న్యూఢిల్లీ: భారత్ బయోటెక్ సంస్థకు చెందిన కోవాగ్జిన్ కోవిడ్ టీకాకు వచ్చే ఆరు వారాల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అత్యవసర వినియోగ అనుమతిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ విషయాన్ని డబ్ల్యూహెచ్‌ఓ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య స్వామినాథన్ వెల్లడించారు. సెంటర్ ఫర్ సైన్స్‌అండ్ ఎన్విరాన్‌మెంట్ (సీఎస్‌ఈ) ఏర్పాటు చేసిన ఒక వెబినార్‌లో పాల్గొన్న సందర్భంగా ఆమె మాట్లాడారు. డబ్ల్యూహెచ్‌ఓ అత్యవసర వినియోగ జాబితా(ఈయూఎల్)లో ఏదైనా కొత్త టీకాను చేర్చాలంటే అది నిర్దేశిత పనితీరు స్థాయిని చేరుకోవాల్సి ఉంటుందని ఆమె వ్యాఖ్యానించారు. కనీసం మూడు నుంచి నాలుగు ట్రయల్స్‌కు చెందిన వివరాలను డబ్ల్యూహెచ్‌ఓకు అందించాలని తెలిపారు.
డబ్ల్యూహెచ్‌ఓలోని నిపుణుల సలహా బృందం ఆయా సమాచారాన్ని విశ్లేషించి అనుమతుల జారీపై తమ సూచనలు ఇస్తుందని ఆమె పేర్కొన్నారు. కోవాగ్జిన్‌కు చెందిన సమాచారం ఇప్పటికే డబ్ల్యూహెచ్‌ఓకు చేరిందని అని తెలిపారు. నెలన్నరలోగా కోవాగ్జిన్ అత్యవసర వినియోగ జాబితాలో చేరే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే ఫైజర్/బయోఎన్‌టెక్, ఆస్ట్రాజెనెకా–ఎస్‌కే బయో/ సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఆస్ట్రాజెనెకా ఈయూ, జాన్సెన్, మోడెర్నా, సినోఫార్మ్ టీకాలను డబ్ల్యూహెచ్‌వో తమ ఈయూఎల్ జాబితాలో ఇప్పటికే చేర్చింది. మరో 105 వ్యాక్సిన్‌లు కూడా వివిధ దశల ట్రయల్స్‌లో ఉన్నాయని వెల్లడించారు. అందులో 27 వ్యాక్సిన్లు మూడు/నాలుగు ట్రయల్స్‌ను దాటాయని పేర్కొన్నారు. మరో 184 వ్యాక్సిన్లు ప్రీ క్లినికల్ దశలో ఉన్నాయని చెప్పారు. ఇటీవల డెల్టా వేరియంట్ తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ, జాగ్రత్తలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment