సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం మే 1 నుంచి 18-45 లోపు వయసు వారికి వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. మూడో దశ వ్యాక్సినేషన్ ప్రారంభం కావడానికి మరో 24 గంటల వ్యవధి కూడా లేదు. ఈ క్రమంలో పలు రాష్ట్రాలు రేపటి నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇవ్వలేమని స్పష్టం చేశాయి. వ్యాక్సిన్‌ల కొరత తీవ్రంగా ఉందని.. ఈ నేపథ్యంలో తాము రేపటి నుంచి వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభిచలేమని పలు రాష్ట్రాలు కేంద్రానికి తెలిపాయి.
వ్యాక్సిన్ కోసం శుక్రవారం ఉదయం నాటికే 2.45 కోట్ల మంది కోవిన్ ప్లాట్‌ఫామ్‌లో రిజిస్టర్ చేసుకున్నారు. బుధవారం నాడు వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా.. మూడు రోజుల వ్యవధిలోనే ఇంత మంది రిజిస్టర్ చేసుకోవడం గమనార్హం. ఇక వ్యాక్సిన్‌లు సరఫరా చేస్తున్న సీరం ఇన్‌స్టిట్యూట్ నెలకు 6-7 కోట్ల టీకాలను ఉత్పత్తి చేసే సామార్థ్యం కలిగి ఉండగా.. భారత్ బయోటెక్ నెలకు సుమారు రెండు కోట్ల డోసులను ఉత్పత్తి చేస్తుంది. ఇక రేపటి నుంచి వ్యాక్సిన్ ప్రక్రియ చేపట్టలేమని తెలిపిన రాష్ట్రాలు..
తెలంగాణ..
‘‘రాష్ట్రాలకు ఉచితంగా వ్యాక్సిన్లు సరఫరా చేసే బాధ్యత కేంద్రానిదే. మేం భారత్ బయోటెక్, సీరం కంపెనీలతో టచ్‌లో ఉన్నాం. కానీ వారి నుంచి సరైన స్పందన లేదు. మేం రోజుకు పది లక్షల మందికి వ్యాక్సిన్ వేయగలం. మాకు 4 కోట్ల డోసుల వ్యాక్సిన్‌లు కావాలి. కంపెనీలతో మాట్లాడుతున్నాం. రేపటి నుంచి 18-44 ఏళ్ల వారికి వ్యాక్సిన్ ఇవ్వలేం’’ అని ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు.
మహారాష్ట్ర..
మహారాష్ట్రలో కోవిడ్ ఉధృతి తీవ్రంగా ఉంది. దేశంలో అత్యధికంగా ఇక్కడే కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోప్ మాట్లాడుతూ.. ‘‘మాకు అత్యవసరంగా 20-30 లక్షల వ్యాక్సిన్ వయల్స్ కావాలి. 18-45 ఏళ్ల లోపు వారికి వ్యాక్సిన్ ఇవ్వాలంటే 12 కోట్ల డోసుల టీకాలు కావాలి. అంత మొత్తంలో మా దగ్గర వ్యాక్సిన్‌లు లేవు. ప్రస్తుతం మేం కోవిడ్ థర్డ్ వేవ్‌కు సిద్ధమవుతున్నాం. ఇప్పటికే వ్యాక్సిన్ల కొరత వల్ల ఇప్పటికే ముంబైలో టీకాలు వేయడం ఆపేశాం. ఇక రేపటి నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభించలేం’’ అని తెలిపారు.
కర్ణాటక..
కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కే సుధాకర్ మాట్లాడుతూ.. ‘‘రేపటి నుంచి మా దగ్గర మూడో దశ వ్యాక్సినేషన్‌ని ప్రారంభించలేం. ఇప్పటికే కోటి డోసులకు ఆర్డర్ చేశాం. కానీ వారు రేపటి వరకు డోసులను డెలివరీ చేయలేమన్నారు. ఈ నేపథ్యంలో 18-44 ఏళ్ల వారు వ్యాక్సిన్ కోసం రేపు ఆస్పత్రులకు వచ్చి ఇబ్బంది పడవద్దని కోరుతున్నాం’’ అన్నారు.
ఢిల్లీ..
మూడో దశ వ్యాక్సినేషన్ ప్రారంభించేందుకు తమ దగ్గర సరిపడా వ్యాక్సిన్‌లు లేవని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. 18-44 ఏళ్ల వారు మే 1న వ్యాక్సిన్ కోసం ఆస్పత్రుల వద్దకు రావద్దని.. వ్యాక్సినేషన్ గురించి రెండు మూడు రోజుల్లో తామే చెప్తామని వెల్లడించారు. ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే 67 లక్షల డోసుల కోవిషీల్డ్ వ్యాక్సిన్‌లను ఆర్డర్ చేసింది. మే 3 నాటికి మూడు లక్షల డోసుల డెలివరీ చేస్తామని కంపెనీ అధికారులు తమకు తెలిపారని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది.
గోవా..
గోవా సీఎం ప్రమోద్ సావంత్ వ్యాక్సిన్ డోసులు ఎప్పుడు అందుబాటులోకి వస్తే.. అప్పుడే 18-44 ఏళ్ల వారికి టీకా వేస్తామని ప్రకటించారు. ఇప్పటికే ఐదు లక్షల డోసులు డెలివరీ చేయాల్సిందిగా సీరం కంపెనీకి ఆర్డర్ ఇచ్చామని తెలిపారు.
మధ్యప్రదేశ్..
కంపెనీలు తాము ఆర్డర్ చేసిన వ్యాక్సిన్ డోసులను ఇంకా డెలివరీ చేయలేదని.. ఈ నేపథ్యంలో తాము రేపటి నుంచి మూడో దశ వ్యాక్సిన్ ప్రారంభించలేమని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు.
పశ్చిమబెంగాల్..
18-44 ఏళ్ల వయసు వారికి వ్యాక్సిన్ వేయాలంటే కేంద్రం తమకు 3 కోట్ల డోసుల వ్యాక్సిన్‌లు సరఫరా చేయాలని.. అప్పుడు మాత్రమే తాము వ్యాక్సినేషన్ ప్రారంభిచగలమని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. ఇవే కాక జార్ఖండ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలు తాము మే 1 నుంచి 18-44 ఏళ్ల వారికి వ్యాక్సిన్ ఇవ్వలేమని తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment