
న్యూఢిల్లీ: ఒకవైపు దేశం తీవ్ర వ్యాక్సిన్ కొరతను ఎదుర్కొంటుండగా... మరోవైపు 50 లక్షల కోవిషీల్డ్ డోసులను బ్రిటన్‌కు ఎగుమతి చేయడానికి తయారీ సంస్థ సీరమ్ ఇన్‌స్టిట్యూట్ (సీఐఐ) అనుమతి కోరింది. అయితే కేంద్ర ప్రభుత్వం దీన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. దేశంలో తయారయ్యే వ్యాక్సిన్లను మొదట భారత అవసరాలను తీర్చడానికి సరఫరా చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. ఈ 50 లక్షల కోవిషీల్డ్ డోసులను 18–44 ఏళ్ల వయసుల వారికి వ్యాక్సినేషన్ కోసం రాష్ట్రాలకు అందుబాటులో ఉంచుతామని కేంద్ర ప్రభుత్వవర్గాలు తెలిపాయి.
‘ఈ 50 లక్షల డోసులు రాష్ట్రాలకే ఇస్తాం. వీటిని కొనాల్సిందిగా రాష్ట్రాలను కోరాం. ప్రైవేటు ఆసుపత్రులు కూడా వీటిని తీసుకోవచ్చు’ అని సీనియర్ అధికారి ఒకరు వివరించారు. వ్యాక్సిన్ మైత్రిలో భాగంగా దాదాపు 95 దేశాలకు భారత్ లక్షలాది వ్యాక్సిన్ డోసులను అందించింది. దేశంలో కరోనా కరాళనృత్యం చేస్తుంటే... విదేశాలకు వ్యాక్సిన్ ఎగుమతిని ఎలా అనుమతిస్తారంటూ కాంగ్రెస్ సహా పలు విపక్షపార్టీలు ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శల దాడికి దిగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీరమ్ తాజా అభ్యర్థనను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment