క్యాథ్‌ల్యాబ్‌ను పరిశీలిస్తున్న మంత్రులు హరీశ్‌రావు, మహమూద్ అలీ, తలసాని
సాక్షి, హైదరాబాద్: దక్షిణాఫ్రికా, యూకే తదితర దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పిలుపునిచ్చారు. మన దేశంలో కేరళ, మహారాష్ట్రలో కేసులు పెరుగుతున్నాయని, అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని అధికారులకు సూచించారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టంచేశారు.
ప్రపంచవ్యాప్తంగా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి, ప్రభావం ఎలా ఉందో ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తూ ఉండాలని, దీనిపై రోజువారీ పరిశీలన చేసేందుకు ప్రత్యేకంగా కమిటీని నియమించాలని ఆదేశించారు. కరోనా పరిస్థితులు, ఒమిక్రాన్ వేరియంట్, థర్డ్‌వేవ్ సన్నద్ధతపై మంగళవారం బీఆర్‌కే భవన్‌లో హరీశ్‌రావు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. థర్డ్‌వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
21 లక్షల హోం ఐసోలేషన్ కిట్లు సిద్ధం చేయాలని, 545 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సదుపాయం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 27,996 పడకలకుగాను 25,826 పడకలకు ఆక్సిజన్ సౌకర్యం కల్పించడం పూర్తయిందని, మిగతా పడకలకు వేగంగా ఆక్సిజన్ సౌకర్యం కల్పించాలని చెప్పారు. సెంట్రల్ డ్రగ్ స్టోర్లలో ఔషధాల నిల్వలను కచ్చితంగా ఉంచాలని సూచించారు. ప్రతి ఒక్కరూ 2 డోసుల వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
ఆరోగ్య తెలంగాణ దిశగా..
అఫ్జల్‌గంజ్ (హైదరాబాద్): రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు ఆధునిక సౌకర్యా లతో నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. మంగళవారం ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో రూ.8 కోట్ల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన క్యాథ్‌ల్యాబ్, సీటీ స్కాన్‌లను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఎమ్మెల్సీలు ఎంఎస్.ప్రభాకర్, ఫరూఖ్ హుసేన్‌లతో కలసి ప్రారంభించారు.
తర్వాత వార్డుల్లోకి వెళ్లి రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. ఆయా విభాగాల్లో సిబ్బంది కొరత, ఏఏ పరికరాలు కావాలనే విషయమై ఉన్నతాధికారులతో చర్చించా రు. ఉస్మానియాతోపాటు రాష్ట్రంలోని అన్ని బోధనాసుపత్రులను అభివృద్ధి చేసి ఆరోగ్య తెలంగాణగా మార్చాలనే సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నట్లు హరీశ్‌రావు చెప్పారు. గాంధీ ఆసుపత్రితోపాటు వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో మరో నాలుగు క్యాథ్‌ల్యాబ్‌లను త్వరలోనే అందుబాటులోకి తెస్తామన్నారు.
‘ఉస్మానియా ఆసుపత్రికి ఎన్‌ఏబీహెచ్ (జాతీయ ఆస్పత్రులు, ఆరోగ్య సంస్థల గుర్తింపు మండలి) గుర్తింపు కోసం దరఖాస్తు చేస్తున్నాం. దీనివల్ల ఆసుపత్రికి మరిన్ని సౌకర్యాలు అందుతాయి. దేశంలోనే అత్యాధునిక సౌకర్యాలతో కూడిన మార్చురీ నిర్మాణం కోసం రూ.5 కోట్లు మంజూరు చేస్తున్నాం’ అని హరీశ్‌రావు చెప్పారు. గోవాతోపాటు ఇతర దేశాల్లోని అత్యాధునిక మార్చురీలను సందర్శించి అక్కడి పద్ధతులను అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని వైద్య అధికారులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment