్వేషన్ గదిలోకి వెళ్లి ఐదు నిమిషాల పాటు కూర్చోవ్సాలిందిగా సూచించారు.
ఈ మేరకు సునీలా దేవి వెళ్లి అక్కడ కూర్చుంది. ఇంతలో మరో నర్స్ వచ్చి సునీలా దేవికి కోవాగ్జిన్ టీకా ఇచ్చింది. ఈ సందర్భంగా సునీలా దేవి మాట్లాడుతూ.. ‘‘నేను వ్యాక్సిన్ తీసుకున్నానని నర్స్‌కు చెప్పాను. కానీ ఆమె నా మాట వినలేదు. పైగా అంతకుముందు వ్యాక్సిన్ ఇచ్చిన చేతికే మరో టీకా ఇచ్చింది’’ అని వాపోయింది. విషయం కాస్త సునీలా దేవి కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు వైద్య సిబ్బందిని ప్రశ్నించారు.
నిమిషాల వ్యవధిలో ఆమెకు రెండు వేర్వేరు టీకాలు ఇవ్వడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడమేకాక సునీలా దేవి ఆరోగ్య బాధ్యత వారిదేనని తెలిపారు. ఈ క్రమంలో ప్రస్తుతం వైద్యులు సునీలా దేవిని అబ్జర్వేషన్‌లో ఉంచారు. ఇక నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు నర్స్‌లను సస్పెండ్ చేయడమే కాక వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment