న్యూఢిల్లీ: త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ఇచ్చే కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌లో ప్రధాని మోదీ ఫొటోను ప్రచురించవద్దంటూ కేంద్ర ఎన్నికల కమిషన్ కేంద్రాన్ని శనివారం కోరింది. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ప్రధాని మోదీ ఫొటోను ప్రచురించడం ద్వారా ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారంటూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓ బ్రెయిన్ ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు. ఈ లేఖ అనంతరం ఈసీ కేంద్రానికి ఈ మేరకు సూచనలు చేసింది.
త్వరలో పశ్చిమబెంగాల్, అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే కేంద్రానికి ఈసీ రాసిన లేఖలో ఎవరి పేరును పెట్టలేదని, కేవలం ప్రధాని ఫొటోలు కనిపించకుండా ఫిల్టర్లు మాత్రమే వాడాలంటూ కేంద్ర ఆరోగ్య శాఖకు సూచించిందని వార్తాసంస్థ పీటీఐ తెలిపింది. మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలకు రావాల్సిన క్రెడిట్‌ను ప్రధాని తన వైపు మళ్లించుకుంటూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని విమర్శించింది.
Comments
Please login to add a commentAdd a comment