
రియో డి జనీరో: బ్రెజిల్ పై కరోనా తీవ్ర ప్రభావం చూపుతూనే ఉంది. దేశంలో రోజుకు లక్షకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనాను కట్టడి చేయడానికి వ్యాక్సిన్ ప్రక్రియను వేగవంతం చేయాలని భావిస్తోంది. అందుకు గాను గత నెలలో బ్రెజిల్ ప్రభుత్వం భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాక్జిన్ ను 20 మిలియన్ డోసులను కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. కాగా మంగళవారం రోజున కోవాక్జిన్ దాని తయారీ ప్రమాణాలకు అనుగుణంగా లేదని బ్రెజిల్ హెల్త్ రెగ్యులేటర్ అన్విసా ఆరోపించారు.
ఈ నేపథ్యంలో భారత్ బయోటెక్ బ్రెజిల్ భాగస్వామి ప్రెసిసా మెడికామెంటోస్ తో కలిసి ఒక ప్రకటనను విడుదల చేశారు. కోవాక్జిన్‌పై బ్రెజిల్ హెల్త్ రెగ్యులేటర్ చేసిన ప్రకటనలను సాక్షాధారాలతో నివృత్తి చేస్తామని తెలిపారు. వ్యాక్సిన్ ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేశామని అన్నారు. అంతేకాకుంగా కోవాక్జిన్ భారత్‌తో సహా ఐదు దేశాల్లో ఆమోదించారనే విషయాన్ని గుర్తుచేశారు. భారత్ బయోటెక్ మార్చి 8 న బ్రెజిల్లో టీకా అత్యవసర ఉపయోగం కోసం దరఖాస్తు చేసింది.
కాగా కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా 918.08 మిలియన్ డాలర్లు కొత్త రుణాలను పంపిణీ చేయాలనే ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వుపై బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో మంగళవారం సంతకం చేశారు. కరోనా నియంత్రణలో పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలను బోల్సోనారో ఖండించారు. కొత్త రుణాలతో బ్రెజిల్ ఆరోగ్య వ్యవస్థ మరింత పటిష్టమవుతుందని బ్రెజిల్ ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. రియో డి జనీరో రాష్ట్రంలో మంగళవారం రోజున తీవ్ర ఎండను సైతం లెక్క చేయకుండా బ్రెజిల్ పౌరులు టీకా కోసం ఆస్పత్రుల వద్ద బారులు తీరారు.
Comments
Please login to add a commentAdd a comment