సాక్షి, హైదరాబాద్: కోవిషీల్డ్ మొదటి, రెండో డోస్‌ల మధ్య కాలవ్యవధిని మొదట్లో ఉన్న మాదిరి 4 నుంచి 6 వారాలకు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వా న్ని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు కోరారు. టీకా డోసుల కొరత కారణంగా కాలవ్యవధిని గతంలో 12 వారాలకు పెంచడంతో లబ్ధిదారులు రెండో డోసు తీసుకోవడాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయకు లేఖ రాశారు.
వలస కూలీలు మొదటి డోస్ వేసుకున్నాక ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారని, వారిని గుర్తించి రెండో డోస్ వేయడం కష్టంగా మారిందన్నారు. మొదటి డోస్ వేసుకున్న వారి వివరాలు కొవిన్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తున్నా, ఆ జాబితా ఆ రాష్ట్రానికే పరిమితం కావడంతో వలస కూలీలను అప్రమత్తం చేయలేకపోతున్నామన్నారు. టీకాల మధ్య గడువును కుదిస్తే రెండో డోస్ వేసుకునే వారి సంఖ్య పెరుగుతుందని చెప్పారు. అలాగే వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వారియర్లు, హైరిస్క్ గ్రూప్ వారికి టీకా రెండో డోస్ వేసి 8–10 నెలలు దాటడం, కరోనా కొత్త వేరియెంట్లు వస్తుండటంతో వారికి బూస్టర్ డోస్ వేయాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు.
ఈ విషయాన్ని శుక్రవారం తనను కలిసిన విలేకరులకు మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ప్రస్తుతం తెలంగాణలోనే 75 లక్షల టీకా డోసులు ఉన్నాయని, వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసేందుకు కాల వ్యవధిని తగ్గించాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొదటి డోస్ 90 శాతం, రెండో డోస్ 46 శాతం వేశామన్నారు.
వ్యాక్సిన్‌పై ఇంటింటి సర్వేలు...
టీకాల పంపిణీ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ నమూనా దేశంలోనే ఆదర్శంగా ఉందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆరోగ్య కార్యకర్త, జీహెచ్‌ఎంసీ అధికారి ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు కౌన్సెలింగ్ చేశారని, అయితే గ్రామాల్లో వ్యాక్సినేషన్‌కు సరైన సహకారం అందడం లేదని తెలిపారు. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్‌పై పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలతో కలిసి ఇంటింటి సర్వే చేపడు తున్నామన్నారు. వ్యాక్సిన్ వేసుకున్న వారి ఇళ్లకు స్టిక్కర్లు పెడుతున్నామన్నారు. ఇప్పటివరకు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో మొత్తం 3.82 కోట్ల కరోనా డోసులను వేశామన్నారు.
విమానాశ్రయంలో టెస్ట్‌లు...
శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ ప్రయాణికులకు కరోనా పరీక్షలను తప్పనిసరి చేసినట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. పాజిటివ్‌గా తేలిన వారిని ‘టిమ్స్’కు పంపి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపుతున్నామని చెప్పారు. ఒకవేళ ఒమిక్రాన్ వస్తే పూర్తిగా నయమయ్యాకే టిమ్స్ నుంచి బయటకు పంపుతామన్నారు. ప్రభుత్వంలో 27 వేలకుపైగా పడకలుంటే, వాటిల్లో 25 పడకలకు ఆక్సిజన్‌ను సమకూర్చామన్నారు. అలాగే అందులో 6 వేలు ఆక్సిజన్, ఐసీ యూ పడకలను పిల్లల కోసం సిద్ధం చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment