సిద్ధంగా ఉన్నాం.. జాగ్రత్తగా ఉందాం! | Telangana CM KCR Says Don't Panic On Omicron Variant | Sakshi
Sakshi News home page

సిద్ధంగా ఉన్నాం.. జాగ్రత్తగా ఉందాం!

Published Tue, Jan 4 2022 2:21 AM | Last Updated on Tue, Jan 4 2022 10:21 AM

Telangana CM KCR Says Don't Panic On Omicron Variant - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ విషయమై ప్రజలు భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. అదే సమయంలో అజాగ్రత్త కూడా పనికిరాదని చెప్పారు. నిరంతరం అప్రమత్తంగా ఉంటూ స్వీయ నియంత్రణ చర్యలు పాటించాలన్నారు. పని ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉంటూ మాస్క్‌ ధరించాలని, ప్రభుత్వం జారీ చేసే కోవిడ్‌ నిబంధనలను పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లతో కరోనాను ఎదుర్కొనేందుకు సర్వ సన్నద్ధంగా ఉందని స్పష్టం చేశారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం సోమవారం ప్రగతిభవన్‌లో వైద్యారోగ్య శాఖపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు టి.హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఇంద్రకరణ్‌ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్, వైద్యశాఖ కార్యదర్శి ఎస్‌ఏఎం రిజ్వీ, అధికారులు  శ్రీనివాసరావు, రమేశ్‌ రెడ్డి,  గంగాధర్, చంద్రశేఖర్‌ రెడ్డి పాల్గొన్నారు.

‘రాష్ట్రంలో కరోనా ప్రబలే ప్రమాదం ఉన్నందున ప్రజలు గుంపులు గుంపులుగా చేరకుండా చూడాలి. బహిరంగ సభలు, ర్యాలీలు లేకుండా తగు చర్యలు తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించే పరిస్థితులు లేవు. అవసరం కూడా లేదు’ అని వైద్యారోగ్య శాఖ అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడారు. 

ఆక్సిజన్‌ ఉత్పత్తి సామర్ధ్యం, ఐసొలేషన్, టెస్టింగ్‌ కిట్లు పెంచండి 
‘రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానాల్లో అన్ని రకాల మౌలిక వసతులను పటిష్ట పరచాలి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానాల్లో ఉన్న 99 శాతం బెడ్లను ఇప్పటికే ఆక్సిజన్‌ బెడ్లుగా మార్చారు. మిగిలిన మరో శాతాన్ని కూడా తక్షణమే ఆక్సిజన్‌ బెడ్లుగా మార్చాలి. అలాగే ఆక్సిజన్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని 140 మెట్రిక్‌ టన్నుల నుంచి 324 మెట్రిక్‌ టన్నులకు పెంచుకోగలిగాం. దీనిని 500 మెట్రిక్‌ టన్నులకు పెంచాలి. హోం ఐసోలేషన్‌ కిట్ల లభ్యతను 20 లక్షల నుంచి ఒక కోటికి, 

టెస్టింగ్‌ కిట్ల సంఖ్యను సైతం 35 లక్షల నుంచి రెండు కోట్లకు పెంచాలి. అన్ని దవాఖానాల్లో వైద్యులు తక్షణం అందుబాటులో ఉండేలా చూడాలి. ఖాళీలను సత్వరమే భర్తీ చేయాలి. ఏ కారణం చేతనైనా ఖాళీలు ఏర్పడితే 15 రోజుల్లో భర్తీ చేసుకునే విధంగా విధివిధానాలను రూపొందించాలి. జనాభా ప్రాతిపదికన రాష్ట్రంలో వైద్యులు, బెడ్లు, మౌలిక వసతులను పెంచుకొని వైద్యసేవలను మెరుగుపరచాలి..’ అని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టర్‌ కార్యాలయాల్లోకి పలు శాఖల కార్యాలయాలు మారుతున్న దృష్ట్యా ఖాళీ అయిన పాత కలెక్టరేట్‌ కార్యాలయాలు, ఆయా శాఖల భవనాలను, స్థలాలను విద్యా, వైద్య శాఖల అవసరాలకు ప్రత్యేకించి కేటాయించాలని ఆదేశించారు. పది వేల మంది కిడ్నీ రోగులకు డయాలిసిస్‌ సేవలు అందుతున్న నేపథ్యంలో డయాలిసిస్‌ మిషన్లను మరిన్ని పెంచి సేవలను విస్తృతం చేయాలని సూచించారు. 

అన్నిచోట్లా బస్తీ దవాఖానాలు 
‘హైదరాబాద్‌ తరహాలో బస్తీ దవాఖానాలను నగరపాలికలకు విస్తరించాలి. జీహెచ్‌ఎంసీ పరిధిలో కూడా వీటి సంఖ్యను పెంచాలి. హెచ్‌ఎండీఏ పరిధిలోని కంటోన్మెంట్‌ జోన్‌ పరిధిలో ప్రజలకు సరైన వైద్య సేవలు మెరుగుపరిచేందుకు వార్డుకొకటి చొప్పున 6 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలి. రసూల్‌పురలో 2, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, ఉప్పల్, మల్కాజిగిరి, జల్‌పల్లి, మీర్‌పేట, పీర్జాదిగూడ, బోడుప్పల్, జవహర్‌ నగర్, నిజాంపేటలో ఒకటి చొప్పున బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలి.

వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో 4, నిజామాబాద్‌లో 3, మహబూబ్‌ నగర్, నల్లగొండ, రామగుండం, ఖమ్మం, కరీంనగర్‌లో రెండు చొప్పున, జగిత్యాల, సూర్యాపేట, సిద్దిపేట, మిర్యాలగూడ, కొత్తగూడెం, పాల్వంచ, నిర్మల్, మంచిర్యాల, తాండూరు, వికారాబాద్, బోధన్, ఆర్మూర్, కామారెడ్డి, సంగారెడ్డి, జహీరాబాద్, గద్వాల్, వనపర్తి, సిరిసిల్ల, తెల్లాపూర్, బొల్లారం, అమీన్‌ పూర్, గజ్వేల్, మెదక్‌ పురపాలికల్లో ఒకటి చొప్పున ఏర్పాటు చేయాలి..’ అని కేసీఆర్‌ ఆదేశించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement