ముంబైలో ఖాళీగా ఉన్న వ్యాక్సినేషన్ సెంటర్
సాక్షి, న్యూఢిల్లీ: డిమాండ్‌కి తగ్గట్టుగా కోవిడ్ టీకాల పంపిణీ లేకపోవడంతో టీకా వేయించుకోవడానికి వచ్చిన ప్రజలు వ్యాక్సినేషన్ కేంద్రాల నుంచి వెనుతిరుగుతున్నారు. వ్యాక్సిన్ కొరతనెదుర్కొంటున్న రాష్ట్రాల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది.
రాష్ట్రాల్లో తరిగిపోతున్న టీకా డోసులు
కరోనా సెకండ్‌వేవ్ ఉధృతంగా కొనసాగుతూ ఉండడంతో అన్ని రాష్ట్రాల్లోనూ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకుంది. టీకాల ఉత్పత్తి సామర్థ్యానికి మించి వినియోగిస్తూ ఉండడంతో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దేశంలో కోవిషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్‌ల ఉత్పత్తి నెలకి 7 కోట్ల డోసులుగా ఉంది. ఈ ప్రాతిపదికన రోజుకి 25 లక్షల వరకు ఇవ్వొచ్చు. అయితే వైరస్‌ను ఎదుర్కోవడానికి ఏప్రిల్ 1 తర్వాత అనుకున్నదానికంటే ఎక్కువగా 34 లక్షల డోసులు పంపిణీ చేస్తున్నారు. దీంతో టీకాలకి కొరత ఏర్పడింది. మహారాష్ట్రలో ఇప్పటికే పలు వ్యాక్సిన్ కేంద్రాలను మూసివేశారు.
దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో మహారాష్ట్రలో 60% వరకు వెలుగు చూస్తూ ఉండడంతో ఆ రాష్ట్రంలో రోజుకి 6 లక్షల మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. కానీ ఆ స్థాయిలో టీకా డోసులు ఆ రాష్ట్రానికి అందలేదు. రాష్ట్రాల జనాభా, కరోనా కేసుల ఆధారంగా వ్యాక్సిన్ పంపిణీ చేయాలని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపె డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఆ రాష్ట్రం దగ్గర 4 లక్షల డోసులు అందుబాటులో ఉన్నాయి. ఇక పంజాబ్ దగ్గర 5.7 లక్షల కోవిడ్ టీకాలు ఉన్నాయి. రోజుకి సగటున 85,000–90,000 మందికి టీకా వేస్తున్నారు. ప్రతీ రోజూ 2 లక్షల మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని పంజాబ్‌లో అమరీందర్ సింగ్ ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది.
ఆ లక్ష్యాన్ని చేరుకుంటే మరో మూడు రోజుల్లోనే వ్యాక్సిన్ నిల్వలు అయిపోతాయి. ఇక రాజస్తాన్ రోజుకి 5 లక్షల మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని అన్ని ఏర్పాట్లు చేసుకుంది. కానీ ఆదివారం నాటికే అక్కడ కూడా టీకా డోసులు అయిపోతాయి. అందుకే 30 లక్షల టీకాలు పంపాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కేంద్రానికి లేఖ రాశారు. ఛత్తీస్‌గఢ్‌లో 3 రోజుల్లో టీకా డోసులు అయిపోతాయి. టీకా డోసుల్లో 60 శాతం కంటే ఎక్కువ ఎనిమిది రాష్ట్రాలకు కేంద్రం పంపిణీ చేసింది. వాటిలో మహారాష్ట్ర, రాజస్థాన్ ఉన్నప్పటికీ కేసులు ఎక్కువగా వస్తూ ఉండడంతో వ్యాక్సిన్‌కి డిమాండ్ పెరిగింది. కేంద్రం వద్ద 43 లక్షల వ్యాక్సిన్ డోస్‌లు అందుబాటులో ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి.
కేంద్రానికి చేతకావడం లేదు: సోనియా
దేశంలో కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడం కేంద్ర ప్రభుత్వానికి చేతకావడం లేదని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కరోనా నిర్వహణ సరిగ్గా చేయకుండా టీకా డోసుల్ని వేరే దేశాలకు ఎగుమతి చేస్తూ ఉండడం వల్ల దేశంలో వ్యాక్సిన్ కొరత ఏర్పడిందని అన్నారు. కరోనా కేసులు అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతూ ఉండడం వల్ల ఎన్నికల ర్యాలీలు, బహిరంగ సమావేశాలపై నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. శనివారం సోనియా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోవిడ్ పరిస్థితుల్ని సమీక్షించారు. కరోనా టెస్ట్, ట్రాక్, వ్యాక్సినేట్.. ఈ మూడింటికే అత్యధిక ప్రాధాన్యతనివ్వాలన్నారు. కరోనా టీకా కొరత గురించే ఎక్కువగా ప్రస్తావించారు.
వ్యాక్సిన్ కొరత ఉన్న రాష్ట్రాలు
మహారాష్ట్ర, న్యూఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, బిహార్, ఒడిశా, జార్ఖండ్
అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌లు
సీరమ్ ఇనిస్టిట్యూట్ తయారు చేస్తున్న కోవిషీల్డ్, భారత్ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్
నెలకి ఉత్పత్తయ్యే డోసుల సంఖ్య
7కోట్లు
ప్రస్తుతం రోజూ ఇస్తున్న డోసులు
34 లక్షలుపైగా
ఇప్పటివరకు ఇచ్చిన టీకా డోసులు
9.80కోట్లు
Comments
Please login to add a commentAdd a comment