డాక్టర్ ఆంటోనీ ఫౌచీ
వాషింగ్టన్: స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన భారత్ బయోటెక్ కంపెనీకి చెందిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ దేశంలోని డబుల్ మ్యూటెంట్‌ను సమర్థంగా అడ్డుకుంటోందని అమెరికాలోని వైట్ హౌస్ చీఫ్ మెడికల్ అడ్వయిజరీ ఆఫీసర్ డాక్టర్ ఆంటోనీ ఫౌచీ వెల్లడించారు. దేశంలో రెండుసార్లు జన్యు మార్పిడికి లోనైన కరోనా వైరస్ బి.1.617 కారణంగా దేశాన్ని అతలాకుతలం చేస్తున్న సెకండ్ వేవ్‌ను కోవాగ్జిన్ టీకా అత్యంత సమర్థవంతంగా అడ్డుకుంటుందని తాము చేసిన అధ్యయనంలో వెల్లడైనట్టు మంగళవారం ఆయన వెల్లడించారు. భారత్‌లో కోవాగ్జిన్ వ్యాక్సిన్ తీసుకున్న వారి డేటాను సేకరించి తాము పరిశీలిస్తే వారిలో బి.1.617 రకం వైరస్‌ను తట్టుకొనే యాంటీబాడీలు బాగా అభివృద్ధి చెందినట్టుగా డాక్టర్ ఫౌచీ తెలిపారు.
భారత్‌లో సెకండ్ వేవ్‌కు అడ్డుకట్ట పడాలంటే అందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసుకోవాలని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఆర్) సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ టీకాను జనవరి 3 నుంచి అత్యవసర వినియోగానికి అనుమతులిచ్చారు. ఈ వ్యాక్సిన్ 78శాతం సమర్థవంతంగా పని చేస్తున్నట్టుగా పరిశోధనల్లో వెల్లడైంది. కోవాగ్జిన్‌తో పాటుగా, సీరమ్ ఇన్‌స్టిట్యూట్ తయారు చేస్తున్న కొవిషీల్డ్ కూడా భారత్ కొత్త రకం కరోనా సమర్థంగా ఎదుర్కొంటుందని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయోలజీ (ఐజీఐబీ) అధ్యయనం వెల్లడైనట్టు ఆ సంస్థ డైరెక్టర్ అనురాగ్ వెల్లడించారు.
కోవిషీల్డ్‌తో ఇంట్లో 50% కేసులు కట్
లండన్ : అమెరికాకు చెందిన ఫైజర్, బ్రిటన్ ఆ స్ట్రాజెనికా కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఒక్క డోసు తీసుకుంటే కుటుంబ సభ్యుల్లో వైరస్ వ్యాప్తిని 50 శాతం తగ్గించవచ్చునని బ్రిటన్ అధ్యయనంలో వెల్లడైంది. వ్యాక్సిన్ సింగిల్ డోసు తీసుకున్న వారి నుంచి వైరస్ 38 నుంచి 49 శాతం వరకు ఇతర కుటుంబ సభ్యులకు వ్యాప్తి చెందడం లేదని ది పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ (పీహెచ్‌ఈ)లో అధ్యయనంలో తేలింది. వ్యాక్సిన్ తీసుకోని వారితో కలిసి తిరిగిన 10 లక్ష మంది వివరాలు తెలుసుకొని, ఆ గణాంకాలతో 24 వేల ఇళ్లలో వ్యాక్సిన్ తీసుకున్న వారితో కలిసి మెలిసిన ఉన్న 57 వేల మంది వివరాలను పరిశీలించి చూస్తే వ్యాక్సిన్ తీసుకున్న వారి కంటే టీకా తీసుకోని వారి నుంచి ముప్పు అధికంగా ఉంది. టీకా డోసు తీసుకున్న వారు ఒక్కో ఇంట్లో 50 శాతం కేసుల వరకు అడ్డు కట్ట వెయ్యగలిగారు. కరోనా సెకండ్ వేవ్‌లో ఇంట్లో ఒకరికి వైరస్ సోకితే ఇంటిల్లి పాదికి పాజిటివ్ రావడం చూస్తున్నాం. ఇలాంటి సమయంలో ఇంగ్లండ్ నిర్వహించిన పరిశోధనలు ఆత్మ విశ్వాసాన్ని నింపాయి.
17 దేశాలకు విస్తరించిన భారత్ డబుల్ మ్యూటెంట్
జెనీవా: భారత్‌లో రెండు సార్లు జన్యుమార్పిడికి లోనైనా కరోనా వైరస్ 17 దేశాలకు వ్యాప్తి చెందిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఈ వైరస్‌ను బి.1.617 భారత్ రకం అని పిలుస్తున్నారు. ఈ డబుల్ మ్యూటెంట్ వైరస్‌తోనే భారత్‌లో కేసులు భారీగా పెరిగిపోయాయి. ఏప్రిల్ 27 నాటికి భారత్ వైరస్ రకం కేసులు 17 దేశాల్లో బయటపడ్డాయని డబ్ల్యూహెచ్‌ఒ తన వారంతాపు నివేదికలో వెల్లడించింది. ఈ రకం వైరస్ కేసులో ఎక్కువగా భారత్, బ్రిటన్, అమెరికా, సింగపూర్ నుంచి వస్తున్నాయి. వైరస్‌లకు సంబంధించిన జన్యు మార్పులపై డేటాను సేకరించి భద్రపరిచే జిశాడ్ సంస్థ ఈ వివరాలు అందించినట్టుగా డబ్ల్యూహెచ్‌ఒ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment