సాక్షి, న్యూఢిల్లీ: దేశ పౌరులకు అందజేస్తున్న కోవిషీల్డ్ కోవిడ్ టీకా రెండు డోస్‌ల మధ్య కాల వ్యవధిని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం గురువారం నిర్ణయం తీసుకుంది. రెండో డోసు తీసుకోవడానికి ప్రస్తుతం 6–8 వారాలున్న వ్యవధిని ఇకపై 12–16 వారాలకు పెంచాలని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (ఎన్‌టీఏజీఐ) చేసిన సిఫారసుకు కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపింది.
రెండు టీకాల మధ్య కాల పరిమితిని పెంచితే మరింతగా ప్రయోజనాలు ఉన్నట్లు బ్రిటన్ అధ్యయనంలో వెల్లడైన నేపథ్యంలో ఎన్‌టీఏజీఐ కొత్తగా ఈ సిఫార్సు చేసింది. మొదటి టీకా తీసుకున్నాక ఆరు వారాలలోపు రెండో టీకా తీసుకుంటే వారిలో వ్యాక్సిన్ సామర్థ్యం 55.1 శాతం ఉండగా, రెండో డోస్‌కు 12 వారాలకంటే ఆలస్యంగా తీసుకుంటే టీకా సామర్థ్యం ఏకంగా 81.3 శాతానికి పెరిగినట్లు బ్రిటన్ అధ్యయనంలో తేలింది.
మరోవైపు, భారత్ బయోటెక్ తయారుచేస్తున్న కోవాగ్జిన్ కోవిడ్ రెండు టీకాల మధ్య వ్యవధిలో ఎలాంటి మార్పు లేదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. తమ వద్ద కోవిడ్ టీకాల కొరత చాలా ఎక్కువగా ఉందని చాలా రాష్ట్రాలు కేంద్రప్రభుత్వానికి విన్నవించుకున్నవేళ కోవిషీల్డ్ టీకా డోస్‌ల మధ్య అంతరాన్ని పెంచడం చర్చనీయాంశమైంది. డిమాండ్‌కు తగ్గట్లు సరఫరా లేకపోవడంతో టీకా డోస్‌ల కొనుగోలు కోసం గ్లోబల్ టెండర్లు పిలవాలని ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించడం తెల్సిందే.
కోవిషీల్డ్ టీకాల డోస్‌ల మధ్య వ్యవధిని పెంచడం ఇది రెండోసారి. 28 రోజుల వ్యవధిని 6–8 వారాలుగా మారుస్తూ మార్చి నెలలో నిర్ణయించారు. ఎన్‌టీఏజీఐ చేసిన సిఫార్సులను నీతి ఆయోగ్ సభ్యుడైన డాక్టర్ వీకే పాల్ నేతృత్వంలోని నేషనల్ ఎక్స్‌పర్ట్ గ్రూప్ ఆన్ వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ కోవిడ్–19(ఎన్‌ఈజీవీఏసీ) అంగీకరించిందని ఆరోగ్య శాఖ పేర్కొంది. కోవిషీల్డ్ డోసుల మధ్య కాలవ్యవధిని 12 వారా లు మించి పెంచితే మంచిదేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం పేర్కొందని, ఇదే విధానాన్ని చాలా దేశాలు అనుసరిస్తున్నాయని వీకే పాల్ చెప్పారు.
ఎన్‌టీఏజీఐ చేసిన సిఫార్సులు ఇవీ..
► కోవిషీల్డ్ కోవిడ్ రెండు డోసుల మధ్య కాల వ్యవధిని 12–16 వారాలకు పెంచుకోవచ్చు
► కోవిషీల్డ్, కోవాగ్జిన్ కోవిడ్ టీకాల్లో గర్భిణులు తమకు నచ్చిన టీకాలను ఎంచుకోవచ్చు
► కోవాగ్జిన్ రెండు టీకాల మధ్య కాల పరిమితిలో ఎలాంటి మార్పు లేదు
► నిర్ధారణ పరీక్షలో కరోనా పాజిటివ్‌గా తేలిన వ్యక్తులు పూర్తిగా కోలుకున్నాక ఆరు నెలల తర్వాతే టీకాను తీసుకోవాలి
► కోవిడ్ టీకా తీసుకునేముందు లబ్దిదారులకు ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ చేయాలన్న ప్రతిపాదనను ఎన్‌టీఏజీఐ తిరస్కరించింది
► గర్భిణులకు తరచుగా జరిగే డాక్టర్ చెకప్‌ల సమయంలో కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలు తీసుకుంటే కలిగే ప్రయోజనాలతోపాటు సైడ్ ఎఫెక్ట్‌లపైనా వారికి అవగాహన కలిగించాలి
► టీకా తీసుకుంటే అత్యంత అరుదుగా రక్తం గడ్డ కట్టడం, బ్లడ్ ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గిపోవడం వంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చనే వివరాలతో కూడిన అవగాహనను గర్భిణులకు కల్పించాలి
► ప్రసవించాక పాలిచ్చే తల్లులు ఎప్పుడైనా సరే టీకా తీసుకోవచ్చు
► టీకా మొదటి డోస్ తీసుకున్నాక పరీక్షలో పాజిటివ్‌గా తేలితే పూర్తిగా కోలుకున్నాక 4–8 వారాల తర్వాతే రెండో డోస్ తీసుకోవాలి
► బయటి వ్యక్తుల నుంచి యాంటీ బాడీలు, ప్లాస్మాను పొందాక కోవిడ్ నుంచి కోలుకున్న రోగులు.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తేదీ నుంచి మూడు నెలల వరకు కోవిడ్ టీకాను తీసుకోకూడదు.
► మొదటి డోస్ తీసుకున్నాక అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స అవసరమైన వారు, ఐసీయూ చికిత్స అవసరమైన వారు కనీసం 4–8 వారాలు ఆగిన తర్వాతే రెండో డోస్ టీకా తీసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment