కరోనా వ్యాక్సిన్‌: పరిమిత జాప్యం పర్వాలేదు!   | Corona Vaccine Delayed Second Dose | Sakshi
Sakshi News home page

కరోనా వ్యాక్సిన్‌: పరిమిత జాప్యం పర్వాలేదు!  

Published Thu, May 13 2021 3:17 AM | Last Updated on Thu, May 13 2021 3:41 AM

Corona Vaccine Delayed Second Dose - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  ‘కరోనా వ్యాక్సిన్‌ తొలి డోసు తీసుకున్నాక రెండో డోసు తీసుకోవడం ఆలస్యమైతే వృథా అవుతుందా? నిర్దిష్ట గడువు దాటాక రెండో డోసు తీసుకుంటే సరైన ఫలితం ఉంటుందా? రెండో డోసు తీసుకున్నాకే శరీరానికి వైరస్‌ నుంచి రక్షణ అందుతుందా?’.. దేశంలో వ్యాక్సిన్ల కొరత, టీకాల కార్యక్రమం ఆలస్యం అవుతున్న నేపథ్యంలో తలెత్తుతున్న ప్రశ్నలివి. టీకాల కొరత కారణంగా రెండో డోసు తీసుకోవాల్సిన వారికి.. ముందుగా చెప్పిన సమయం కంటే ఎక్కువ ఆలస్యమవుతోంది. అయితే పరిమిత ఆలస్యం వల్ల నష్టమేమీ లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చెప్తోంది. వివిధ దేశాల్లో పంపిణీ చేస్తున్న కోవిడ్‌ వ్యాక్సిన్లకు సంబంధించి ఇటీవల విడుదల చేసిన నివేదికలో.. మన దేశంలో వినియోగిస్తున్న కోవాగ్జిన్, కోవిషీల్డ్‌ వ్యాక్సిన్లకు సంబంధించిన అంశాలను ప్రస్తావించింది. 

కోవిషీల్డ్‌కు మూడు నెలల దాకా.. 
రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌లో భాగంగా కోవాగ్జిన్, కోవిషీల్డ్‌ టీకాలు ఇస్తున్నారు. వ్యాక్సిన్ల లభ్యత ఆధారంగా ఈ ఏడాది జనవరి 16 నుంచి పంపిణీ ప్రక్రియ మొదలైంది. రెండు టీకాలు కూడా నిర్ణీత విరామంతో రెండు డోసులుగా వేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ తొలి డోసు తీసుకున్నాక.. 6–8 వారాల విరామంతో రెండో డోసు తీసుకోవాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సూచించింది. అయితే డబ్ల్యూహెచ్‌వో మాత్రం 6 నుంచి 12వారాల విరామం ఉన్నా నష్టం లేదని వెల్లడించింది. కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో కూడా వినియోగిస్తున్నారు. ఈ క్రమంలోనే కోవిషీల్డ్‌ తొలి డోసు తీసుకున్నాక మూడు నెలల విరామం వరకు రెండో డోసు వేసుకోవచ్చని డబ్ల్యూహెచ్‌వో వివరించింది. అదే విధంగా కోవాగ్జిన్‌ టీకా తొలిడోసు తీసుకున్నాక 4 నుంచి 6 వారాల విరామంతో తీసుకోవచ్చని సూచించింది. 

తొలి డోసు నుంచే రక్షణ మొదలు 
కోవిడ్‌ వ్యాక్సిన్లు తొలి డోసు తీసుకున్న రెండువారాల తర్వాత శరీరానికి రక్షణ మొదలవుతుంది. శరీరంలో యాంటీబాడీల వృద్ధి రెండు వారాల తర్వాత ప్రారంభమవడమే దీనికి కారణం. ఇక తొలి డోసు తీసుకున్న నాలుగు వారాల నుంచి యాంటీబాడీలు వైరస్‌ నుంచి ప్రొటెక్షన్‌ ఇచ్చే స్థాయికి ఎదగడం మొదలవుతుంది. రెండో డోసు తీసుకున్నాక యాంటీబాడీలకు డబుల్‌ బూస్టింగ్‌ వస్తుంది. వైరస్‌ నుంచి రెట్టింపు రక్షణ ఏర్పడుతుందని డబ్ల్యూహెచ్‌వో తమ నివేదికలో పేర్కొంది. కొన్ని సందర్భాల్లో శరీర స్థితి ఆధారంగా యాంటీ బాడీల పెరుగుదల ఉంటుందని వివరించింది. ఇక ఆలస్యంగా రెండో డోసు తీసుకుంటే ఫలితం ఉండదనేది అవాస్తవమని డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది. రెండో డోసుకు నిర్దేశించిన గడువు నాలుగైదురోజులు అటూ ఇటూ అయినా తప్పకుండా వ్యాక్సిన్‌ తీసుకోవాలని సూచిస్తోంది. 

2–4 వారాల మధ్యే యాంటీబాడీల వృద్ధి 
‘వ్యాక్సిన్‌ వేసుకున్నాక రెండు నుంచి నాలుగు వారాల మధ్య యాంటీబాడీల వృద్ధి ప్రారంభమవుతుంది. వాటి సంఖ్య, సామర్థ్యం మరింతగా పెంచేందుకు రెండో డోసు వేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం వ్యాక్సిన్ల కొరతతో రెండో డోసు తీసుకోవడంలో కాస్త ఆలస్యం అవుతోంది. దేశంలో ప్రస్తుతం ఇస్తున్న రెండు రకాల వ్యాక్సిన్ల రెండో డోసుకు ఐసీఎంఆర్‌ వేర్వేరు గడువును విధించింది. నిర్దేశించిన గడువుకు కాస్త అటుఇటైనా వ్యాక్సిన్‌ పనితీరు బాగానే ఉంటుంది. అయితే ఈ అంశంపై ఇంకా విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి’. 
– డాక్టర్‌ పి.విజయ నరసింహారెడ్డి, అసిస్టెంట్‌ ప్రొఫెసర్, జనరల్‌ మెడిసిన్‌ డిపార్ట్‌మెంట్, జీజీహెచ్, కడప

రెండో డోసు తప్పనిసరి 
‘కోవిడ్‌–19 వ్యాక్సిన్లన్నీ రెండు డోసులు ఇస్తున్నారు. మన దగ్గర కూడా రెండో డోసు వేసుకోవాలని ఐసీఎంఆర్‌ స్పష్టం చేసింది. అయితే నిర్ధిష్ట కాల పరిమితి విధించి ఆలోపు రెండో డోసు తీసుకోవాలని సూచిస్తున్నప్పటికీ.. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ఆలస్యం కాక తప్పేలా లేదు. అయినప్పటికీ రెండో డోసు వేసుకుంటే యాంటీబాడీలకు బూస్టింగ్‌ వస్తుంది. అందువల్ల రెండో డోసు పట్ల నిర్లక్ష్యం చూపకుండా వేసుకోవాలి’. 
– డాక్టర్‌ కిరణ్‌ మాదల, అసోసియేట్‌ ప్రొఫెసర్, ప్రభుత్వ వైద్య కళాశాల, నిజామాబాద్‌   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement