Differences In Vaccine Supply And Vaccination Figures - Sakshi
Sakshi News home page

వ్యాక్సిన్‌-వ్యాక్సినేషన్‌.. లెక్కల్లో తేడా!

Published Mon, May 24 2021 1:44 PM | Last Updated on Mon, May 24 2021 6:23 PM

Differences In Vaccine Supply And Vaccination Figures - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఇండియాలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ సజావుగా సాగడం లేదా? కేం‍ద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న లెక్కలకు, వాస్తవిక పరిస్థితులకు పొంతన లేకుండా పోతోందా? సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, భారత్‌ బయోటెక్‌లు కలిపి నెలకు ఎనిమిది కోట్ల వ్యాక్సిన్‌ డోసులు ఉత్పత్తి చేయనున్నట్లు ప్రకటించాయి. కానీ, మే చివరి నాటికి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కోసం అందే డోసుల లెక్క 5 కోట్లకే తేలుతోంది. మరి మిగతా మూడు కోట్ల డోసుల సంగతేంటి? 

ఓవైపు ప్రభుత్వం, మరోవైపు వ్యాక్సిన్‌ తయారీ కంపెనీలు రోజూ సగటున 27 లక్షల డోసుల్ని ఉత్పత్తి చేస్తున్నట్లు ప్రకటించాయి. అదీ రష్యన్‌ స్పుత్నిక్‌ను పరిగణనలోకి తీసుకోకుండానే. అయితే మే మొదటి మూడు వారాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కోసం రోజు సగటున 16.2 లక్షల డోసులు మాత్రమే డెలివరీ చేశాయి. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కోసం సుమారు 3.4 కోట్ల డోసులు మాత్రమే ఉపయోగించారు. 

లెక్కల్లో.. 
నెలకు ఆరు నుంచి ఏడు కోట్ల కోవిషీల్డ్‌ డోసులను ఉత్పత్తి చేయగలమని సీరమ్‌ ఇండియా పదే పదే ప్రకటించుకుంటోంది. ఇక భారత్‌ బయోటెక్‌ ఏప్రిల్‌లో 2 కోట్ల కోవాగ్జిన్‌ డోసుల్ని ఉత్పత్తి చేశామని, మే చివరికల్లా మూడు కోట్ల డోసుల్ని అందిస్తామని చెప్పింది. అంటే ఎలా చూసుకున్నా ఎనిమిదిన్నర కోట్ల వ్యాక్సిన్‌ డోసులు ఉత్పత్తి కావాలి. కోవిన్‌ పోర్టల్‌ ప్రకారం చూసుకుంటే మే 22 రోజులకుగానూ రోజుకి 16.2 లక్షల చొప్పున వ్యాక్సిన్‌లను డెలివరీ చేశాయి. మే 16 నుంచి 22 మధ్య ఆ డెలివరీ ఏకంగా 13 లక్షల డోసులకు పడిపోయింది. అంటే రోజుకి 9.7 లక్షల డోసులు లెక్క తేడా వస్తోంది. అలాగే కంపెనీలు చెప్తున్న నెల వ్యాక్సిన్‌ డోసుల అవుట్‌పుట్‌కు, వ్యాక్సినేషన్‌కు తేడా వస్తోంది. ఇప్పుడున్న డెలివరీ ఇలాగే కొనసాగినా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఐదు కోట్ల డోసులతో ముగియొచ్చు. మరి మిగతా మూడుకోట్ల డోసుల మాటేంటన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. 

గప్పాలేనా?
ఈ నెల మొదట్లో సుప్రీం కోర్టుకు కేంద్రం వ్యాక్సినేషన్‌ మీద ఒక అఫిడవిట్‌ సమర్పించింది. నెలకు సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఆరున్నర కోట్ల కోవిషీల్డ్‌ డోసులను, భారత్‌ బయోటెక్‌ రెండు కోట్ల కోవాగ్జిన్‌ డోసులను ఉత్పత్తి చేయగలవని అందులో పేర్కొంది. జులై నాటికి కోవాగ్జిన్‌ సామర్థ్యం ఐదున్నర కోట్లకు పెరుగుతుందని, అలాగే స్ఫుత్నిక్‌ కోటిన్నర డోసులకు(ఇప్పుడు నెలకు ముప్ఫై లక్షలు ఉంది) పెరుగుతుందని రిపోర్ట్‌ సమర్పించింది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని బట్టి అది జరగకపోవచ్చనే మేధావులు అంచనా వేస్తున్నారు.

ఎనిమిదిన్నర కోట్లు ఉత్పత్తి చేసేప్పుడు.. కేవలం ఐదు కోట్లను డెలివరీ చేయడం, ప్రైవేట్‌ కోటా లాంటి విషయాల్లో క్లారిటీ వస్తేనే డోసుల లెక్క తేలేది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు వ్యాక్సిన్‌ కొరతను ఎదుర్కొంటున్నాయి. కొన్నిచోట్ల వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నిలిచిపోయింది. ఇలాంటి టైంలో ప్రైవేట్‌ ఆస్పత్రులకు వ్యాక్సిన్‌ సరఫరా నిలిపివేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ప్రధానికి లేఖ రాసిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement