సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల ఒకటో తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ కరోనా టీకా ఇవ్వాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలో ఆ వయసు వారు 2.62 కోట్ల మంది ఉంటారని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. అందులో 18-44 ఏళ్ల వయస్కులు 1.82 కోట్ల మంది ఉంటారని, వారు కొత్తగా వ్యాక్సిన్‌కు అర్హులవుతారని అంచనా వేసింది. ప్రస్తుతం 45 ఏళ్లు పైబడినవారు 80 లక్షల మంది ఉండగా వారందరికీ వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. అందులో ఇప్పటికే 28 లక్షల మందికి టీకా వేశారు. ఇక 18-45 ఏళ్ల మధ్య వయసులోని 1.82 కోట్ల మందికి మే 1 నుంచి వ్యాక్సిన్ వేస్తారు. 45 ఏళ్లు పైబడిన వారికి ఎప్పటిలాగే ప్రభుత్వం ఉచితంగా టీకా వేస్తుంది. కానీ 18-45 లోపు వయసు వారి నుంచి నిర్దిష్ట రుసుము తీసుకొని టీకాలు వేసేందుకు ప్రైవేటు సంస్థలకు కేంద్రం అనుమతి ఇచ్చింది.
తక్కువ సమయంలో ఎక్కువ మందికి...
కరోనా సెకండ్ వేవ్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. ఒక కుటుంబంలో ఎవరికైనా వస్తే అందరికీ వ్యాపించే పరిస్థితి నెలకొంది. సెకండ్ వేవ్‌లో ఎక్కువగా యువత వైరస్ బారిన పడుతోంది. ఉపాధి, ఉద్యోగాల్లో ఆ వయసువారే ఎక్కువగా ఉండటం, పైగా చాలా మంది నిర్లక్ష్యం వహించడంతో పరిస్థితి అత్యంత తీవ్రంగా మారింది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. అయితే ప్రస్తుతం కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలే అందుబాటులో ఉండటంతో వాటి కొరత వల్ల డోస్‌లు పూర్తిస్థాయిలో రాష్ట్రానికి రావడం లేదు. దీంతో అనేక ప్రభుత్వ, ప్రైవేటు కేంద్రాల్లో నిల్వలు లేక ప్రజలను వెనక్కు పంపుతున్నారు. అన్ని కంపెనీలకు అనుమతి ఇవ్వడం వల్ల టీకాలు విరివిగా అందుబాటులోకి వస్తాయి. పైగా తక్కువ సమయంలో ఎక్కువ మందికి టీకాలు ఇవ్వొచ్చు. రోజుకు 10 లక్షల మందికి టీకాలు వేసే సామర్థ్యం ప్రభుత్వ యంత్రాగానికి ఉంది. ఆ ప్రకారం జరిగితే తెలంగాణలో ఇప్పటివరకు వేసిన వారిని మినహాయిస్తే కేవలం 23 రోజుల్లోనే 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా వేయవచ్చు. ఎలాంటి కొరత లేకుండా టీకాలు సరఫరా అయితే మేలోనే టీకా కార్యక్రమాన్ని పూర్తి చేయవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఉచితమా.. కాదా?
ఈ ఏడాది జనవరి 16 నుంచి దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమవగా తొలుత వైద్య సిబ్బందికి, తర్వాత ఫ్రంట్‌లైన్ వర్కర్లకు వేశారు. ఆ తర్వాత 60 ఏళ్లు పైబడిన వారందరికీ, 45-59 ఏళ్ల వయసులో ఉన్న దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వేశారు. ఆ తర్వాత 45 ఏళ్లు పైబడిన వారందరికీ ఇస్తున్నారు. అందులో వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉచితంగా టీకాలు ఇచ్చారు. 45 ఏళ్లు పైబడిన వారికి మాత్రం ప్రభుత్వంలో ఉచితంగా వేస్తుండగా ప్రైవేటులో ఒక డోస్‌కు రూ.250 వసూలు చేస్తున్నారు. ఇప్పుడు 18-44 ఏళ్ల మధ్య వయసులోని వారికి ఉచితంగా ఇవ్వబోమని కేంద్రం ప్రకటించగా ఆ వయసు వారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా టీకా వేయడంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీనిపై సీఎం కేసీఆర్ త్వరలో నిర్ణయం తీసుకుంటారని వైద్య వర్గాలు తెలిపాయి. అలాగే మే ఒకటి నుంచి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎన్ని కేంద్రాల్లో టీకా వేయాలన్న దానిపైనా అధికారులు కసరత్తు ప్రారంభించారు. అయితే ప్రైవేటు ఆస్పత్రుల్లో మే ఒకటో తేదీ నుంచి వేసే టీకాపై ప్రభుత్వ పర్యవేక్షణ ఎలా ఉండాలో కూడా కసరత్తు చేస్తున్నారు. ఆస్పత్రులకు రాని వారికి ఇళ్లకు వెళ్లి టీకాలు వేసే కార్యక్రమం ఏమైనా ఉంటుందా అనే దానిపైనా నిర్ణయం తీసుకోనున్నారు.
కరోనా టీకా: జనాభాలో యవ్వనులే అధికం
Published Wed, Apr 21 2021 2:50 AM | Last Updated on Wed, Apr 21 2021 4:57 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment