బారిపదా: కరోనా టీకా తీసుకున్న వ్యక్తికి కేవలం 30 నిమిషాల వ్యవధిలోనే మరో డోస్ టీకాను ఇచ్చిన ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. తనకు ఇప్పుడే టీకా ఇచ్చారని ఆ వ్యక్తి చెబుతున్నా వినకుండా సెకన్ల వ్యవధిలో రెండో డోస్ ఇచ్చేశారని అతను ఆందోళన వ్యక్తంచేశాడు. తప్పు తెల్సుకున్న వైద్య సిబ్బంది అతడిని అదనంగా మరో రెండు గంటలపాటు పర్యవేక్షణలో ఉంచారు. ఆయనకు ఒకే తయారీ సంస్థకు చెందిన టీకాలు ఇచ్చారా లేదా వేర్వేరువా అనేది తెలియరాలేదు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యపరిస్థితి సాధారణంగా ఉందని వైద్యులు చెప్పారు.
ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలోని రఘుపూర్ గ్రామానికి చెందిన 51 ఏళ్ల ప్రసన్నకుమార్ సాహూ.. ఖుంతాపూర్‌లోని సత్య సాయి ప్రభుత్వ పాఠశాలలో కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం వెళ్లారు. మొదట ఆయనకు ఒక డోస్ ఇచ్చారు. దాదాపు 30 నిమిషాలు గడిచాక ఒక నర్సు వచ్చి ఆయనకు మరో డోస్ టీకా ఇచ్చింది. ‘నాకు టీకా ఇప్పుడే ఇచ్చారు అని ఆ నర్సుకు చెబు తూనే ఉన్నా. అంతలోనే ఆమె మళ్లీ టీకా వేసింది’ అని సాహూ చెప్పుకొచ్చారు. డబుల్ డోస్ ఘటన పై టీకా కేంద్రం అధికారిక అబ్జర్వర్ రాజేంద్ర బెహెరా వివరణ ఇచ్చారు. ‘ టీకా ఇచ్చాక కూడా సాహూ అబ్జర్వేషన్ రూమ్‌కి వెళ్లకుండా ‘టీకా తీసుకోబోయేవారి ప్రాంతం’లోనే ఉన్నారు. దీంతో ఈ పొరపాటు జరిగింది’ అని రాజేంద్ర బెహెరా స్పష్టంచేశారు. మొత్తం ఘటనపై దర్యాప్తు పూర్తయ్యాకే రెండో డోస్ ఇచ్చిన నర్సుపై చర్యలు తీసుకోవాలా వద్దా అనేది నిర్ణయిస్తామని ఇన్‌చార్జ్ డాక్టర్ సిపున్ పాండే చెప్పారు.
5 నిమిషాల తేడాతో కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలు
ఒకే మహిళకు ఐదు నిమిషాల తేడాతో రెండు వేర్వేరు కంపెనీలకు చెందిన కరోనా టీకాలు ఇచ్చిన ఘటన బిహార్‌లో జరిగింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యస్థితి బాగానే ఉంది. పట్నా నగరంలోని బెల్దారిచాక్ ప్రాంతంలో ఉండే సునీలా దేవి అనే మహిళ ఈనెల 16న కరోనా టీకా కోసం ముందే రిజిస్ట్రేషన్ చేసుకున్న పాఠశాలలోని టీకా కేంద్రానికి వెళ్లింది. అక్కడి నర్సు ముందుగా కోవిషీల్డ్ టీకా ఇచ్చింది. సిబ్బంది సూచనమేరకు ఆమె తర్వాత ఆబ్జర్వేషన్ రూమ్‌కి వెళ్లింది. కేవలం ఐదు నిమిషాలు గడిచాక అక్కడికి మరో నర్సు వచ్చి కోవాగ్జిన్ టీకా ఇచ్చింది. ఈ ఘటనపై బిహార్ ఆరోగ్య శాఖ దర్యాప్తునకు ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment