వాక్సినేషన్ పాస్‌పోర్ట్ విషయంలో కొవాగ్జిన్, కొవిషీల్డ్ సర్టిఫికేషన్‌ను యూరోపియన్ యూనియన్ అనుమతించకపోవడంపై కేంద్రం సీరియస్ అయ్యింది. బదులుగా యూరోపియన్ దేశాల నుంచి ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొక తప్పదని పరోక్షంగా హెచ్చరించింది.
న్యూఢిల్లీ: ఈయూ దేశాల్లో.. అలాగే సభ్యదేశాల మధ్య ప్రయాణించేవారికి డిజిటల్ కొవిడ్ సర్టిఫికెట్ జారీ చేస్తున్నారు. అలాగే డిజిటల్ గ్రీన్‌పాస్ ఉంటేనే ప్రయాణానికి అనుమతిస్తున్నారు. అయితే ఈయూ ఆమోదిత వ్యాక్సిన్ల లిస్ట్‌లో భారత్‌లో తయారవుతున్న కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్లను అనుమతించకపోతుండడం తెలిసిందే. ఎక్కువ మంది భారతీయలు తీసుకుంటున్న కొవిషీల్డ్‌కూ సైతం చోటు దక్కకపోవడంతో.. భారతీయ ప్రయాణికులకు ఇబ్బందికర అంశమనే ఆందోళన వ్యక్తం అయ్యింది. ఈ నేపథ్యంలో జోక్యం చేసుకోవాలని సీరం సంస్థ భారత ప్రభుత్వాన్ని కోరడంతో.. కేంద్రం త్వరగతిన స్పందించింది.
తక్షణమే రెండు వ్యాక్సిన్‌లకు అనుమతి ఇవ్వాలని, లేకుండా ఈయూ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ఇబ్బందులు తప్పదని పేర్కొంది. ఆ ప్రయాణికుల వ్యాక్సిన్ పాస్‌పోర్ట్‌లను అనుమతించమని, పైగా కఠిన క్వారంటైన్ నిబంధనలను అమలు చేయాల్సి ఉంటుందని పరోక్షంగా ఈయూ ఏజెన్సీ(27 దేశాల సమాఖ్య)ని హెచ్చరించింది కేంద్రం. ఒకవేళ అనుమతిస్తే మాత్రం.. క్వారంటైన్ నిబంధనలను సడలిస్తామని కూడా తెలిపింది. ఇక ఈయూ డిజిటల్ కోవిడ్ సర్టిఫికెట్ లిస్ట్‌లో మనదగ్గర తయారైన రెండు వ్యాక్సిన్లకు మొదటి ఫేజ్‌లోనే చోటు ఇవ్వలేదు. గ్రీన్ పాస్ ప్రకారం.. కనీసం కొవిషీల్డ్ తీసుకున్నవాళ్లకైనా అనుమతి ఇవ్వాలనే విజ్ఞప్తులు వెల్లువెత్తాయి. అయినప్పటికీ యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ స్పందించలేదు. అనుమతులు ఉన్న ఫైజర్, మోడెర్నా, ఆస్ట్రాజెనెకా, జనస్సెన్ వ్యాక్సిన్‌లకు చోటిచ్చింది. ఇండియన్ వెర్షన్ ఆస్ట్రాజెనెకా ‘కొవిషీల్డ్’కు కూడా చోటు ఇవ్వలేదు. ఇక ఈ అనుమతులు మెరిట్ ప్రతిపాదికన మాత్రమే ఉంటాయని యూరోపియన్ యూనియన్ రాయబారి ఉగో అస్టుటో వెల్లడించాడు.
ఈయూ వివరణ
ఇక తాజా పరిణామాలపై యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ(ఈఎంఏ) స్పందించింది. కొవిడ్ నేపథ్యంలో ఈయూ సభ్యదేశాల మధ్య ఆటంకాల్లేని ప్రయాణం కోసం గ్రీన్‌పాస్ జారీ చేస్తున్నారని వివరించింది. ‘వ్యాక్సిన్ తీసుకున్నట్టు ధ్రువీకరించడమే గ్రీన్ పాస్ జారీ లక్ష్యం. ఈ సర్టిఫికెట్ కోసం ఫైజర్/బయోఎన్‌టెక్, మెడెర్నా, వాక్స్‌జెర్విరియా, జన్‌స్సెన్ వ్యాక్సిన్లను మాత్రమే ఈఎంఏ ఆమోదించింది’ అని ఈయూ వర్గాలు తెలిపాయి. అయితే కొవిషీల్డ్‌ను గ్రీన్ పాస్ జాబితాలో చేర్చాలంటూ అభ్యర్థనలేవీ రాలేదని ఇంతవరకు అందలేదని వ్యాఖ్యానించడం కొసమెరుపు. ఇక ఈ వ్యవహారంపై సీరం సీఈవో అదర్ పూనావాలా స్పందించాడు. ఈయూ కొవీషీల్డ్‌ను అనుమతిస్తుందన్న విశ్వాసం ఉందని, అందుకు నెల టైం పట్టొచ్చని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.
చదవండి: కొవిషీల్డ్ డోస్ గడువు మళ్లీ పెంపు.. ఈసారి ఎంతంటే..
Comments
Please login to add a commentAdd a comment