
సాక్షి, హైదరాబాద్: సోదరసోదరీమణుల మధ్య బంధానికి ప్రతీక అయిన రక్షాబంధన్ పర్వదినాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారిక నివాసం ప్రగతి భవన్‌లో ఘనంగా నిర్వహించారు. సీఎం కేసీఆర్‌కు అక్కలు వినోదమ్మ, సకలమ్మ, లలితమ్మ, జయమ్మ, లక్ష్మీబాయి రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన సీఎం.. సోదరసోదరీమణుల మధ్య ప్రేమ, ఆప్యాయతలకు ఈ పండుగ ప్రతీక అన్నారు. మహిళలను గౌరవించాలనే నిబద్ధతను ఈ పండుగ తెలియజేస్తుందన్నారు. రాష్ట్రంలో మహిళల భద్రత, గౌరవాన్ని పరిరక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. అలాగే, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావుకు ఆయన సోదరి, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత రాఖీ కట్టారు. ప్రగతిభవన్‌లో జరిగిన ఈ వేడుకలో సీఎం కేసీఆర్ సతీమణి శోభారాణి, కేటీఆర్ భార్య శైలిమ పాల్గొన్నారు. పండుగ సందర్భంగా టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన పలువురు మహిళా ప్రజాప్రతినిధులు, ఇతరులు కేటీఆర్‌కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే గొంగిడి సునీత, జెడ్పీ చైర్‌పర్సన్ గండ్ర జ్యోతి, టీఆర్‌ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు గుండు సుధారాణి తదితరులు కేటీఆర్‌కు రాఖీ కట్టిన వారిలో ఉన్నారు.
ఆత్మీయ అనుబంధానికి ప్రతీక: హరీశ్‌రావు
రాఖీ పర్వదినం సోదరసోదరీమణుల ఆత్మీయ అనుబంధానికి ప్రతీక అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. రక్షాబంధన్ సందర్భం గా కొండాపూర్‌లోని మంత్రి నివాసంలో పలువురు టీఆర్‌ఎస్ మహిళా నేతలు హరీశ్‌కు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మీయతను పంచుకుంటూనే కరోనా నేపథ్యంలో స్వీయ రక్షణ పాటించాలని ఈ సందర్భంగా హరీశ్‌పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment