సాక్షి, అమరావతి: కోవిడ్–19 మహమ్మారి కట్టడి చర్యల్లో భాగంగా ఈ ఏడాది వ్యాక్సిన్ల కోసం మన దేశం అక్షరాలా రూ.75 వేల కోట్లను వ్యయం చేయనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థలు అన్నీ కలిపి 2021లో ఈ మొత్తాన్ని వెచ్చించనున్నాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం వ్యాక్సిన్లకు ఎంత వ్యయం అవుతుందనే విషయాన్ని ప్రముఖ అంతర్జాతీయ బ్యాంకింగ్, వెల్త్ మేనేజ్‌మెంట్ సంస్థ ఇన్వెస్టెక్ సెక్యూరిటీస్ అంచనా వేసింది. దేశంలో ప్రస్తుతం కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్–వీ వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. త్వరలో మరో ఐదు వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయని, జూలై నుంచి దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పుంజుకుంటుందని తన నివేదికలో పేర్కొంది. ఇండియాలో ప్రతిరోజు 70 లక్షల నుంచి 80 లక్షల డోసులు వేసే సామర్థ్యం ఉన్నప్పటికీ వ్యాక్సిన్ల సరఫరా లేదు. సామర్థ్యంలో 30 శాతం మాత్రమే సరఫరా అవుతున్నట్టు పేర్కొంది.
అక్టోబర్ నాటికి పూర్తి స్థాయికి..
దేశంలో 18 ఏళ్ల వయసు దాటిన వారందరికీ టీకా వేయించాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకోవడం అంత సులభంకాదని ఇన్వెస్టెక్ తేల్చిచెప్పింది. జూలై నుంచి దేశంలోకి కొత్తగా క్యాడిలా హెల్త్‌కేర్ అభివృద్ధి చేస్తున్న జెడ్‌వైకోవీడీ, నోవాక్స్, స్పుత్నిక్ వీ సింగిల్ డోస్ వ్యాక్సిన్, జాన్సన్ అండ్ జాన్సన్ (జే అండ్ జే) వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయి. జూలై నుంచి దేశంలో వ్యాక్సిన్ల సరఫరా పెరిగి అక్టోబర్ నాటికి పూర్తి స్థాయికి చేరుకుంటుందని ఇన్వెస్టెక్ అంచనా వేసింది. అక్టోబర్ నాటికి వ్యాక్సిన్ సరఫరా పెరిగినా కేవలం 124 కోట్ల డోసులు మాత్రమే అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. ఈ ప్రకారం చూస్తే 18 ఏళ్లు నిండిన జనాభాలో 74 శాతం మందికి వ్యాక్సిన్ వేసే అవకాశం ఉంటుందని అంచనా వేసింది. ఇది కూడా వ్యాక్సిన్ సరఫరా, కేంద్ర అనుమతులపై ఆధారపడి ఉంటుంది.
వ్యాక్సిన్ సంస్థలకు లాభాలే లాభాలు
2021లో వ్యాక్సిన్ తయారీ సంస్థలకు లాభాల పంట పండనుందని ఇన్వెస్టెక్ సెక్యూరిటీస్ అంచనా వేసింది, మొత్తం వ్యాక్సిన్ తయారీ సంస్థలకు ఈ ఏడాది లాభాల రూపంలో రూ.15 వేల కోట్లు రానున్నాయని అంచనా వేసింది. ఇందులో అత్యధికంగా తొలుత ఉత్పత్తి ప్రారంభించిన సంస్థలు సీరం, భారత్ బయోటెక్‌లకు తీసుకోనుండగా.. ఆ తర్వాత స్థానాల్లో డాక్టర్ రెడ్డీస్ (స్పుత్నిక్–వీ), క్యాడిలా సంస్థలు లబ్ధి పొందుతాయని పేర్కొంది. ఫైజర్, జే అండ్ జే, బయలాజికల్–ఈ వంటి సంస్థలు ఈ రేసులో ఆలస్యంగా చేరుతుండటంతో ప్రారంభ లాభాలను పొందే అవకాశాన్ని పోగొట్టుకుంటున్నాయి.
వ్యాక్సిన్ల వ్యయం రూ.75 వేల కోట్లు!
Published Tue, May 18 2021 4:15 AM | Last Updated on Tue, May 18 2021 11:01 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment