కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రైవేటు ఆస్పత్రులకు వేర్వేరుగా టీకా ధరలు ఉంటాయని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఐ) చేసిన ప్రకటన అనేక ప్రశ్నలకు తావిచ్చింది. మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ టీకాలు అందుబాటులోకి వస్తాయని చెప్పడం కొంతలో కొంత శుభ వార్తే అయినా ఇన్నాళ్లూ కేంద్ర ప్రభుత్వం వద్ద ఒక్కో డోసుకు రూ.150 తీసుకుంటున్న ఎస్‌ఐఐ.. ఇకపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.400, ప్రైవేటు ఆసుపత్రులకు రూ.600 చొప్పున తీసుకుంటామని ప్రకటించింది. తన టీకా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతామని, మొత్తం డోసుల్లో సగం కేంద్రానికి ఇచ్చి, మిగిలినవి రాష్ట్రాలకు, ప్రైవేటు ఆసుపత్రులకు ఇస్తామని చెబుతోంది. కేంద్ర ప్రభుత్వం ఎప్పటిలాగే ప్రభుత్వాసుపత్రులకు సరఫరా చేయడంతో పాటు కొంత మొత్తం టీకాలను రాష్ట్రాలకూ ఇస్తుంది. కానీ రాష్ట్రాలకు ఇంకా అదనపు కోటా కావాలంటే అవి సొంతంగా ఎస్‌ఐఐ నుంచి కొనుక్కోవాలి. అయితే.. తాము ఎస్‌ఐఐ నుంచి కొనుగోలు చేసిన టీకాలను రాష్ట్రాలకు ఉచితంగానే ఇస్తామని కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. కేంద్రం నుంచి వస్తున్న టీకాలు అరకొరగానే ఉంటున్న పరిస్థితుల్లో రాష్ట్రాలు సొంతంగా కూడా కొనుక్కునే వెసులుబాటు ఉన్నా.. దాని ధర విషయమే కాస్త పంటికింద రాయిలా తగులుతోంది.
నిజానికి సరఫరాకు, ధరలకు మధ్య ఉండే సంబంధంలో సాధారణ ఆర్థిక సూత్రాల ప్రకారం సరఫరా పెరిగితే ధర తగ్గాలి. చిన్న మొత్తంలో ఉత్పత్తి చేయడం కంటే పెద్దమొత్తంలో చేస్తే ఉత్పత్తి వ్యయం కూడా కలిసొస్తుంది. అలాంటప్పుడు ధర ఎందుకు పెంచుతున్నట్లు? అసలు ఈ ధరలకు ప్రాతిపదిక ఏంటి? అమెరికా, యూకే, ఈయూలలో ఆక్స్‌ఫర్డ్/ఆస్ట్రాజెనెకా టీకాను ఒక్కో డోసు 2-4 డాలర్ల మధ్య అమ్ముతున్నారు. ఎస్‌ఐఐ తయారుచేసే టీకా కూడా అదే. మొదటి 40, 50 కోట్ల డోసుల్లో లాభం చూసుకోబోమని ఆస్ట్రాజెనెకా చెప్పింది కూడా. ప్రాంతాన్ని బట్టి, ఉత్పత్తిని బట్టి ధర మారుతుందనే 2-4 డాలర్లు అన్నారనుకోవాలి. ఎస్‌ఐఐ మొత్తం 91 పేద దేశాలకు టీకా ఇవ్వాలని ఆస్ట్రాజెనెకా లైసెన్సులో పేర్కొంది. భారత్ లాంటి దేశాల్లో ఉత్పత్తి వ్యయం తక్కువ అవుతుందని, ఎస్‌ఐఐ ప్రపం చంలోనే అతిపెద్ద టీకా ఉత్పత్తిదారని లైసెన్సు ఇచ్చింది. అలాం టప్పుడు ఆస్ట్రాజెనెకాకు అయ్యే వ్యయం కంటే ఎస్‌ఐఐకి ఎక్కువ అవుతుందని ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పలేం.
కేంద్ర ప్రభుత్వానికి ఇన్నాళ్లూ ఇచ్చిన టీకాల వల్ల తనకు నష్టమేమీ రాలేదని.. అయితే లాభాలు పెద్దగా లేకపోవడంతో పెద్దమొత్తంలో పెట్టుబడి పెట్టడం వీలు కావట్లేదని ఓ ఇంటర్వ్యూలో ఎస్‌ఐఐ సీఈఓ అదర్ పూనావాలా చెప్పారు. తనకు రూ.3 వేల కోట్ల గ్రాంటు కావాలని ఆయన అడిగారు. కానీ, ప్రభుత్వం భవిష్యత్తులో ఇవ్వబోయే టీకాలకు అడ్వాన్సుగా మాత్రమే ఇస్తామని చెప్పింది. అందుకే ఒక్కసారిగా టీకా ధర రూ.150 నుంచి రూ.400కు పెరిగింది.
డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) కోవిషీల్డ్ అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చినా.. ప్రభుత్వానికే అమ్మాలని చెప్పింది. ప్రైవేటు ఆసుపత్రులకు అమ్మాలంటే అందుకు వేరే అనుమతులు తీసుకోవాలి. వ్యాపారం ఎవరైనా లాభాలకోసమే చేస్తారు. అదర్ పూనావాలా కష్టపడుతున్నారన్న విషయంలో అనుమానం లేదు. కానీ, ఉత్పాదక సామర్థ్యం పెంచితే ధర రెట్టింపు కంటే ఎక్కువ ఎందుకు అయ్యిందన్నదే అసలు ప్రశ్న.
మరోవైపు అసలు కేంద్ర ప్రభుత్వం ఈ టీకా ధర విష యంలో ఇంతవరకు ఎందుకు స్పందించలేదో అర్థం కాదు. ప్రపంచంలో చాలా దేశాల్లో ప్రభుత్వాలే టీకా నేరుగా కొని, ప్రజలకు ఉచితంగా ఇస్తున్నాయి. 136 కోట్లకు పైగా జనాభా ఉన్న భారతదేశం ధనికదేశమేమీ కాదు. అయినా ధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. దేశ జనాభాలో 18 ఏళ్లు దాటినవారి సంఖ్య సుమారు 91 కోట్లు. వాళ్లలో ప్రతి ఒక్కరికీ రెండు డోసులు ఇచ్చినా 182 కోట్ల డోసుల్లో ఒక్కోదానికి రూ.200 వెచ్చించారనుకున్నా దానికి రూ.36,400 కోట్లు అవుతుంది. టీకాల కోసం రూ.35 వేల కోట్లు కేటాయిస్తున్నామని, అవసరమైతే ఇంకా ఇస్తామని బడ్జెట్‌లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఎస్‌ఐఐ ఒక్కో డోసుకు రూ.200 చొప్పున ఇస్తే ఆ బడ్జెట్ దాదాపుగా సరిపోతుంది. అప్పుడు అదర్ పూనావాలాకూ కొంత లాభం పెరుగుతుంది. కానీ రూ. 150కి కొన్నటీకాపై అదనంగా వెచ్చించి కోవిషీల్డ్ టీకాలను కేంద్రం ఎందుకు కొనాలనుకుం టోందో ఆ బ్రహ్మదేవుడికే ఎరుక!
ప్రసేన్ జిత్ దత్తా
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు
(ది ప్రొజాయిక్ వ్యూ సౌజన్యంతో)
ఉత్పత్తి పెరిగితే... ధరలు దిగిరావా?
Published Sun, Apr 25 2021 1:14 AM | Last Updated on Sun, Apr 25 2021 4:01 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment